టెడ్డీబేర్‌

Jun 16,2024 11:31 #chirumuvallu, #Sneha

బుడ్డిగాడికి పుట్టిన రోజంటే చాలా యిష్టం. తన పుట్టిన రోజే కాదు ఎవరి పుట్టిన రోజైనా యిష్టమే. ఎంచక్కా సాయంత్రం కాగానే తయారై వెళ్లొచ్చు. కేకులు, సమోసాలు తినొచ్చు, జేబునిండా చాక్లెట్లు, బిస్కెట్లు వస్తాయి. ఇంకా పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాల రిటర్న్‌ గిఫ్ట్‌లు వస్తాయి. వాడి పుట్టినరోజు వస్తోందంటే ఇంటిల్లిపాదినీ రోజూ విసింగేంచేవాడు. ‘అమ్మా..! ఇంకా ఎన్ని రోజులకు నా పుట్టినరోజు వస్తుంది? ఏమేం గిఫ్టులు కొంటున్నావ్‌’ అంటూ.
బుడ్డి పుట్టిన రోజు రానే వచ్చింది. వాడికి ఉదయం లేచినప్పటి నుండి ఎక్కడ లేని సంతోషం. నానమ్మ – తాత, తమ్ముడు, చెల్లెండ్లతో ఇల్లంతా హడావుడిగా తిరుగుతున్నాడు. సాయంకాలం అవుతుందంటే వాడిలో సంతోషంతో పాటు కుతూహలం కూడా పెరిగింది. ‘ఈ పుట్టిన రోజుకు బాబాయి-పిన్ని ఏ గిఫ్టు ఇస్తారో, అత్తలు ఏం తెస్తారో! లక్కీ కంటే నాకు మంచి గిఫ్టులు వస్తాయా?’ అంటూ వాడి ఆలోచనలన్నీ అటువైపే. కొత్త బట్టలు వేసుకుని, నానమ్మ-తాతలకు దండం పెట్టి కేక్‌ కట్‌ చేయగానే పిన్ని, బాబాయి, బావ, అత్త అందరూ వాడి చేతిలో తలా ఒక గిఫ్ట్‌ ప్యాక్‌ పెట్టారు. వాడి ఆనందానికి అంతులేకుండా పోయింది. వెంటనే ఆ గిఫ్ట్‌లను విప్పి చూడాలని ఉంది, కానీ అమ్మ తిడుతుంది. అందరూ వెళ్ళిపోయాక వెంటనే గిఫ్ట్‌ బాక్స్‌లు అన్నింటిని బుడ్డి, తమ్ముడు, చెల్లెండ్లు అందరూ కలిసి ఆదరబాదరగా విప్పేసారు. అంతే! పాపం అన్నీ టెడ్డీబేర్‌ బొమ్మలే! ఒక్క క్షణం హుష్‌ అని…అయితేనేం గిఫ్టంటే గిఫ్టే. వాటన్నింటినీ వరుసగా సర్దారు కబోర్డ్‌లో.

పత్తిపాక మోహన్‌
9966229548

➡️