స్త్రీలది అన్నింటా ఉన్నత స్థానమే..

Mar 3,2024 11:19 #Gender, #Sneha, #Women, #Women's Day
  • సమాజంలో ఆడపిల్లను అపురూపంగా భావించే వాళ్ళూ ఉన్నారు. ‘ఆడ’పిల్లేగా అని తేలికగా భావించేవాళ్ళూ ఉన్నారు. ఇలాంటి అసమాన భావాలు ఇంకా ప్రజల్లో ఉండటానికి అనేక కారణాలు. స్త్రీలు సమాజంలో అనేక వివక్షలకు గురవుతున్నారు. మహిళలకు గౌరవం, శ్రమకు విలువ ఇవ్వాలి. సమభావనతో చూడాలి అంటున్నారు కొందరు యువకులు. ‘వివాహ బంధాలు, వివక్ష’పై కొంతమంది యువకుల మనోగతాలు.

‘స్త్రీలు వృత్తిరీత్యా సమాజంతో మమేకమవుతున్నారు. వారికీ సొంత అభిప్రాయాలు ఉంటున్నాయి. పెళ్లయ్యాక కొద్దికాలమన్నా వారిద్దరే కలసి ఉంటే, ఒక అవగాహన వస్తుంది. పటిష్టమైన రక్షణవ్యవస్థ అమలుచేస్తే వివక్షకు తావుండదు. కుటుంబంలో, సమాజంలో మహిళ ఎప్పుడూ గౌరవనీయురాలే.. ఆమెది ఎప్పుడూ ఉన్నత స్థానమే’ అంటారు బి.టెక్‌ చదివిన సంజరు.

  • కూతురికీ గౌరవం ఇవ్వాలి..

‘పెళ్లి విషయాల్లో మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉండటం లేదు. తల్లిదండ్రులకు నచ్చినట్లే ఉండాలి. వారికి నచ్చినవారినే పెళ్లి చేసుకోవాలని వాదించడం సరికాదు. కూతురి అభిప్రాయాలకూ గౌరవం ఇవ్వాలి!’ అంటున్నారు నాగార్జున యూనివర్శిటీకి చెందిన కిషోర్‌రెడ్డి.

  • అగ్రగాములకూ ఆవేదనలే..

‘మనదేశంలో వివాహవ్యవస్థ క్రమంగా మారుతూ వచ్చింది. బాల్య వివాహాలు.. కన్యాశుల్కం.. సతీసహగమనం తదితర దురాచారాలలో స్త్రీ మాత్రమే బలవుతూ వచ్చింది. నేడు వివాహబంధాలు డబ్బుతో ముడిపడి బలహీనపడుతున్నాయి. ఒకరినొకరు అర్థంచేసుకుని, వివాహ నిర్ణయం తీసుకుంటే బంధం పటిష్టంగా ఉంటుందనేది నా అభిప్రాయం. వివక్ష సమాజంలోనే ఉంది. ప్రపంచ గుర్తింపు పొందిన రెజ్లర్స్‌ తీవ్ర వివక్షకు గురయ్యారు. రక్షకులే భక్షకులయ్యే పాలకుల నుండి ప్రజలు విముక్తి పొందినప్పుడు, రాజ్యాంగబద్ధ పాలన కొనసాగినప్పుడు స్త్రీ సమాజంలో స్వేచ్ఛగా మనగలుగుతుంది’ అని ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న రాజేంద్ర అన్నారు.

  • పెద్దవాళ్ళు ఆలోచించే చేస్తారు..

‘పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించే పెళ్ళి చేస్తారు. కొందరు విడిపోతున్నారంటే వాళ్ళ మధ్య అవగాహన లేకనే. ప్రేమపెళ్ళి, పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఏదైనా నిజాయితీగా ఉండాలి. జీవితాంతం కలసి సాగాలంటే అరమరికలు లేకుండా ఉండాలి’ అని డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ చేసిన మదన్‌ అన్నారు.

  • పెంపకంలోనే నేర్పాలి..

‘ఆడ,మగ అనే వివక్ష తల్లిదండ్రుల పెంపకంలోనే బీజం పడుతుంది. స్త్రీని గౌరవించాలి.. పురుషులతో సమానంగా చూడాలి. పాలకులూ అభివృద్ధికి అనుగుణంగా సనాతన కట్టుబాట్లు, మూఢ విశ్వాసాల నుండి ప్రజల్లో చైతన్యం తేవాలి. నేడు ఆడపిల్లలు చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే పెళ్లి చేసుకుంటే మంచిది. అప్పుడే వివక్ష అన్నింటా రూపుమాసి పోతుంది’ అని నాగార్జునా యూనివర్శిటీలో చదువుతున్న నవీన్‌కుమార్‌, ఉయ్యూరుకు చెందిన ఈదుల ప్రేమ్‌కుమార్‌ అంటున్నారు.

  • స్త్రీ విద్య తప్పనిసరి..

‘ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం ఉచితంగా అందించాలి.. అందరికీ విద్య తప్పనిసరి చేయాలి. ముఖ్యంగా స్త్రీవిద్య తప్పనిసరి చేసి, ఉచితంగా అందించాలి. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలి. మద్యపానం రద్దు చేయాలి. సామాజిక బాధ్యతతో ఉండేవారినే మనం ఎన్నుకుంటే కొంతవరకు మహిళా వివక్ష అరికట్టవచ్చు’ అంటున్నారు నవీన్‌, సుధీర్‌.రెండోవైపూ చూడాలి..’ప్రభుత్వాలు పథకాలన్నీ మహిళలకే ఇచ్చి, అసమానతలు సృష్టించి ఓట్లు దండుకుంటున్నారు. ఒకవైపే కాదు రెండోవైపూ చూడాలి. అది అర్థమవ్వాలంటే ఉన్నత చదువులు, ఉద్యోగాలు అందరికీ అందుబాటులో ఉంచాలి. అప్పుడే అందరిలో మార్పు వస్తుంది’ అంటున్నారు నవీన్‌.

  • అపార్థాలు కూడదు..

‘స్త్రీలను మేం గౌరవించినా అపార్థం చేసుకుంటారు. వాళ్ళూ మమ్మల్ని అర్థం చేసుకోవాలి. నేనూ సంపాదిస్తున్నా.. నా ఇష్టం వచ్చినట్లుంటాను అనే పద్ధతిలో ఉంటున్నారు. కొంతమంది అమ్మాయిలు ప్రేమించినట్లు నటించి, మోసం చేస్తున్నారు. చట్టాలన్నీ స్త్రీలకే అనుకూలంగా ఉన్నాయి. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళయితే సమస్యలు వచ్చినప్పుడు కుటుంబం చెల్లా చెదురవకుండా పరిష్కరిస్తారు. వివక్ష అనేది వాస్తవానికి పెద్దవాళ్ళ నుంచే మొదలవుతుంది. దానిని రూపుమాపాలంటే మహిళాచట్టాలు అమలు కావాలి. ప్రజల గురించి ఆలోచించే నేతలు రావాలి’ అంటారు సాఫ్ట్‌వేర్‌ పవన్‌.

  • కలిసి ఎదుర్కోవాలి..

‘మన వివాహ వ్యవస్థ కులం, మతం, ప్రాంతం, కుటుంబ సాంప్రదాయాల్ని బేస్‌ చేసుకుని ఏర్పడింది. కానీ పెళ్ళి అనేది జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సినది. దానికి ఒకరినొకరు అర్థం చేసుకోవటమే ముఖ్యం. ఒడిదుడుకులను కలసి ఎదుర్కోవాలి’ అంటారు బికాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న భార్గవ్‌.

– టి.టాన్యా

➡️