కథలను మీరూ అల్లేయొచ్చు!

Jun 16,2024 07:34 #Children, #Sneha, #special story, #Stories

పిల్లలూ,
మీరు చాలా కథలను విని ఉంటారు. లేదా చదివి ఉంటారు. మరి ఈ కథలన్నీ ఎక్కడివి? కథలేవీ వాటికవి పుట్టవు. ఎవరో ఒకరి ఊహాల్లోంచి, ఆలోచనల్లోంచి పుడతాయి. ఆ ఊహలూ, ఆలోచనలూ మాత్రం దేని ఆధారంగా వస్తాయి? మన చుట్టూ ఉన్న పరిసరాల్లోంచి, ప్రకృతిలోంచి, పరిస్థితుల్లోంచి వస్తాయి. ఆ ఊహలన్నిటి మధ్య ఒక చక్కని అల్లిక చేస్తే కథ వస్తుంది. నిజానికి పిల్లలకు కథలు అల్లడం చిన్నప్పటి నుంచే అలవడుతుంది. మాటలు వస్తున్నప్పుడే బోలెడు ఊహలు కూడా వస్తాయి. బొమ్మలతో మాట్లాడ్డం, కుక్కపిల్లలూ, పిల్లలతో ఊసులాడ్డం అందులో భాగాలే! వాటి గురించి అమ్మో నాన్నో అడిగితే- బోలెడు బోలెడు ఊహలను కథలుగా అల్లేస్తూ భలే మజా చేస్తారు. కాబట్టి- కథలను అల్లటం పిల్లలందరికీ ఎప్పుడో, చిన్నప్పుడే తెలుసన్న మాట.

కథ అంటే ఒక ఊహ
కథ అంటే ఒక ఊహ. అది అలా నిజంగా జరిగి ఉండదు. కానీ, జరిగినట్టే ఉంటుంది. ఇలా జరిగితే బాగుణ్ణు అనిపించేలా ఉంటుంది. కథలో ఏముంటుంది? ఒక నీతి ఉంటుంది. అది చెడ్డవాళ్లకు గుణపాఠం కావొచ్చు. కనువిప్పు కావొచ్చు. చెడ్డ మీద మంచి సాధించిన విజయం కావొచ్చు. సాహసం, అద్భుతం, పరోపకారం, హాస్యం, ఎత్తుకు పైఎత్తు.. ఇలా ఏమైనా కావొచ్చు. కథ మామూలుగా మొదలవుతుంది. మధ్యలో ఒక సమస్య వస్తుంది. చివర్లో దానికొక పరిష్కారం లభిస్తుంది. కథ ముగిసేసరికి మనకు సంతోషం కలుగుతుంది. మంచివాళ్లు గెలవటం, చెడ్డవాళ్లకు బుద్ధి రావటం- ఇది దాదాపు అన్ని పిల్లల కథల సారాంశం. ఉదాహరణకు ఒక కథ చూద్దాం.

తాబేలు – కుందేలు కథ
తాబేలుకు నెమ్మదితనం సహజ గుణం. కుందేలుకు వేగం సహజ లక్షణం. రెంటికీ పోటీ పెడితే- కుందేలు గెలిస్తే అది సాధారణం. అప్పుడది కథ అవ్వదు. అందుకని కుందేలుకు కాస్త గర్వం. నేనే గెలుస్తానని ధీమా. తన శక్తిని ఎక్కువగా చూసుకొని, అవతలి వారి శక్తిని తక్కువ చేసింది. ఎలాగైనా తానే నెగ్గుతానని కాస్త బద్దకించింది. మధ్యలో కాసేపు నిద్రపోయింది. తాబేలు అలా కాదు. తన బలం తక్కువ అనుకోలేదు. కుందేలు బలం ఎక్కువ అని, తాను గెలవలేనని అనుకోలేదు. తన ప్రయత్నం తాను కచ్చితంగా చేసింది. బద్దకించకుండా, భయపడకుండా నడిచింది. చివరకు గెలిచింది. తాబేలు గెలిచింది కాబట్టే- ఇది పిల్లలకు నచ్చే కథ అయింది. దానిలో ఒక నీతి ఉంది. ఒక హెచ్చరిక ఉంది. ఒక గుణపాఠం ఉంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. మన కృషి మనం నిజాయితీగా చేస్తే మనం లక్ష్యం సాధిస్తాం. బద్దకిస్తే మనకు ఉన్న శక్తి కూడా పనికిరాకుండా పోతుంది.

ఈ కథ ఎలా పుట్టింది : ఏ కథ అయినా ఎక్కడ ముగుస్తుందో – అది పుట్టినప్పుడు ఆ చివరి పాయింటు దగ్గరే మొదలవుతుంది. కథ ఏ నీతిని చెప్పాలో ముందు అనుకున్నాకే – కథ మొదలవుతుంది. ఉదాహరణకు ఈ తాబేలు – కుందేలు కథ ఆలోచనల క్రమం ఇలా ఉంటుంది :
1. కుందేలు ఓడిపోతుంది. తాబేలు గెలుస్తుంది.
2. కుందేలు ఎందుకు, ఎలా ఓడిపోతుంది?
కుందేలుకు ధీమా ఎక్కువ. బద్దకం ఎక్కువ. లేదా గర్వం ఎక్కువ.
అందుకని తాబేలు శక్తిని తక్కువగా అంచనా వేసి, మధ్యలో నిద్ర పోయింది.
3. తాబేలు తన శక్తికొద్దీ కృషి చేసింది. గమ్యం చేరింది.
… కథ చెబుతున్నప్పుడు – తాబేలు పట్ల మనకు సదభిప్రాయం కలగాలి. కుందేలు పట్ల అలా కలక్కూడదు. కుందేలుకు గర్వం అనో, బద్దకం అనో, అతి నమ్మకం అనో చెప్పాలి. మధ్యలో నిద్రపోయేలా చేయాలి. తాబేలు ఏమో కష్టపడి, నడిచిందని చెప్పాలి. ఇలా కథలో పాత్రల ప్రవర్తనను, స్వభావాన్ని చిత్రించటాన్ని బట్టి- వినేవారికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం మనం అనుకున్న ముగింపును చక్కగా స్వీకరించేలా చేస్తుంది. కాబట్టి- కథలో పాత్రలు, ఆ పాత్రలకు తగిన స్వభావాలూ అవసరం.

కథకు ఏమేమి ఉండాలి?
ఉద్దేశం : ప్రాథమికంగా కథకు ఒక ఉద్దేశం ఉంటుంది. దాని పట్ల తొలుత స్పష్టత ఉండాలి. అంటే- కథ దేని గురించి చెప్పాలో అది గట్టిగా అనుకోవాలి. ఉదాహరణకు ఐకమత్యం బలం. కలిసి ఉంటే కలదు సుఖం.
పాత్రలు : ఈ అంశాన్ని చెప్పటానికి పాత్రలు ఉండాలి. అవి జంతువులా? చెట్లా? మనుషులా? ఇంకా ఏమన్నానా? మన ఇష్టం. ఏమన్నా తీసుకోవొచ్చు. ప్రపంచంలోని అందరి మధ్యా ఐక్యమత్యం ఉండకపోవొచ్చు. అలా ఉండకపోయినా వెంటనే ఏమీ సమస్య ఉండదు. కానీ, ఉండాల్సిన వారి మధ్య కచ్చితంగా కలిసికట్టుతనం ఉండాలి. అలా ఉండాల్సిన వారెవరో గుర్తించి, వారినే మన కథలో పాత్రధారులను చేయాలి.
సంఘటన : ఆ పాత్రల మధ్య సంఘటనలు సృష్టించాలి. అప్పటివరకూ కలిసి ఉండటం.. తరువాత వారి మధ్య అపోహలూ అపార్థాలూ రావటం.. ఎవరికి వారు విడిపోవటం.. అలా విడిగా ఉన్నందువల్ల ఏదో ఒక సమస్య రావటం.. దానిని ఒంటరిగా ఎదుర్కోలేకపోవటం .. వంటి సంఘటనలను ఆ పాత్రల స్వభావానికి తగ్గట్టుగా అల్లుకోవాలి.
ముగింపు : విడిపోవటం వల్ల సమస్య వచ్చిందని అందరూ గ్రహించాలి. మళ్లీ అందరం కలిసి ఉండాలని అనుకోవాలి. అందరూ కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకోవాలి. ఇదే కథ. ఇదే ముగింపు. ఈ ముగింపే కథ ఉద్దేశం.

ఏ కథ అల్లుకోవాలన్నా- దాదాపుగా ఇదే సూత్రం. కథ ఉద్దేశాన్ని బట్టి పాత్రలు ఎంచుకోవాలి. పాత్రలకు తగిన స్వభావాలూ, సంఘటనలూ సృష్టించాలి. కథ ఉద్దేశానికి తగ్గట్టుగా ముగింపు ఇవ్వాలి. భాష సరళంగా ఉండాలి. చిన్ని చిన్ని వాక్యాలే రాయాలి. మనం మాట్లాడుతున్నట్టే రాయాలి.
ఈ ఐక్యమత్యం బలం అన్న అంశాన్ని తీసుకొని – ఎన్ని కథలైనా తయారు చేయొచ్చు. ఆలోచించేకొద్దీ బోలెడు వచ్చి వాలతాయి. ఉదాహరణకు : 1. సైకిలు చక్రాలు రెంటికీ నేను గొప్పంటే నేను గొప్ప అనుకొని విభేదం వచ్చింది. 2. పెన్సిలుకు, ఎరైజరుకు ఇలాంటి గొడవే వచ్చింది. 3. ఫ్యానుకు, స్విచ్‌కూ సమస్య వచ్చింది. 4. మీ ఇంట్లోని కుక్కపిల్లకు, పిల్లిపిల్లకూ తగాదా వచ్చింది. వీటన్నిటి మధ్యా ఐక్యత అవసరాన్ని చెప్పే విధంగా కొన్ని సంఘటనలు సృష్టించి- కథలు అల్లవచ్చు. ప్రయత్నించండి.

కథల్లోంచి కథలు
కొత్తగా కథలు ఊహించటమే కాదు; విన్న కథల్లోంచి కూడా కొత్త కథలు పుట్టించవొచ్చు. కొన్ని పాత కథలను మరింత విస్తరించొచ్చు. కొన్ని సార్లు కథ ముగింపు నుంచి ఆలోచించొచ్చు. ఆ తరువాత ఏం జరిగి ఉంటుందో ఊహించి, మరొక కథ రాయొచ్చు. పూర్వం కుండలో అడుగున ఉన్న నీటిని గులకరాళ్లు వేసి, పైకి రప్పించి దాహం తీర్చుకున్న కాకి కథ మనకు తెలుసు. మరి ఇప్పటి కాకి మరింత తెలివిగా ఏం చేయొచ్చు? ఊహిస్తే, బోలెడు ఆలోచనలు రావొచ్చు. అవే కొత్త కథలవుతాయి. ఇంకొన్నిసార్లు కథకు ముందు ఏమి జరిగి ఉంటుందో ఊహించి, ఇంకొక కథ అల్లవచ్చు.
”చిట్టీ, చిలకమ్మా /అమ్మా, కొట్టిందా?
తోటలోకి వెళ్లావా?/పండూ తెచ్చావా?
గూట్లో పెట్టావా?/గుటుక్కు మింగావా?”
అన్న ఈ చిన్ని గేయకథలో – అసలు చిట్టి చిలకమ్మను వాళ్లమ్మ ఎందుకు కొట్టి ఉంటుందో ఊహించి, ఒక కథ రాయొచ్చు. పండు తెచ్చి తినేస్తే వాళ్లమ్మ ఏమంది? ఆ గూట్లో ఇంకా ఎవరెవరు ఉండి ఉంటారు? వాళ్ల మధ్య సంభాషణ ఏమి జరిగి ఉంటుంది? … ఇలాంటి ప్రశ్నలు వేసుకొని, జవాబులు ఊహించి, కథ రాయొచ్చు.

కిటికీ పక్క చోటులో …
బస్సులోనో, రైల్లోనో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీ పక్క సీటు గొప్ప కథాస్థలం. అక్కడ కూచొని చూస్తే- కొద్దికాలంలోనే అనేక దృశ్యాలు కళ్ల ముందు కదలాడతాయి. ఒకేసారి అనేక దృశ్యాలను చూడడంతో మన ఆలోచనావేగం పెరుగుతుంది. అందమైన ప్రకృతి, అందులో పక్షులూ జంతువులూ, చెట్లూ చేలూ, పనిచేసే మనుషులూ, పెద్ద పెద్ద ఇళ్లూ, చిన్ని చిన్ని గుడిసెలూ, చక్కని యూనిఫాంలో స్కూలు కెళ్లే పిల్లలూ, చొక్కా కూడా లేకుండా పశువులను కాసే పిల్లలూ … ఇలా ఎన్నో దృశ్యాలు. అవి మనలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. ఉద్దేశాలను కలిగిస్తాయి. కనిపించిన దృశ్యాల్లోంచి పాత్రలు మనముందు నిలుస్తాయి. వాటికి కొంతకొంతగా ఊహను జోడించి కథలు అల్లవచ్చు. కాబట్టి- ప్రయాణాల్లో ఉన్నప్పుడు పరిసరాలను గమనించండి. ఫోన్లతో గడిపితే- మీ ఆలోచనలూ, ఊహలూ విస్తరిల్లవు. కొత్త కథలు ప్రభవించవు.
అలాగే చదువుతున్నప్పుడు కథ సగంలోకి వచ్చాక- పుస్తకం మూసేసి, తరువాతి కథ ఎలా ఉంటుందో ఊహించవొచ్చు. అలా చేసిన ఊహ పుస్తకంలో ఉన్నట్టే ఉండొచ్చు. లేదూ మరొక విధంగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా అది కథాసృజనకు పదును పెడుతుంది. ఏదైనా బొమ్మను చూసి, దానికి అనుగుణంగా కథను అల్లే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా ఏవైనా నాలుగైదు పదాలు తీసుకొని, అవి కథలో ఉండేలా కొత్త ఊహ చేయొచ్చు! ఉదాహరణకు కాకి, అమ్మ, చెల్లెలి రిబ్బను, జామచెట్టు … ఈ పదాలతో ఒక కథను అల్లేయండి. ఇంకా ఇలాటివి చాలా వాటితో మీ ఆలోచనలకు పదును పెట్టించొచ్చు.

పాత కథలకు కొత్త ముగింపు
మనం చాలాకాలంగా చాలా కథలు వింటూ ఉంటాం. ఈ కథ ఇలాగే ఎందుకు ఉండాలి? ఇలా చేయొచ్చు కదా? అని అనిపించవచ్చు. అవును.. ఆ కథ అలాగే ఎందుకు ఉండాలి. మీరు కొత్త ముగింపు జోడించవచ్చు.
రాజు గారి కొత్త బట్టలు కథ చాలామందికి తెలిసిందే! అసలు నూలు, మగ్గమూ లేకుండా బట్టలు నేస్తున్నట్టు నటిస్తారు, విదేశీ నేతగాళ్లు. అవి దేవతావస్త్రాలు అని చెబుతారు. తెలివైన వారికే కనిపిస్తాయి అంటారు. దీంతో, రాజు గారితో సహా ఆయన పరివారంలోని అందరూ ‘ఆహో ఓహో’ అంటారు. ఆఖరికి ఒకరోజు ఆ బట్టలు వేసుకొని రాజు గారు వీధుల్లో ఊరేగుతారు. ‘అయ్యో, రాజుగోరు బట్టలు వేసుకోలేదు..’ అని కిసుక్కున నవ్వుతాడు ఓ చిన్న కుర్రోడు. అప్పుడు అందరూ నవ్వుతారు. రాజు సిగ్గుపడతాడు. ఈ కథకు కొత్త ముగింపు ఇవ్వొచ్చు. మోసగించిన నేతగాళ్లను ఎందుకు వదిలేయాలి? వారిని తగిన విధంగా శిక్షించాలి అని అనిపించొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చో ఊహించండి.
‘ఆ నేతగాళ్లు తమను మోసగిస్తున్నట్టు రాజుగారికి అర్థమైంది. కానీ, నేస్తున్న బట్టలు తనకు కూడా కనిపిస్తున్నాయని చెప్పాడు. ఆఖరి రోజున అలాంటి గొప్ప బట్టలు వారికే తొడిగి ఊరంతా ఊరేగించాడు. ఆ మోసకారులు సిగ్గుతో తలదించుకున్నారు.’ అని చెప్పొచ్చు. తాబేలు – కుందేలు, ఆవు పులి, పులి – బంగారు కడియం, కాకి – మాంసంముక్క – నక్క, ఎండని ఏడో చేప, కాకి – పిచ్చుక వంటి ప్రాచుర్యంలో ఉన్న కథలన్నింటికీ కొత్త ముగింపులు ఊహించవచ్చు.

కథారచన ఓ మానవీయ స్పర్శ
కథలు అల్లటం అంటే- ఈ ప్రపంచం గురించి ఆలోచించటం. మన చుట్టూ ఉన్న మంచిచెడ్డలను పట్టించుకోవటం. మంచికి, న్యాయానికి, ధర్మానికి దన్నుగా నిలబడటం. చెడ్డపైనా, అన్యాయంపైనా, అధర్మంపైనా ఆవేదన, ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేయటం. కాబట్టి- కథలు రాయటం, కథలు ఊహించటం మానవీయమైన లక్షణం. కథలు చెప్పటం, రాయటం అనేది గొప్ప వ్యక్తీకరణకు ఆస్కారమిస్తుంది. రాసిన కథలు పత్రికలకు పంపొచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలూ పిల్లల శీర్షికలను నిర్వహిస్తున్నాయి. వాటిలో ప్రచురించే అవకాశం ఉంది.
మానవ సమాజం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజూ కొత్త కథలు పుడుతూనే ఉన్నాయి. ఆ కథలకు మీ కథలూ జోడించండి. వినటం మాత్రమే కాదు; సృష్టించటం కూడా వచ్చని చాటండి. ఇక మొదలెట్టండి.

  • సత్యాజీ
    94900 99167
➡️