ధరలో కోత.. రైతుకు వాత..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

రంగుమారిన ధాన్యం అమ్మకాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తడిసిన, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకూ ఎటువంటి ఆదేశాలూ విడుదల చేయలేదు. దీంతో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటున్న పరిస్థితి రెండు జిల్లాల్లోనూ నెలకొంది. కేజీల లెక్కన కోత విధిస్తున్నప్పటికీ దిక్కులేని పరిస్థితుల్లో రైతులు ధాన్యం వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో కనీసంగా లెక్కించినా ఎకరాకు రూ.ఐదువేల వరకూ నష్టపోతున్నట్లు రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సాగు చేపట్టారు. తుపాను వచ్చేనాటికి దాదాపు లక్షా 60 వేల ఎకరాల్లో రైతులు మాసూళ్లు పూర్తి చేశారు. ఇంకా రెండు లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు కోత కోయలేదు. తుపాను దెబ్బకు మాసూళ్లు చేసిన ధాన్యపు రాశులు తడిచి ముద్దవ్వగా, మాసూలు చేయని పొలాలు నేలనంటి నీటిలో నానిపోయాయి. దీంతో ధాన్యం రంగుమారి, మొలకలు వచ్చాయి. తుపాను వెళ్లిపోయి వారాలు గడుస్తున్నా రంగుమారిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేయలేదు. రంగుమారిన ధాన్యానికి సంబంధించి శాంపిళ్ల సేకరణపై కేంద్ర బృందం గురువారం జిల్లాలో హడావుడి చేసింది. రైతులతో కనీసం మాట్లాడకుండా మండలానికి ఒక ధాన్యం శాంపిల్‌’ తీసుకుని వెళ్లిపోయారు. రబీ సాగుకు సంబంధించి ఇప్పటికే నారుమడులు ఆలస్యమయ్యాయి. దీంతో వెంటనే నారుమడులు వేసేందుకు రైతులు హైరానా పడుతున్నారు. ఈ క్రమంలో ఖరీఫ్‌ మాసూళ్లు వేగంగా చేస్తున్నారు. అయితే రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయపోవడంతో రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీంతో ఆఫ్‌లైన్‌లో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. తేమ 17 శాతంకంటే ఎక్కువ ఉంటే బస్తాకు కిలో ధాన్యం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో బస్తాకు నాలుగైదు కిలోలు రైతులు నష్టపోతున్నారు. రంగుమారిన ధాన్యానికి సంబంధించి మిల్లర్లు ఎంత చెబితే అంతన్నట్లు పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రంగుమారిన ధాన్యం ఎక్కువగా వస్తోంది. కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దెబ్బతిన్న రైతులను ఆదుకోవడం అంటే ఇదేనా అంటూ అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.17 శాతం తేమ వచ్చినా కొనుగోళ్లు ఆలస్యమే రైతుభరోసా కేంద్రంలో తేమ 17 శాతమే వచ్చినప్పటికీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మరో రెండు రోజులు ఆరబెట్టాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ధాన్యం సంచుల్లో పట్టిన తర్వాత కూడా ధాన్యం తీసుకెళ్లకుండా రోజుల తరబడి ధాన్యం కళ్లాల్లోనే ఉంచుతున్నారు. గడిచిన రెండు రోజులుగా వాతావరణం మబ్బుగా ఉంటుంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. వర్షం కురిసి ఉన్న ధాన్యం కూడా తడిస్తే ఏం చేయాలంటూ రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రంగుమారిన ధాన్యం కొనుగోలుకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.

➡️