మళ్లీ ధరల సెగ

Jan 13,2024 11:19 #again, #countdown, #prices
  • నాలుగు నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం
  • పడిపోయిన పారిశ్రామికోత్పత్తి

ముంబయి : ప్రజల జేబులకు అధిక ధరలు చిల్లులు పెడుతున్నాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగిసిపడి.. నాలుగు మాసాల గరిష్ట స్థాయికి చేరింది. మరోవైపు డిమాండ్‌ లేమితో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పడిపోయింది. కేంద్ర గణంకాల శాఖ రిపోర్ట్‌ ప్రకారం.. 2023 డిసెంబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 5.69 శాతానికి పెరిగింది. ఇంతక్రితం నవంబర్‌లో 5.55 శాతంగా ఉండగా.. 2022 డిసెంబర్‌లో 5.72 శాతంగా నమోదయ్యింది. వరుసగా నాలుగో నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ నిర్దేశిత స్థాయి కంటే ఎక్కువగా నమోదు కావడం ఆందోళకరం. గడిచిన నెలలో ముఖ్యంగా అహారోత్పత్తుల ధరలు అధికంగా పెరిగాయి. 2022 డిసెంబర్‌లో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 4.19 శాతంగా ఉండగా, గత నెలలో 9.53 శాతానికి ఎగబాకాయి. 2023 నవంబర్‌లో 8.7 శాతంగా నమోదయ్యాయి. ఆహార వస్తువుల ధరల్లో అనిశ్చితి రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. రోజు వారీగా వినియోగించే కీలక కూరగాయల ధరల్లో పెరుగుదలతో భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం సూచీ మరింత పెరిగే సంకేతాలు కనబడుతున్నాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పంచదార ధరలు పెరగడం కూడా ఆందోళనకరమేనన్నారు.

పారిశ్రామికోత్పత్తి డీలా..

దేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, డిమాండ్‌ లేమి ప్రభావాలతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ప్రతికూలతను ఎదుర్కొంటుంది. 2023 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 2.4 శాతానికి క్షీణించి.. ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. ఆ మాసంలో కేవలం 1.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గడిచిన నవంబర్‌లో విద్యుత్‌ రంగం 5.8 శాతం, గనుల రంగం 6.8 శాతం వృద్థిని కనబర్చాయి. దుస్తులు, ఫర్నీచర్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఆప్టికల్‌ ప్రొడక్ట్‌ పరిశ్రమల్లో ఏకంగా 20 శాతానికి పైగా ప్రతికూల వృద్థి చోటు చేసుకోవడం ఆందోళనకర అంశం.

➡️