రియల్‌ ఎస్టేట్‌ అడ్డాగా అయోధ్య

Jan 25,2024 07:19 #ayodya, #lands
  • 1250 అడుగుల ప్లాట్‌ ప్రారంభ ధరే 1.72 కోట్లు

అయోధ్య: అయోధ్యకు రాముడొచ్చాడో లేదో కానీ ఆ పేరుతో పెద్ద పెద్ద రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు మాత్రం గద్దల్లా వచ్చి వాలాయి. అయోధ్యలో ఇప్పుడు నడుస్తున్నది రియల్‌ఎస్టేట్‌ అధిపతులు, బ్రోకర్లు, డెవలపర్ల హవా. ఇప్పుడు ఏ పత్రిక తిరగేసినా తాటికాయంత అక్షరాలతో ఫుల్‌ పేజీ అడ్వర్టయిజ్‌ మెంట్లు దర్శనమిస్తున్నాయి. వాటిలో అయోధ్య రాముడి పేరు మచ్చుకు కూడా కానరాదు. అంతా రియల్‌ ఎస్టేట్‌ మయం. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచన్‌ బొమ్మతో ఫుల్‌ పేజీ యాడ్‌ ఒకటి వెలువడింది. పవిత్రమైన సరయు నది ఒడ్డున, అయోధ్య ఆలయానికి కూత వేటు దూరంలో, కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయం నుంచి కేవలం 30 నిమిషాల్లో చేరుకునేలా, అయోధ్య నడిబొడ్డున ప్రపంచ స్థాయి విలాసవంతమైన హౌటళ్లు, రిసార్ట్‌లతో కూడిన కూడలిలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమమని ఆ ప్రకటనలో అమితాబ్‌ చెబుతారు. వెయ్యికోట్ల డాలర్లతో ప్రపంచ పర్యాటక హాట్‌స్పాట్‌గా అయోధ్య మారుతోందని, అయోధ్యకు వచ్చే వారికి ఆతిధ్యం, ఆహారం, ప్రయాణం, రవాణా, వ్యాపారాలకు కేంద్రంగా ఉంటుందని ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌ చెబుతుంది.

ముంబయి కేంద్రంగా పనిచేసే రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ ‘హౌస్‌ ఆఫ్‌ అభినందన్‌ లోధా’ వేసిన ఈ వెంచర్‌లో ఒక్కో ప్లాట్‌ (1250 చదరపు అడుగులు) ప్రారంభ ధర 1.72 కోట్లు . ఇటువంటివి 250 ప్లాట్లను ఆ కంపెనీ అమ్మకానికి పెట్టింది. అమెరికా, బ్రిటన్‌, ఆగేయాసియా దేశాల్లోని ప్రవాస భారతీయుల కోసం అయోధ్యలో 51 ఎకరాలను రూ.1200 కోట్లకు కొనుగోలు చేసింది. అయోధ్య గ్లోబల్‌ కల్చరల్‌ కేపిటల్‌గా అవతరిస్తోందని, అయోధ్యలో ప్రవేశానికి ఒకే ఒక ముఖ ద్వారం హౌస్‌ ఆఫ్‌ లోధా అని ఆర్భాటంగా ఆ ప్రకటనలో పేర్కొంది.

‘అయోధ్య నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్‌లో నేనూ ఒక ప్లాట్‌ కొనుక్కున్నాను. మరి మీరూ!’ అంటూ అమితాబ్‌ తనదైన శైలిలో ఆ ప్రకటనలో పేర్కొంటారు. అమితాబ్‌ మాదిరిగానే కార్పొరేట్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీ కూడా అయోధ్యలో ప్లాట్‌ కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అయోధ్యలో నేడు ఆధ్యాత్మికత కన్నా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి అనుకూలంగా 2019లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఆస్తుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. అయోధ్య జిల్లా స్టాంప్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం వద్ద ఉన్న డేటా ప్రకారం 2017-2022 మధ్య ఆస్తి రిజిస్ట్రేషన్లు 120 శాతం పెరిగాయి. ఇదీ అయోధ్య అసలు కథ!

➡️