అరుదైన వ్యాధి.. అంతులేని వ్యథ!

Apr 17,2024 05:24 #artical, #edit page, #Rare disease

రక్తస్రావానికి, రక్తం గడ్డకట్టే లోపానికి సంబంధించిన వ్యాధిగా ‘హిమోఫిలియా’ను గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది హిమోఫిలియాతో బాధ పడుతున్నారని ఈ మధ్య ఒక సర్వేలో తేలింది. విశ్వవ్యాప్తంగా హిమోఫిలియా లాంటి వారసత్వ వ్యాధుల పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17న ‘ప్రపంచ హిమోఫిలియా దినం’ నిర్వహిస్తున్నారు.
ఇది అంటువ్యాధి కాదు. కాని హిమోఫిలియా కుటుంబ చరిత్ర ఉన్న వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థకు చెందిన అనువంశిక వ్యాధి. అంటే తల్లిదండ్రుల నుండి సంతానానికి సంక్రమించే వ్యాధి. ఇది మగ పిల్లలకు మాత్రమే ఎక్కువగా సంక్రమిస్తుంది. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ వ్యాధి తక్కువ. తీవ్రమైన హిమోఫిలియా ఉన్న కొందరిలో తలకు చిన్న గాయమైనా మెదడులోకి రక్తస్రావం జరిగి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంది.
రక్తం గడ్డకట్టే విధానాన్ని ఆధారంగా చేసుకొని హిమోఫిలియా రెండు రకాలుగా ఉంటుంది. వీటినే ”హిమోఫిలియా-ఏ”, ”హిమోఫిలియా-బి” అని పిలుస్తారు. అధికంగా కనిపించే హిమోఫిలియా ఏ, దాదాపు ప్రతి 5,000 మందిలో ఒకరికి, హిమోఫిలియా-బి, దాదాపు ప్రతి 20,000 మందిలో ఒకరికి వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమోఫిలియా, ఇతర రక్త సంబంధ వ్యాధులతో బాధ పడుతున్న 80 శాతం మందికి ఈ వ్యాధి ఉందని వారికి ఏమాత్రం తెలియదట. ఇలాంటి స్థితి ఉండడం వల్ల వ్యాధి గురించి అవగాహన లేకుండా ఉంది.
అనువంశికంగా సంక్రమించే హిమోఫిలియా వల్ల వ్యక్తికి గాయం అయినపుడు వెంటనే రక్తం గడ్డకట్టక, గాయానికి రక్తస్రావం అధికంగా జరిగి, ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకుంటారు. కొందరిలో హిమోఫిలియా వలన రక్తస్రావం వారాలుగా కొనసాగవచ్చు. కీళ్ళు, కండరాల్లో రక్తస్రావం జరిగితే కీళ్ళ వాపు, కండరాల నొప్పి కనిపిస్తాయి. ఈ వ్యాధికి సంబంధించిన అవగాహన నిమిత్తం ప్రచారం, నినాదాలు రాయించడం, ఇతర కార్యక్రమాలు, కరపత్రాలు పంపిణీ, ప్రచార సామాగ్రి, లాంటి వాటితో ప్రచారాలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. జన్యు లోపాలతో అనువంశికంగా సంక్రమించే హిమోఫిలియాకు ఎలాంటి సరైన చికిత్స అందుబాటులో లేదు. దీనిని నివారించటం కూడా సాధ్యపడదు. కొంతమంది వ్యక్తులు తేలికపాటి లక్షణాలను మాత్రమే కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా రోజులు దీనిని నిర్ధారణ చేయలేకపోవచ్చు. మరికొందరు తీవ్రమైన రక్తస్రావ పరిస్ధితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం అని గుర్తించాలి. భారతదేశంలో దాదాపు రెండు లక్షల హిమోఫిలియా రోగులు ఉన్నారని, వీరిలో 20,000 మంది మాత్రమే నమోదు అయ్యారని తెలుస్తుంది. ప్రతి లక్ష మందిలో నలుగురికి హిమోఫిలియా రుగ్మత కనిపిస్తున్నది.
ఏదైనా దెబ్బ తగిలినపుడు శరీరం లోపల లేదా బయట ఆగకుండా రక్త స్రావం అవుతూంటే హిమోఫిలియాగా భావించి వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. రోగ నిర్ధారణ కోసం రక్తం గడ్డకట్టే కారకాల స్థాయిలను తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. గడ్డకట్టే కారకాలను పునరుద్ధరించడానికి వైద్యులు తగిన చికిత్స అందిస్తారు. హిమోఫిలియా రుగ్మతను గుర్తించే పరీక్షలు ప్రత్యేకంగా ఉన్నాయి. రుగ్మత ఉందని తెలియని వారికి గాయాలు అయినపుడు అధిక రక్షస్రావం జరిగి ప్రమాదకరంగా మారుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు హిమోఫిలియా రుగ్మత ఓ శాపంగా మారుతున్నది. ఈ వ్యాధి ఉందని తెలియక గాయాలు తగిలినపుడు రక్తం గడ్డ కట్టకపోవడంలో అనేక తీవ్ర సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. హిమోఫిలియా లాంటి నిశ్శబ్ద రుగ్మతను త్వరగా గుర్తించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం, అందరికి అవగాహన కల్పించడం లాంటి చర్యలతో ప్రాణ హానిని తప్పిద్దాం.

– గడప రఘుపతిరావు,
సెల్‌ : 9963499282

➡️