కృష్ణపట్నంలో కంటైనర్‌ టెర్మినల్‌కు షాక్‌! 

Jan 24,2024 10:07 #container, #Krishnapatnam, #shock, #terminal
  • తమిళనాడుకుతరలిపోతున్న నౌకలు
  • రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయానికి గండి
  • భారీగా ఉపాధి,ఉద్యోగాలకు కోత

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : ఆసియాలోనే అతి పెద్దదైన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు తన ఉనికిని కోల్పోతోంది. దిగుమతి, ఎగుమతులతో భారీగా లాభాలు సంపాదించి పెట్టిన ఈ పోర్టుకు అదానీ సొంతం చేసుకున్న తరువాత ఈ ప్రమాదం వచ్చింది. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చే కంటైనర్లను దారి మళ్లించారు. ప్రస్తుతం చెన్నరుకు తరలించడంతో త్వరలో కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను మూసివేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికులు వీధిన పడనున్నారు. పబ్లిక్‌ ప్రయివేట్‌ పార్టనర్‌షిప్‌ (పిపిపి) విధానంలో ఈ పోర్టు నడిచేది. నవయుగ కంపెనీ దీనిని నిర్వహించేది. చెన్నరు, విశాఖపట్నం, ముంబరు పోర్టులతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోయేది. ఇక్కడ కంటైనర్ల టెర్మినల్‌ కూడా ఏర్పాటైంది. ఓడ నుంచి నేరుగా కంటెనర్లను టెర్మినల్‌ సహాయంతో దించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ పోర్టు సొంతం చేసుకుంది. ఇక్కడి నుంచి కొలంబో, అమెరికా, షాంగై, సింగపూర్‌లకు ఎగుమతులు, చైనా, మలేషియా, యుఎఇ, దుబారు, థాయిలాండ్‌ నుంచి దిగుమతులు ఎక్కువగా ఉండేవి. ప్రధానంగా బియ్యం, పొగాకు, గుంటూరు మిరప, పత్తి, రాయి, రొయ్యలు, ఇసుప ఖనిజం ఎగుమతులు జరిగేవి. తిరుపతి జిల్లా శ్రీ సిటీ నుంచి మోటారు పరిశ్రమలకు సంబంధించిన పరికరాలు, పేపర్‌ రోల్స్‌, వైట్‌ సిమెంట్‌, సోలార్‌ ఫ్యానల్స్‌, ఫర్నిచర్‌, ఎల్‌ఇడి లైట్లు, ముడి పామాయిల్‌, కెమికల్స్‌ విదేశాల నుంచి దిగుమతి అయ్యేవి. 2006 నుంచి దిగుమతులు, ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. 2019లో ఆరు లక్షల కంటైనర్లు ఇక్కడ నుంచి ఎగుమతి, దిగుమతి అయ్యాయి. సుమారు రూ.9 లక్షల కోట్లు ఏటా లావాదేవీలు సాగేవి. ఈ పోర్టులోని 44 బెర్తులు కళకళలాడుతూ ఉండేవి. పోర్టులో వ్యాపార కార్యకలాపాలు, లాభాలు భారీగా పెరిగాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లు స్టేట్‌ ట్యాక్స్‌ రూపంలో ఆదాయం వచ్చింది. సుమారు పది వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని 2022లో ఈ పోర్టును అదానీకి కట్టబెట్టాయి. ఆ తర్వాత పరిస్థితి మారింది. ఇక్కడి ఎగుమతులు, దిగుమతులను తమిళనాడులోని అదానీకి చెందిన కాటుపల్లి, ఎన్నూరు పోర్టులకు క్రమంగా మార్చేశారు. ఆర్నెల్ల నుంచి ఈ తతంగం ఎక్కువగా సాగుతోంది. దీంతో, కృష్ణపట్నంలోని ఐదారు బెర్తులు, టెర్మినర్లు మాత్రమే వినియోగంలో ఉంటున్నాయి. మిగిలినవి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. కంటైనర్ల మళ్లింపుతో ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు, బూడిద మాత్రమే ట్రాన్స్‌పోర్టు అవుతోంది. కస్టమ్స్‌ హౌస్‌ ఏజెంట్‌, కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌, లైనర్‌ ఏజెంట్స్‌, యార్డ్స్‌, ట్రాన్స్‌ పోర్టర్స్‌, లేబర్‌ కాంట్రాక్టర్స్‌, హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ, డ్రైవర్స్‌, ఆపరేటర్స్‌, డైలీ వేజ్‌ లేబర్‌ తదితర విభాగాల్లో కార్మికులకు పనులు దొరకడం గగనంగా మారింది. కంటైనర్లు ఇక్కడి రావడం లేదనే పేరుతో ఈ విభాగాలను ఎత్తివేసే ఆలోచనలో పోర్టు యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. పోర్టు ఆధారంగా నెల్లూరుకు గమేశా కంపెనీ వచ్చింది. ఇప్పటి వరకు విడి పరికరాలను కృష్ణపట్నం పోర్టు ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఈ సంస్థ ఇకపై అదానీకి చెరదిన గుజరాత్‌లోని ముద్రా లేక తమిళనాడు పోర్టులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంటైనర్‌ టెర్మినల్‌ తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కృష్ణపట్నం పోర్టు ఉనికి పూర్తిగా కోల్పోయి నెల్లూరు జిల్లా పరిస్థితి దయనీయంగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పోర్టుపై ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడిన కార్మికులు, స్థానిక వ్యాపారులు ఉపాధి కోల్పోనున్నారు. ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండిపడనుంది.

➡️