భూదాన్‌ భూములపై కన్ను

Dec 18,2023 11:03 #Bhudan lands
  • నకిలీ సంతకాలతో పెత్తందార్లు, బినామీల పాగా
  • బోర్డు రద్దు కాలంలో పుట్టుకొచ్చిన పత్రాలు
  • మండలాల వారీగా లెక్కలు తేల్చే పనిలో రెవిన్యూ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూ మాఫియా, పెత్తందార్ల కన్ను భూదాన్‌ యజ్ఞ బోర్డు భూములపై పడింది. విలువైన భూములను చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని దక్కించుకునేందుకు కొందరు పెద్ధలు వేగంగా పావులు కదుపుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో 2012లో విశాఖకు చెందిన భూదాన్‌ భూముల విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాష్ట్ర విభజన జరిగింన వెంటనే భూదాన్‌ బో ర్డును ప్రభుత్వం రద్దు చేసింది. బోర్డు రద్దయిన కాలంలో జారీ చేసినట్లు నకిలీ సంతకాలతో కూడిన పత్రాలతో ఆయా భూములను దక్కించుకునేందుకు ప్రొసీడింగ్‌లతో దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. రెవిన్యూ శాఖ అప్రమత్తమైంది. భూదాన్‌ యజ్ఞబోర్డును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కొందరు వ్యక్తులు రెవిన్యూ కార్యాలయాలకు దరకాస్తులు చేసుకుంటున్న విషయాన్ని భూదాన్‌ బోర్డు దృష్టికి పలువురు తీసుకొచ్చారు. 18 మంది వ్యక్తులు భూదాన్‌ భూములు తమవేనంటూ క్ల్తెయిమ్‌ చేసుకునేందుకు రెవిన్యూ యంత్రాంగానికి దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిసిఎల్‌ఎ అన్ని జిల్లాల కలెక్టర్లకు భూదాన్‌ భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉత్తర్వులు జారీచేశారు. అంతే కాకుండా కేటాయించిన భూమి రద్దు ప్రక్రియ, కొత్త కేటాయింపుదారులకు కేటాయించిన భూదాన్‌ భూమి మంజూరు ప్రక్రియ, భూదాన్‌ భూములు నోటిఫై చేసినప్పటికీ గ్రామాల్లో భూదాన్‌ భూములు అందుబాటులో లేదని నిర్ధారించడం లాంటి చర్యలపై నివేదికలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా నకిలీ సంతకాలు గల ప్రొసీడింగ్స్‌తో కూడిన దరఖాస్తులు చేసిన వారు ఉంటే పూర్తి స్ధాయిలో విచారణ జరిపిన అనంతరం ఆయా వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు చట్టాన్ని అమలు చేయాలని రెవిన్యూ ఉన్నతాధికారులు కలెక్టర్లకు సూచించారు. ఈ ప్రక్రియ ముగిసే వరకు భూదాన్‌ భూములకు సంబంధించి ఆయా భూ యజమానుల పేర్లు రికార్డుల్లో (వెబ్‌ల్యాండ్‌)లో ఎక్కించకుండా మండల తహసీల్ధార్లను ప్రభుత్వం ఆదేశించడంతో పాటు అప్రమత్తమంగా ఉండాలని కూడా క్షేత్రస్ధాయి అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఒకవేళ నిజమైన వ్యక్తులే అని నిర్ధారించుకున్నప్పటికీ న్యాయపరమైన అంశాలను పరిశీలించడంతో పాటు ఉన్నతాధికారులతో సంప్రదించిన తర్వాతనే ఓ అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

లెక్కలు తేల్చే పనిలో రెవిన్యూ

భూదాన్‌ యజ్ఞ బోర్డుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాలో ఎంత భూమి ఉంది? దాతలు ఇచ్చిన భూమి ప్రస్తుతం అర్హులైన వారి చేతిలో ఉందా? లేదా? ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిందా? అనే అంశాలను రెవిన్యూశాఖ నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవల కాలం వరకు భూదాన్‌ యజ్ఞబోర్డు నియామకం జరగలేదు. ఇటీవలనే నూతనం బోర్డును ప్రభుత్వం నియమించింది. ఈనేపథ్యంలో భూముల వివరాలను మండలాల వారీగా గుర్తించి, అర్హుల చేతిలో ఉన్న భూమి ఎంత? అనర్హుల చేతుల్లోకి వెళ్లిన భూమి ఎంత? అర్హులు గ్రామాల్లో లేకుండా బయట ప్రాంతాలకు వెళ్లిన వారి భూములు ప్రస్తుత పరిస్థితి? లాంటి వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 30వేల ఎకరాల భూములు భూదాన్‌ యజ్ఞ బోర్డు కింద ఉన్నట్లు గుర్తించినట్లు ప్రాధమిక సమాచారం. ఇంకా కొన్ని జిల్లాల నుంచి ఆయా కలెక్టర్లు ప్రభుత్వానికి సమాచారం ఇంకా పంపలేదని తెలిసింది. భూదాన్‌ భూములు అత్యధికంగా ఉత్తరాంధ్రలో అందులోనూ విశాఖ, విజయనగరం ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

భూదాన్‌ భూములంటే ….

ఆచార్య వినోబాబావే 1951లో ఇచ్చి పిలుపుతో భూ స్వాములు, ధనవంతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వినోబాబావేకు ఇచ్చిన భూములే భూదాన్‌ భూములు. భూదాన్‌ భూములను అమ్ముకోవడానికి అర్హత ఉండదు. తరతరాలుగా ఆయా భూములను అనుభవించే హక్కు మాత్రమే ఉంటుందని చట్టం చెబుతున్నప్పటికీ ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

➡️