విశాఖలో మరో కొండకు గుండు !

Mar 9,2024 09:04
  • పనుల వెనుక సర్కారు అండీ
  • రూ.400 కోట్ల విలువైన భూమికి టెండరు
  • రాత్రి వేళల్లో చదును

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ నగరం చుట్టూగల మధురవాడ-రుషికొండ ప్రాంతాల్లోని ఎత్తయిన కొండలన్నీ ఒక్కొక్కటిగా కబ్జాకు గురవుతున్నాయి. రుషికొండకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో కొండపై జరుగుతున్న పనులపై విశాఖలో తాజాగా చర్చ జరుగుతోంది. కబ్జాదారులకు సర్కార్‌ అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అందుకే ఇటువైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. మధురవాడ సర్వే నెంబరు 427/1 పరిధిలోని పనోరమ హిల్స్‌ ఏరియాలో అదానీ డేటా సెంటర్‌ కోసం ఇచ్చిన కొండకు ఆనుకుని మరో కొండ చుట్టూ గడిచిన 15 రోజులుగా రాత్రుళ్లు అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొండ చుట్టుకొలత సుమారు 30 ఎకరాల వరకూ ఉండగా ఎకరా సుమారు రూ.50 కోట్ల విలువ పలుకుతోంది. ఇక్కడ పది ఎకరాలకు పైగా అంటే రూ.400 కోట్ల మార్కెట్‌ విలువ పలికే స్థలాన్ని ఇప్పటికే అక్రమంగా చదును చేసేశారు. రాత్రి వేళల్లో మాత్రమే ఈ పనులు జరుగుతుండడంతో ఇది కచ్చితంగా కబ్జానని స్థానికులు అంటున్నారు. అనుమతులు ఉంటే రాత్రి వేళల్లో పనులు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రుషికొండపై 9.2 ఎకరాల్లోగల ఎపి టూరిజానికి చెందిన రిసార్ట్స్‌ను కొట్టేసి కొండ చుట్టూ తవ్వకాలు చేసి 20 ఎకరాలకుపైగా నిర్మాణాలకు విస్తరించి ప్రభుత్వమే రుషికొండను కబ్జా చేసిందన్న ఆరోపణలు, కోర్టుల్లో పిటిషన్‌లు నడుస్తున్న తరుణంలో మరో కొండపై ఈ తరహా పనులు జరగడం చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రికి చెందిన సంస్థ అంటూ రెవెన్యూలో చర్చ ?

                  తాజాగా చదును పనులు జరుగుతున్న కొండకు సంబంధించి బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ విద్యా సంస్థకు సుమారు 12 ఎకరాలను కేటాయించినట్టు తెలుస్తోంది. ఎకరా రూ.31 లక్షలకు ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. ఇదే విషయమై విశాఖ రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయ పరిధి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌ను ‘ప్రజాశక్తి’ వివరణ కోరగా, గతంలో ఇక్కడ కొంత భూమిని బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ విద్యా సంస్థకు కేటాయించినట్లు తెలిపారు. అయితే, కొండను ఎంత మేరకు చదును చేస్తున్నారో పరిశీలిస్తామని చెప్పారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన అంతర్జాతీయ విద్యా సంస్థ కోసమే ఇక్కడ పనులు జరుగుతున్నాయన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.

➡️