రబీలోనూ బీళ్లే

Mar 9,2024 08:35
  • 14 లక్షల ఎకరాల్లో లేని సాగు
  • అన్ని పంటలూ తక్కువే
  • ముగిసిన సీజన్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ మారు రబీ భారీ తరుగులో ఉంది. సాధారణ సాగు విస్తీర్ణంలో దాదాపు 14 లక్షల ఎకరాల తగ్గుదల నమోదు చేసింది. నార్మల్‌లో 75 శాతమే పంటలు సాగయ్యాయి. పాతిక శాతం విస్తీర్ణంలో విత్తనం పడక చేలు బీడు పడ్డాయి. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 55.95 లక్షల ఎకరాలుకాగా ఇప్పటి వరకు 41.85 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. అన్ని పంటలూ తగ్గాయి. ఆహార ధాన్యాలు 26 శాతం తగ్గాయి. ఆహార పంటల్లో ప్రధానమైన వరి 29 శాతం తగ్గింది. రబీలో పప్పుధాన్యాలు ఎక్కువ సాగు వేస్తారు. పప్పుశనగ మూడున్నర లక్షల ఎకరాల్లో (32 శాతం) పడలేదు. మినుములు 28 శాతం, పెసలు 39 శాతం సాగు కాలేదు. చివరికి మొక్కజొన్న కూడా తగ్గింది. నార్మల్‌లో 25 శాతం మైనస్‌. నూనెగింజలు సైతం 25 శాతం సాగు కాలేదు. ఈ గణాంకాలు మార్చి మొదటి వారంలోనివి. రబీ సీజన్‌ ఫిబ్రవరితోనే ముగుస్తుంది. మార్చి నెలలో ఎక్కడో అడపాదడపా పంటలు సాగవుతాయి. సాగునీటి వసతి కలిగిన ప్రాంతాల్లో మాత్రం వరి నాట్లు వేస్తారు. అదీ చాలా చాలా పరిమితం.విపత్తులు… సర్కారీ వైఫల్యం నైరుతి, ఈశాన్య రెండు కాలాల్లోనూ రైతులను వర్షాభావం వెంటాడింది. ఇప్పటికీ 13 జిల్లాల్లో, అత్యధిక మండలాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. డిసెంబర్‌లో వచ్చిన మిచౌంగ్‌ తుపాను వానలే వానలు. అనంతరం వర్షాలేమీ పడలేదు. అటు కరువు ఇటు తుపాన్‌ దెబ్బతో రైతులు రబీలో పెద్దగా పంటలు సాగు చేయలేకపోయారు. సాధారణంగా ఒక సీజన్‌లో నష్టపోతే తదుపరి కాలంలో ఆ లోటు తీర్చుకునేందుకు రైతులు ఏదో ఒక పంట వేస్తారు. కానీ ఈసారి అటువంటి పరిస్థితులేమీ కనిపించట్లేదు. కరువు, తుపాన్‌ వలన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై స్వల్పకాలిక, ఆరుతడి పంట విత్తనాలను పంపిణీ చేశామంటున్నప్పటికీ వాటి సాగు పెరగకపోగా తగ్గింది.

నీటి కొరతతో వరి బంద్‌

                ప్రాజెక్టుల్లో నీటి కొరత వలన గోదావరి డెల్టా మినహా తతిమ్మా చోట్ల ప్రభుత్వం వరి వేయొద్దంది. భూగర్భ జలాలు ఉన్నప్పటికీ బోర్ల కింద సైతం వరి వద్దని ఆదేశించింది. కేవలం ఆరుతడి పంటలే వేయమంది. కొన్ని చోట్ల వాటిక్కూడా అదనుకు సరిపడా నీరు విడుదల చేయలేకపోయింది. కరెంట్‌ కోతలతో బోర్ల కింద వరి సాగుకు ఇబ్బందులేర్పడ్డాయి. దాంతో ఎన్నడూ లేని విధంగా ఈ తడవ రబీలో వరితో పాటు అన్ని పంటలూ తగ్గాయి.

➡️