పిఎం కిసాన్‌ సాయానికి భారీ కోత

Feb 29,2024 08:06 #BJP Failures, #PM Kisan, #special story
  •  12 లక్షల రైతులపై అనర్హత వేటు 
  • 40 లక్షలకే ఈ దఫా రూ.2 వేల కిస్తు
  • 52 లక్షలంటూ రాష్ట్ర సర్కారు ఊదర
  • కేంద్రం తీరుపై నోరు మెదపని వైనం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కేంద్ర నిబంధనల కారణంగా రాష్ట్రంలో పిఎం కిసాన్‌ లబ్ధిదారులకు భారీగా కోత పడింది. బుధవారం ప్రధాని మోడీ మహారాష్ట్ర పర్యటనలో 16వ విడత (ఈ సంవత్సరంలో మూడవ కిస్తు) విడుదల చేయగా, ఎ.పి.లో దాదాపు 12 లక్షల లబ్ధిదారులపై అనర్హత వేటు పడింది. జమ చేశారంటున్న వారికీ సొమ్ము దశలవారీగా రాబోయే పదిహేను రోజుల్లో పడుతుందని చెబుతున్నారు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై కోడ్‌ అమల్లోకొస్తుందన్న భయంతో లాంఛనంగా ప్రధాని జెండా ఊపారని తెలుస్తోంది. కాగా లక్షల్లో లబ్ధిదా రుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు. పైగా అసత్య ప్రచారం చేస్తోంది.

పిఎం కిసాన్‌ కిస్తు దాదాపు 52 లక్షల మందికి జమ చేస్తున్నామని పేర్కొనగా, కేంద్రం 40 లక్షల మందికే ఓకే చేసింది.

  • ఆంక్షల కొరడా

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని కేంద్ర స్కీం పిఎం కిసాన్‌తో కలిపి రాష్ట్ర సర్కారు అమలు చేస్తోంది. సంవత్సరంలో మూడు విడతల్లో రూ.13,500 ఇస్తుండగా, రాష్ట్ర వాటా రూ.7,500, కేంద్రం వాటా రూ.6 వేలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు మూడవ కిస్తు విడుదల చేశారు. ఈ విడతలో సొంత భూమి కలిగిన రైతులకు కేంద్రం నుంచి రూ.2 వేలు పడతాయి. పిఎం కిసాన్‌కు కేంద్రం ఇ-కెవైసి, ఆధార్‌ బేస్డ్‌ పేమెంట్స్‌ సిష్టం (ఎబిపిఎస్‌) సీడింగ్‌.. ఈ రెండు నిబంధనలనూ తప్పనిసరి చేసింది. రైతులు ఈ రెండింటినీ చేయించుకుంటేనే పిఎం కిసాన్‌ సహాయం జమ అవుతుంది. పలు వడపోతల అనంతరం భూమి రికార్డుల పరిశీలన తర్వాత 40,78,322 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరి భూమి రికార్డులతో ఇ-కెవైసి, ఎబిపిఎస్‌ సీడింగ్‌ జరగాలి. వీరిలోనూ ఇంకా వేల సంఖ్యలో సీడింగ్‌ జరక్క పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర సర్కారు మాత్రం 52 లక్షల మందికి భరోసా- పిఎం కిసాన్‌ జమ అవుతుందని తెలిపింది. అందుకు ముఖ్యమంత్రి బుధవారం బటన్‌ నొక్కారని ప్రకటించింది. ఈ విడతలో పడేది కేవలం కేంద్రం ఇచ్చే రూ.2 వేలు మాత్రమే. రాష్ట్రం ఇచ్చేదేమీ లేదు. అయినా సిఎం రూ.వెయ్యి కోట్లకు పైన పంపిణీకి బటన్‌ నొక్కారని సర్కారు ప్రచారం చేసింది.

  • లక్షన్నర మందికే

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విడతలో ఎస్‌టి, ఎస్‌సి, బిసి, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు, అటవీ హక్కుల చట్టం కింద గుర్తింపు పొందిన సాగుదారులు (ఆర్‌ఒఎఫ్‌ఆర్‌), దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న వారికే. ఈ వర్గాలకు కేంద్రం సహాయం చేయట్లేదు. అందువల్ల రాష్ట్రం తన నిధులతో సహాయం అందిస్తోంది. సదరు లబ్ధిదారులు 1,46,324 మంది మాత్రమే. ప్రభుత్వం జారీ చేసిన సిసిఆర్‌సి హోల్డర్లు లక్ష లోపే. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రూ.30 కోట్ల లోపు. అది కూడా ఖజానాలో నిధుల లభ్యతబట్టి రోజుకు కొంత మందికి విడుదల చేస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు మూడవ కిస్తు రైతుల పండగ సంక్రాంతికి విడుదల చేయాలి. కానీ కేంద్రంతో లింక్‌ వలన కౌలు రైతులకు తానిచ్చే సహాయానికి ఆలస్యం చేసింది.

➡️