సెబీకి ముంబయి హైకోర్టు మొట్టికాయలు

Dec 1,2023 21:30 #Business

ప్రజా ప్రయోజనాలే కీలకం

ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీయొద్దు

న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

ముంబయి : పెట్టుబడులు, స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ)కి ముంబయి హైకోర్టు మొట్టి కాయలు వేసింది. ఓ కేసులో కోర్టు ఆదేశాలను పాటించనందుకు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజనాల కోసం సెబీ చర్యలు తీసుకోవాలని.. అందుకోసమే పని చేయాలని ఆదేశించింది. అక్టోబర్‌లో కోర్టు జారీ చేసిన ఆదేశాలను సెబీ పాటించకపోవడంపై తీవ్రంగా స్పందించింది. సెబీ అనుసరిస్తున్న ఇటువంటి విధానం పెట్టుబడిదారులకు ఆ సంస్థపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని న్యాయమూర్తులు జిఎస్‌ కులకర్ణి, జితేంద్ర జైన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఓ సంస్థలోని మైనారిటీ షేర్‌ హోల్డర్లకు కొన్ని విచారణ పత్రాలను అందించాలని అక్టోబర్‌లో ఆ కంపెనీని, అదే విధంగా సెబీని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వును ఆ కంపెనీ, సెబి సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. కాగా.. ఆ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తిరిగి విషయం ముంబయి కోర్టుకు చేరింది.భారత్‌ నిధి లిమిటెడ్‌ తన మైనారిటీ వాటాదారుల, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ సెబికి వివిధ ఫిర్యాదులు చేశారు. కాగా.. దీనిపై సెబీ దర్యాప్తు ప్రారంభించింది. కంపెనీకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. కానీ విచారణ డాక్యూమెంట్లను ఫిర్యాదుదార్లకు ఇవ్వడానికి నిరాకరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సెబీ చేస్తున్న దర్యాప్తు ప్రహసనంగా ఉందని పిటిషనర్లు ఆరోపించారు. ఫిర్యాదుదారుల సెటిల్‌మెంట్‌ ఆర్డర్‌ను రద్దు చేసినందున.. ప్రస్తుత పిటిషన్లలో ఏమీ మనుగడలో లేదని సెబీ తాజాగా హైకోర్టుకు తెలిపింది. కాగా.. దీనిపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ”సెబీ మా ఉత్తర్వులను పాటించడం లేదు. ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఇది మేము ఊహించడానికి చాలా దూరంగా ఉంది. ఒక పబ్లిక్‌ బాడీ అయినా సెబీ ప్రజా ప్రయోజనాల కోసం పని చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు జారీ చేసిన ఆదేశాలకు లోబడి ఉండాలి. ప్రస్తుత కేసులో సెబీ తీసుకున్న విధానం మమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సెబి విధానం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పార్లమెంట్‌ ద్వారా అందుబాటులోకి వచ్చిన రెగ్యూలేటరీ బాడీ సెబీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే పని చేయాలి.” అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. తాము ఇచ్చిన ఆదేశాలను సెబీ పాటించకుండా ఉండేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలను ఆశ్రయించిందని, ఇది అర్థరహితమని పేర్కొంది. పిటిషనర్లకు పత్రాలను అందించాల్సిన అవసరం ఉందని, తన ఆదేశాలను సెబీ వెంటనే పాటించాలని ధర్మాసనం ఆదేశించింది.

➡️