ఎన్నికల్లేని సహకార సొసైటీలు

Feb 11,2024 10:14
ఎన్నికల్లేని సహకార సొసైటీలు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిసహకార సంఘాలు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఆరేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా అధికార పార్టీకి చెందిన నాయకులతోనే త్రీ మేన్‌ కమిటీలు వేయగా వాటిని పొడిగిస్తూ కొనసాగిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 299 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) ఉన్నాయి. 2013 ఎన్నికల నాటికి దాదాపు 4 లక్షల మంది సభ్యులు, సుమారు 2.5 లక్షల మంది ఓటర్లున్నారు. 2013, డిసెంబరులో కొన్ని, 2014, జనవరి, ఫిబ్రవరిలో మరికొన్ని సంఘాలకు ఎన్నికలు జరిగాయి. అయిదేళ్లకొకసారి జరగాల్సిన ఎన్నికలను వైసీపీ ప్రభుత్వం త్రిమేన్‌ కమిటీ పేరిట పాలకవర్గాలు నియమించింది. ఆరేళ్లుగా ఎన్నికలు లేవుగత టిడిపి ప్రభుత్వం వీటికి 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా 2018తో పదవీ కాలం ముగిసింది. దీంతో పాత పాలకవర్గాలనే ఒక సంవత్సరం పాటు కొనసాగించింది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా జరనల్‌ ఎలక్షన్స్‌ తెరమీదకు రావడంతో సొసైటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి త్రీమేన్‌ కమిటీలు కొనసాగుతుండగా ఈ నెల 31 తో పలు కమిటీల గడువు ముగియనుంది. మరో 6 నెలలు పాటు పాత కమిటీలనే పొడిగిస్తూ ఈ నెలాఖరులోగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని కాకినాడ జిల్లా సహకార అధికారి దుర్గా ప్రసాద్‌ తెలిపారు. మూడేళ్ల క్రితమే ఎన్నికల కోసం కసరత్తు చేసినా ప్రక్రియ ఆగింది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన సమయంలోనే నిర్వహిస్తారని అంతా ఊహించారు.సొసైటీల వారీగా ఓటర్ల జాబితాలు కూడా సిద్ధం చేశారు. పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసినా ఎన్నికలు జరగలేదు. అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసి 2019 ఆగస్టులో త్రిసభ్య కమిటీలను తెర పైకితెచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వీటి పదవీ కాలాన్ని పొడిగిస్తూనే ఉన్నారు. మరోసారి ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించనున్న నేపథ్యంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండే అవకాశం లేదు. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన ప్రభుత్వమైనా సహకార ఎన్నికలు ప్రక్రియను పూర్తి చేయాలని రైతాంగం ఎదురుచూస్తోంది.భూమి ఉన్న రైతులు, కౌలు రైతులు సొసైటీల్లో సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరికి స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, వాణిజ్య యంత్రాలను సంఘాలు అందజేస్తుంటాయి. రైతుల భూముల తనఖాపై కార్యదర్శులు రుణాలను అందిస్తారు. అయితే గత ఆరేళ్లుగా రెగ్యులర్‌ పాలకవర్గాలు లేకపోవడంతో తమకు సేవలు సక్రమంగా అందడం లేదని రైతులు వాపోతున్నారు. లక్ష్యాలు చేరుకోవడంలో వెనుకబడిపోతున్నాయి. రావాల్సిన బకాయిలు సక్రమంగా వసూలు కావడం లేదు. దీంతో సహకార సంఘాలు అభివద్ధి నానాటికీ కుంటుపడుతోంది. ఎన్నికలు జరపాలని సహకార సంఘాల ప్రతినిధులు గతంలో హైకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా పట్టనట్లే వ్యవహరిస్తోంది.

➡️