రైళ్ల కుదింపు… బోగీలు తగ్గింపు…

Dec 31,2023 12:09 #Compression of trains
  • పలు ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ కోచ్‌లకు భారీ కోత
  • సామాన్యులకు భారంగా రైలు ప్రయాణాలు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ప్రజా జీవితాలతో ముడిపడి ఉండే ప్రధాన రవాణా సాధనం రైలు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజానీకం తమ ప్రయాణాలకు దీన్నే ఎక్కువగా ఎంచుకుంటారు. రైళ్ల కుదింపు, భోగిల తగ్గింపు వంటి చర్యలకు కేంద్రం పూనుకుంది. తిరుమల, గోదావరి, ఎల్‌టిటి, జన్మభూమి, కోరమండల్‌, కోణార్క్‌ ఇలా పలు రైళ్లలో భారీ స్థాయిలో స్లీపర్‌ కోచ్‌లకు కేంద్ర రైల్వే శాఖ కోత విధించింది. స్పీడ్‌ ట్రైన్‌లు, వందే భారత్‌ రైళ్ల మోజులో పాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు క్రమంగా మంగళం పలుకుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెర్చడం లేదు. పైగా, పాల్తేరు రైల్వే డివిజన్‌ను ఎత్తేసింది.

విశాఖ మీదుగా తిరిగే 30 రైళ్లు పూర్తిగా రద్దు

విశాఖ మీదుగా దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే 125 రైళ్లలో 30 వరకూ కేంద్ర రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేల్లో అప్‌ గ్రేడేషన్‌ పనులను సాకుగా చూపించి మరో 25 వరకూ రైళ్లను డైవర్షన్‌ చేశారు. తర్వాత వీటిని డిమోలిషన్‌ (రద్దు) చేశారు. ఆరు నెలలుగా ఈ తంతు నడుస్తోంది. దీంతో, ఏ రైలు చూసినా కిక్కిరిసిన జనంతో రావడం, మళ్లీ అలాగే వెళ్లడం నిత్యం కనిపిస్తోంది.

తెంచేసిన బోగీలు..

రెగ్యులర్‌గా నడిచే సింహాద్రి, ఉదరు, రాజమండ్రి-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మచిలీపట్నం, కాకినాడ పాసింజరు రైళ్లు రద్దయ్యాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో 4, ప్రశాంతిలో 3, మచిలీపట్నంలో ఒక బోగిని తగ్గించేశారు. రాయగడ పాసింజర్‌కు జనరల్‌ బోగీలు పది ఉండేవి. ఇప్పుడు ఇవి మూడే ఉన్నాయి. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో గతంలో 12 స్లీపర్‌ బోగీలు, 6 ఎసి బోగీలుండగా, 14 ఎసి బోగీలకు పెంచి స్లీపర్‌ను 3కు కుదించేశారు. విశాఖ నుంచి ముంబయికి వెళ్లే ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్‌కి గతంలో 10 స్లీపర్‌, 4 ఎసి బోగీలు ఉండగా 9 ఎసి చేసేసి, 4 స్లీపర్‌ ఉంచారు. భువనేశ్వర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు గతంలో 14 స్లీపర్‌ బోగీలు ఉండేది. ఇప్పుడు వీటిని మూడుకు కుదించి మిగతావన్నీ ఎసి చేశారు.

త్వరలో కొన్ని స్టేషన్లకు మంగళం ?

ఈస్ట్‌ కోస్టు (వాల్తేరు) రైల్వే డివిజన్‌ పరిధిలో 115 స్టేషన్‌లు ఉన్నాయి. 250 రైళ్లు ఈ డివిజన్‌లో ప్రయాణాలు సాగిస్తున్నాయి. దీంట్లో, 130 రైళ్లు విశాఖ మీదుగా ప్రయనిస్తున్నాయి. గతంలో దక్షిణ మధ్య రైల్వేలో ఐదు స్టేషన్లను కేంద్రం ఎత్తేసింది. తాజాగా వాల్తేరు రైల్వే డివిజన్‌లో స్టేషన్లపై సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు వాల్తేరు రైల్వే పరిధిలో 50 వేల మంది ప్రయాణాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండగ వేళల్లో ఈ సంఖ్య లక్షా 20 వేలకు చేరుకొనే అవకాశం ఉందని రైెల్వే డిఆర్‌ఎం కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కానీ, రైళ్లు కానరావడం లేదు. ఆధునీకరణ, భద్రతా కారణాలను చూపుతూ రైల్వే శాఖ తరచూ గుణుపూర్‌, రాజమండ్రి పాసింజర్లను నెలల తరబడి రద్దు చేస్తూనే ఉంది.

బోగీల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితులు

గతంలో తుని వెళ్లేందుకు ఉదయం రాజమండ్రి పాసిం జర్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఉండేవి. సాధారణ టికెట్‌తో ప్రయా ణం సులభం గా ఉండేది. ఇప్పుడు వందే భారత్‌, ఉదరు వంటి ఎసి రైళ్లను పెట్టి సాధారణ ప్రయాణికులను ఇబ్బంది పెడు తున్నారు. నాలాంటి వారు 300 మంది రోజువారీ రాజమండ్రి, కాకినాడ ప్రాంతా లకు ప్రయాణాలు చేస్తున్నారు. బోగీల్లోకి అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. – గోడి జయప్రకాష్‌, ప్రయివేట్‌ ఉద్యోగి, తుని, కాకినాడ జిల్లా

ప్రయాణం భారంగా మారింది

విశాఖ నుంచి మా ప్రాంతానికి వెళ్లేందుకు గతంలో పాసింజర్‌, డిఎం యులు అందు బాటు లో ఉండేవి. నేడు పలు రైళ్లు తీసేశారు. ఉన్న కొద్ది రైళ్లు రద్దీగా తిరుగు తున్నాయి. వాటిలో కొన్నింటికి బొబ్బిలి స్టాప్‌ తీసేశారు. ఒకటి అరా తిరిగే రైళ్లకు ఎసి బోగీలు పెట్టారు. రోజువారీ ప్రయాణం ఆర్థిక భారంగా మారింది. – మౌనిక, గృహిణి, బొబ్బిలి, విజయనగరం జిల్లా

➡️