కనుమరుగవుతున్న పచ్చిక బయళ్లు

May 22,2024 00:23 #Disappearing, #pastures

– సగానికి సగం ధ్వంసం
– ఆహార భద్రతకు పెనుముప్పు
– పశు పోషకుల ఉపాధిపైనా ప్రభావం
– ఐక్యరాజ్యసమితి ఆందోళన
బెర్లిన్‌ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న పచ్చిక బయళ్లు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదివరకు ఉన్న గడ్డిభూముల్లో ఇప్పటికే 50 శాతం వరకూ ధ్వంసమైపోయాయని తెలిపింది. ఈ పరిణామం వందల కోట్ల మంది శ్రేయస్సును, ఆహారభద్రతను ప్రమాదంలోకి నెట్టివేస్తుందని తెలిపింది. ఎడారి ప్రాంతాల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘కన్వెన్షన్‌ టు కంబాట్‌ డిసార్టిఫికేషన్‌ (యుఎన్‌సిసిడి)’ మంగళవారం ఒక నివేదికను విడుదల చేసింది. గడ్డిభూములు, పశుపోషణ మైదానాలు భూభాగంలో 54 శాతం వరకూ వ్యాపించి ఉన్నాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో ఆరో వంతు వాటాను కలిగిఉన్నాయి. అయితే ఈ భూములన్నీ నేల కోత, లవణీయత, జీవవైవిధ్యం కోల్పోవడం, మితిమీరిన వినియోగం, దుర్వినియోగం, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వినాశనానికి గురువుతున్నాయని ఐరాస తన నివేదికలో తెలిపింది. అలాగే, ఈ భూములను పంట భూములుగా మార్చడం, పట్టణ ప్రాంతాలుగా మారడం వంటివి కూడా సమస్యను మరింతగా పెంచుతున్నాయని హెచ్చరించింది. గడ్డిభూములను సరరక్షించడానికి వాతావరణ వ్యూహాలను మెరుగుపర్చడం, భూ మార్పిడులను తగ్గించడం వంటివి చేపట్టాలని నివేదిక సిఫార్సు చేసింది.
గడిమైదానాలు వినాశనానికి గురికావడం పట్ల మానవుల స్పందన అంతంత మాత్రంగానే ఉంటోందని ఐరాస సిసిడి ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ ఇబ్రహీం థియాన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక అడవిని నరికివేసినప్పుడు లేదా 100 ఏళ్ల చెట్టు పడిపోవడం చూసినప్పుడో చాలా మందిలో కలిగే భావోద్వేగ ప్రతిస్పందన.. ఒక పురాతన గడ్డిమైదానం వినాశనానికి గురైనప్పుడు కలగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మంది పశుపోషకులు ఉన్నప్పటికీ ఈ సమస్య విస్మరణకు గురవుతోందన్నారు. పశుపోషకుల జీవనోపాధిని నేరుగా ప్రభావితం చేసే అంశమే అయినా దీనిపై ఎవ్వరూ గొంతెత్తడం లేదన్నారు. పశువుల మేత డిమాండ్‌కు తగ్గట్లుగా గడ్డిభూములు లేకపోతే ఆక్రమణలు, కరువు, కార్చిచ్చులు వంటి ప్రమాదాలు పెరుగుతాయని చెప్పారు. ఎడారీకరణ, భూమి సారం తగ్గం వంటి అంశాలను వేగవంతం చేస్తాయని చెప్పారు. భవిష్యత్‌ తరాల ఆర్థిక స్థిరత్వం కోసం గడ్డిభూముల విలువపై అవగాహనను మెరుగుపర్చాలని, వాటి రక్షించాల్సిన అవసరం ఉందని గ్లోబుల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫెసిలిటీ సిఇఓ, చైర్‌పర్సన్‌ కార్లోస్‌ మాన్యుయెల్‌ రోడ్రిగ్జ్‌ చెప్పారు.

➡️