దొడ్డిదారి విద్యుత్‌ వడ్డనలొద్దు!

Jan 29,2024 10:32 #Andhra Pradesh, #Electricity Bill

స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లకు బ్రేకెయ్యాలి

నేటి నుండి ఎపిఇఆర్‌సి పబ్లిక్‌ హియరింగ్‌

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షికాదాయ అవసర నివేదిక (ఎఆర్‌ఆర్‌)లపైన, ఐదవ కంట్రోల్‌ పీరియడ్‌కు సంబంధించిన మల్టీ ఇయర్‌ టారిఫ్‌ (ఎంవైటి)పైన ఏకకాలంలో సోమవారం నుండి బుధవారం వరకు పబ్లిక్‌ హియరింగ్‌ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. తొలుత ఎంవైటి ని నిర్ధారించి, ఆ ప్రాతిపదికన ఎఆర్‌ఆర్‌ చేపట్టడం ధర్మంగా ఉండేది. అలాగే హియరింగ్‌లను మూడు డిస్కాముల పరిధిలో ప్రత్యక్షంగా నిర్వహిస్తే సబబుగా ఉండేది.

ట్రూ అప్‌, ఎఫ్‌పిపిసిఎ దొంగ దెబ్బ

మూడు డిస్కాములవారు 2024-25 సంవత్సరానికి ఆదాయ లోటు రూ. 13,887 కోట్లుగా పేర్కొన్నారు. గతంలో వున్న టారిఫ్‌నే కొనసాగిస్తాం (సోలార్‌ ప్యానెల్‌ తయారీదార్లకు భారీ రాయితీ, రైల్వేలకు టారిఫ్‌ పెంపు వంటివి మినహా) అన్నారు. అయితే ఈ భారీ లోటు పూడ్చడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా ఏం చేస్తుందో చెప్పకుండా జీవో 161 ప్రకారం లోటు భర్తీ ఉంటుందన్నారు. అయితే, డిస్కాములు ప్రస్తుతం ట్రూఅప్‌ చార్జీలతోపాటు ఎలాంటి ప్రతిపాదన, పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించకుండానే ఎఫ్‌పిపిసిఎ ఛార్జీల పేరిట యూనిట్‌కు నెలకు 40 పైసల చొప్పున వినియోగదార్ల నుండి వసూలు చేస్తున్నారు. రానున్న ఏడాదిలోనూ అలా చేస్తారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇటువంటి దొడ్డిదారి వసూళ్లను కమిషన్‌ అనుమతించరాదన్నది ప్రజాభిప్రాయం. ట్రూఅప్‌ చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నది వారి అభిమతం. చార్జీలు పెంచడం లేదంటూనే ఇలాంటి వడ్డనలు గత నాలుగేళ్లుగా పెరుగుతున్నాయి.

మిగులు అంటూనే స్వల్పకాలిక కొనుగోళ్లు

మూడు డిస్కాములకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 83,117 మిలియన్‌ యూనిట్లు (మి.యూ) అవసరం కాగా 88,507 మి.యూ. అందుబాటులో వున్నందున 5,389 మి.యూ. మిగులు తేలుతుందని పేర్కొన్నాయి. అయితే, ఈ మిగులు విద్యుత్‌ అమ్మకం గురించి ఏమీ చెప్పలేదు కానీ 421 మి.యూ. విద్యుత్‌ను స్వల్పకాలిక కొనుగోలు చేయాలన్నారు. మిగులు తేలిన విద్యుత్‌కు ఫిక్సెడ్‌ చార్జీల పేరిట పెద్ద మొత్తాన్ని ముట్టజెప్పడం, మరోవైపు స్వల్పకాలిక కొనుగోళ్లలో అధిక ధర చెల్లించడం జరుగుతోంది. (2023-24 సంవత్సరంలో డిస్కాములు యూనిట్‌ ఎనిమిది రూపాయల కన్నా ఎక్కువ పెట్టి కొన్నట్టు అంచనా) కాబట్టి వినియోగదార్లపై భారం పడని రీతిలో మిగులు విద్యుత్‌ అమ్మకం, స్వల్పకాలిక కొనుగోళ్లలో డిస్కాములకు పరిమితులను, ఈ వ్యవహారాల్లో పారదర్శకమైన విధానాన్ని రూపొందించడం అవసరం.

సర్కారు బకాయిలు

రాష్ట్ర ప్రభుత్వం మూడు డిస్కాములకు సబ్సిడీగా చెల్లించవలసిన రూ.22,234 కోట్లు బకాయి పెట్టింది. ఇంత భారీమొత్తాన్ని ప్రభుత్వం బకాయిపెట్టడంతో డిస్కాములు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవలసివస్తోంది. ఆ భారం వినియోగదార్లపైనే పడి తడిసి మోపెడవుతోంది. కనుక ప్రభుత్వం సకాలంలో బకాయి చెల్లిస్తే ఆ మేరకు వినియోగదార్లకు భారం పడదు కనుక కమిషన్‌ సర్కారుకు తగు ఉత్తర్వులివ్వడం అవసరం. యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాలు బాకీపడ్డ వినియోగదార్లు 2023 సెప్టెంబర్‌ నాటికి ఎస్‌పిడిసిఎల్‌ కు రూ.3,237 కోట్లు, ఇపిడిసిఎల్‌కు రూ.1,295 కోట్లు చెల్లించవలసివుంది. అయితే ఈ బకాయిల వసూళ్లకు డిస్కాములు చేస్తున్న కృషి ఏమిటో, అలాగే ఆ ప్రయత్నంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులు, పెద్దల నుండి వస్తున్న ఒత్తిళ్ల గురించి కూడా పేర్కొంటే బాగుండేది. యాభై వేల రూపాయలకన్నా ఎక్కువ మొత్తాల బాకీల వసూలుకు నిర్దిష్ట కాల పరిమితితోసహా ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.

స్మార్ట్‌ మీటర్లు వద్దు

రాష్ట్రంలో స్మార్ట్‌ ప్రిపెయిడ్‌ మీటర్ల ఏర్పాటుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. వ్యవసాయ పంప్‌సెట్లకు వాటిని ఏర్పాటు చేయడానికి సర్కారు ఖజానానుండి వేల కోట్ల రూపాయలను అదానీ గ్రూప్‌, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌ ఇంకా ఇతర ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. అదే విధంగా ప్రస్తుతం పని చేస్తున్న మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లను ఇతర కనెక్షన్లకూ సదరు వినియోగదార్ల అనుమతి లేకుండా ఏర్పాటు చేయడం విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 47(5) ప్రకారం చెల్లదు. ప్రజా ధనం వృథా కాకుండా నివారించేందుకు ఇప్పుడు అవసరంలేని స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటును కమిషన్‌ అనుమతించరాదు. ఇప్పటికే కేరళలోని పినరయి విజయన్‌ ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. మీటరింగ్‌ వ్యవస్థను ఆ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు ద్వారా నిర్వహిస్తామనీ, ప్రైవేటు కంపెనీల జోక్యాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. ఆర్‌డిఎస్‌ఎస్‌ పరిధిలో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కత్తిరిస్తామని బెదిరిస్తే అందుకూ సిద్ధమేనంది తప్ప ఎంతమాత్రం తలొగ్గలేదు. మడమ తిప్పనని పదే పదే చెప్పే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదార్ల కోసం అలాంటి వైఖరి చేపడితే మంచిది కదా! సర్కారు అలా స్పందించకపోతే రెగ్యులేటరీ కమిషన్‌ అయినా వినియోగదార్ల ప్రయోజనాలు కాపాడడానికి స్మార్ట్‌ ప్రీ పెయిడ్‌ మీటర్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.

బి తులసీదాస్‌

➡️