తరిగిపోతున్న ‘బీమా’

Jan 21,2024 08:47 #Dwindling, #Insurance
  • 16 వేల మందికి రూ.219 కోట్లు మాత్రమే
  • ఐదేళ్లుగా లబ్ధిదారులు, వ్యయంలో కోతలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : వైఎస్‌ఆర్‌ బీమా కుదించుకుపోతోంది. లబ్ధిదారుల సంఖ్యతోపాటు, వారికోసం వెచ్చిస్తున్న నిధులు కూడా తగ్గిపోతున్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో పరిశీలిస్తే ఈ కుదింపు స్పష్టంగా కనిపిస్తోంది. 67 వేల మంది లబ్ధిదారుల సంఖ్య నుంచి ప్రస్తుతం 17 వేల మంది లబ్ధిదారులకు తగ్గిపోవడం గమనార్హం. నిధుల వ్యయం కూడా 2019-20లో రూ.1,058 కోట్లుగా ఉండగా, అది తాజా ఆర్థిక సంవత్సరంలో రూ.219 కోట్లకు తగ్గిపోయింది.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిలో మరణం సంభవించినా, అంగవైకల్యం ఏర్పడినా వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. కుటుంబ పోషణలో కీలకంగా ఉండే వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు గానూ చాలా సంవత్సరాలుగా గత, తాజా ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రతియేటా బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయిస్తున్నారు. కొన్నేళ్లుగా నిధుల వ్యయం తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా వెలుగుచూసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇదే పథకానికి కేంద్రం నుంచి కూడా ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన కింద కొంత నిధులు వస్తున్నాయి. అయితే రాష్ట్ర అధికారులు చెబుతున్న లెక్కల మేరకు 2021 నుంచి ఈ నిధులు రావడం లేదని తెలుస్తోంది. లబ్ధిదారులు, వ్యయం వివరాల్లో జీవన్‌ జ్యోతి బీమా పేరును అధికారులు చెప్పకపోవడంతో ఈ నిధులు రావడం లేదన్న భావన వ్యక్తమవుతోంది.2014-15 నుంచి రెండేళ్లపాటు బీమా పథకం లేకపోగా, తరువాత 2016-17లో అప్పటి ముఖ్యమంత్రి పేరున చంద్రన్న బీమాను అమలు చేశారు. 2017-18 నురచి రెండేళ్లపాటు చంద్రన్న బీమా, జీవన్‌ జ్యోతి బీమాను కలిపి అమలు చేయగా, 2019-20లో వైఎస్‌ఆర్‌ బీమా, జీవన్‌జ్యోతి బీమాను అమలు చేశారు. తరువాత ఏడాది నుంచి కేవలం వైఎస్‌ఆర్‌ బీమాను మాత్రమే అమలు చేస్తున్నట్లు కార్మికశాఖ చెబుతోంది.

➡️