అంతా ఒట్టిదే !

Feb 6,2024 10:42 #minors
  • నినాదంగానే ‘సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌’
  • దేశంలో ప్రబలుతున్న విద్వేష రాజకీయం
  • భయం గుప్పిట్లో మైనారిటీలు

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దేశ చరిత్రలో ఇవి ఎంతో కీలకమైన ఎన్నికలు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగాలా లేక హిందూ రాష్ట్రంగా ఆవిర్భవించాలా అనేది తేల్చే జీవన్మరణ పోరాటం. ప్రధాని నరేంద్ర మోడీ అందిపుచ్చుకున్న ‘సబ్‌కా సాథ్‌… సబ్‌కా వికాస్‌’ నినాదం ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. దేశంలోని మైనారిటీలు భయం గుప్పిట్లో కాలం గడుపుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. తన ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మతాన్ని అనుమతించబోదని మోడీ 2015లో ప్రకటించారు. హిందూ ముస్లింలు కలసికట్టుగా కృషి చేసి దేశం నుండి పేదరికాన్ని పాలద్రోలాలని కూడా ఆయన హితవు పలికారు. కొద్ది నెలల క్రితం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ కావాలని సూచించారు. కానీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఏమిటి?

2022లో కాశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రాన్ని ప్రధాని బహిరంగంగానే సమర్ధించారు. 1990లో లోయ నుండి తరలిపోయిన ఓ కాశ్మీర్‌ పండిట్‌ కథ ఇది. ఈ చిత్రంలో ముస్లింలపై విషం చిమ్మారు. ముస్లింలందరినీ ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. హిందువులపై ప్రశంసలు కురిపించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని మోడీ కొనియాడారు. అంతేకాదు…దానికి ఓ ప్రచారకుడిగా కూడా వ్యవహరించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా దేశంలో హిందూ జాతీయతావాదం ప్రబలిపోతోంది. దీనికి అనేక రూపాలు…దాడి చేసి కొట్టడం, ఘర్‌ వాపసీ, రోమియో వ్యతిరేక బృందాలు, గో సంరక్షణ, బుల్డోజర్‌ భయం, మసీదులపై దాడులు…ఇవన్నీ హిందూ జాతీయతావాదం, మతోన్మాదం ప్రబలుతున్నాయనడానికి ఉదాహరణలే.

కోవిడ్‌ మహమ్మారికి ప్రజలు పెద్ద ఎత్తున బలై ప్రాణాలు కోల్పోతుంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్‌ మీడియా సాయంతో తబ్లీకీ జమాత్‌పై ముప్పేట దాడి చేసింది. కోవిడ్‌కు ఈ సంస్థ ఒక్కటే కారణమంటూ ప్రధాని నిందలు మోపారు. ఆ సంస్థకు చెందిన అనేక మందిని జైళ్లలోనూ, డిటెన్షన్‌ కేంద్రాల్లోనూ పెట్టారు. వీరిపై మోపిన ఆరోపణలన్నింటినీ ఆ తర్వాత న్యాయస్థానాలు కొట్టివేశాయి. శంభూలాల్‌ రేగర్‌ అనే మానవ మృగం అఫ్రజుల్‌ ఖాన్‌ను ఉరి తీసి చంపిన ఉదంతాన్ని మైనారిటీలు ఎన్నటికీ మరువలేరు. ఆయన నేరమల్లా ముస్లిం కావడమే. ఈ దారుణాన్ని రేగర్‌ బంధువైన 14 సంవత్సరాల బాలుడు చిత్రీకరించి ప్రపంచానికి చూపాడు. అటవికంగా ప్రవర్తించిన రేగర్‌ను శిక్షించాల్సింది పోయి శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా సత్కరించారు. హిందువుల గౌరవాన్ని కాపాడాడంటూ కొనియాడారు.

భకర్వాల్‌ గిరిజనులను భయభ్రాంతుల్ని చేసేందుకు కథువాలో ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడి చేసి ఆటవికంగా హతమార్చిన ఉదంతం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇక్కడ సిగ్గు పడాల్సిన విషయమేమంటే కథువా బార్‌ అసోసియేషన్‌తో పాటు సమాజంలోని కొన్ని వర్గాలు హంతకులకు బాసటగా నిలవడం. ఇక్కడ మరో ఘటనను గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మాంసాన్ని రవాణా చేస్తున్నాడన్న అనుమానంతో అలీముద్దీన్‌ అన్సారీ అనే వ్యక్తిని ఎనిమిది మంది పొట్టనపెట్టుకున్నారు. వీరిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది కూడా. అయితే వీరేదో ఘనకార్యం సాధించారన్నట్లు కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా సన్మానించారు. గుజరాత్‌లో ఓ వేడుకకు అంతరాయం కలిగించారన్న ఆరోపణపై 10 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని న్యాయస్థానం ముందు హాజరు పరచాల్సిన పోలీసులు విద్యుత్‌ స్తంభానికి కట్టేసి, జనం ఎదుటే కొరడాలతో కొట్టారు. ఇక బిల్కిస్‌ బానో ఉదంతాన్ని ఎలా మరువగలం? ఇప్పుడు ఇలాంటి ఘటనలన్నీ సర్వసాధారణమై పోయాయి.

అవి ఇంకెంత మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురి చేయబోవు. ముస్లింల పట్ల వివక్ష చూపే పౌరసత్వ సవరణ చట్టాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు. ఇదే కాదు…మత మార్పిడుల నిరోధక చట్టం, గో వధ నిరోధక చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి వంటివన్నీ మెజారిటీ వర్గాన్ని సంతృప్తి పరచేందుకు ఉద్దేశించినవే.

నైతికంగా పతనమైన, గౌరవాన్ని కోల్పోయిన ఈ ప్రభుత్వం తాజాగా రామ మందిరాన్ని నిర్మించి గొప్పలు చెప్పుకుంటోంది. శ్రీరాముడు ఏం బోధించాడన్న విషయాన్ని మాత్రం మరచిపోతోంది. న్యాయం, సమానత్వం, అహింస ఆధారంగానే రామరాజ్యం సాగింది. కానీ నేడు మోడీ రాజ్యం ఎలా వుంది? వీరు రామ మందిరాన్ని నిర్మించింది ఆయన చూపిన మార్గంలో పయనించడానికి కాదు… ప్రజలను మరింతగా విభజించడానికి. తన దృష్టిలో అందరూ సమానులేనని చెప్పుకునే మోడీ ముస్లింలు, క్రైస్తవుల విశ్వాసాలను అవమానిస్తూ మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం వారి ప్రార్థనా స్థలాలను కూల్చేయడం ఎంత వరకూ సమర్ధనీయం? తాజాగా జ్ఞానవాపి మసీదులో పూజలు మొదలయ్యాయి. మనం అంతం లేని నిశీధిలోకి జారిపోతున్నాం.

➡️