ఆధునికతకు ఆద్యుడు గురజాడ

Nov 30,2023 07:15 #Gurajada Apparao, #Poets
gurajada apparao profile

తెలుగు భాషా సాహిత్యాలను, సామాజిక చైతన్యాన్ని గొప్ప ముందంజ వేయించిన సంస్కర్త-మహాకవి గురజాడ అప్పారావు. రాజు నుంచి రోజు కూలీ దాకా సమకాలీనులను అమితంగా ప్రభావితం చేసిన నవయుగ వైతాళికుడు. స్త్రీలను తొక్కిపెట్టే నాటి శిథిల సమాజంపై ‘కన్యాశుల్కం’ నాటకంతో అగ్నివర్షం కురిపించిన కలం యోధుడు గురజాడ. ‘బ్రతికిచచ్చియు ప్రజలకెవ్వరు బ్రీతి కూర్చునో వాడే ధన్యుడు’ అంటారు ఆయనే ఒకానొక సందర్భంలో! అయన రచనలూ నేటికీ సమకాలీనతను, ప్రాసంగికతను కలిగి వుంటాయి. కేవలం 52 సంవత్సరాల జీవితంలోనే అనల్పమైన దార్శనికతతో కాలాన్ని ముందుకు నడిపిన ప్రతిభామూర్తి, కలం యోధుడు గురజాడ అప్పారావు. దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ సంస్కరణ: సంఘ చైతన్యం…వంటివెన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించిన కార్యకర్త గురజాడ. నెలలు నిండకుండానే పుట్టి (21-9-1862) షష్టి పూర్తి కాకుండానే క(పె)న్ను మూసి 30-నవంబర్‌ 1915 తెలుగుజాతి హృదయాల్లో శాశ్వతంగా జీవిస్తున్న ధన్యుడు గురజాడ. మరణించిన తర్వాతే జీవించడం మొదలు పెట్టాడు. సృజనాత్మకత- సాహిత్య భాషగా వాడుక భాషకై తపించిన గురజాడ సర్వ ప్రపంచ దేశాలు తమ దేశగేయంగా పాడుకొనే స్థాయిలో ‘దేశమును ప్రేమించుమన్న’ అంటూ దేశభక్తి గేయం (9 ఆగస్ట్‌ 1913లో) రాశారు.1892 లోనే కన్యాశుల్కం, 1906లో కొండుభట్టీయం-రాసినా …వ్యవహారిక భాషోద్యమంకై బలమైన పోరాటం నాటికాలం పండింతులపై చేశాడు. సాంప్రదాయ వాదుల్ని మట్టికరిపించాడు. భిన్న కులాల సహపంక్తి భోజనం పెట్టించడం-కన్యల కన్నీటిని కన్యక-పూర్ణమ్మ గేయాల్తో తుడిచి పరామర్శిచి ముత్యాల సరాల మాల కట్టి….”మీ పేరేమిటి?” అంటూ దైవాన్ని ప్రశ్నించిన హేతువాది అతడు. ఆధునిక కథకు ”దిద్దుబాటు” జరిపి సుభద్ర లాంటి పద్యకావ్యం రాయగలను అన్న భాషాశాస్త్రవేత్త గురజాడ…’మంచి అన్నది మాల అయితే, మాలనేనగుదున్‌’ అని సామాజిక సంస్కరణకు గొంతిచ్చాడు.’అలనాటి అగ్రేసర భాషా పండితులైన కాశీభట్ల బ్రహ్మయ్య, కాశీ కృష్ణమాచార్యులు, కొక్కొండ వెంకటరత్నం, వావిల కొలను సుబ్బారావు, కూచి నరసింహ, మోచర్ల రామచంద్రరావులు, జయంతి రామయ్య, వేదం వెంకట్రామ శాస్త్రి, పానుగంటి లక్ష్మీనరసింహ, కొమర్రాజి లక్ష్మణరావు లాంటి కరుడుకట్టిన గ్రాంథిóక భాషావాదులు పన్నిన వ్యూహాలు ఛేదించుకొని ప్రజల భాషయైన వాడుక భాష కోసం గిడుగు రామ్మూర్తి నీడలో పోరాడిన మహా యోధుడు గురజాడ” అంటారు పురిపండా అప్పలస్వామి. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ”దేవుళ్లారా మీ పేరేమిటి”? అని కథ రాయడం మామూలు విషయం కాదు. రాచరికపు హద్దులు బద్దలు కొట్టి రాజభక్తిని, దైవభక్తిని వీడి దేశభక్తి వరకు నడిపించిన దార్శినిక అక్షర యోధుడు గురజాడ అప్పారావు. రేపటి తరానికి నిత్య మార్గదర్శి, జన పక్షపాతి, అభ్యుదయ పథగామి.

(నేడు గురజాడ 108వ వర్థంతి)- తంగిరాల చక్రవర్తి, సెల్‌ : 9393804472

➡️