నేనే రాజ్యాంగం

May 18,2024 09:57 #Constitution
  • పదేళ్ల పాలనలో నరేంద్ర మోడీ తీరు

న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు తరచూ ఇవే ఆరోపణలను వినిపిస్తున్నాయి. అయితే, మోడీ ఈ పదేళ్ల పాలనను చూస్తే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనన్న భావన కలుగుతున్నదని మేధావులు, విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్టులు అంటున్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు మోడీ చేస్తున్న ముప్పు స్పష్టమైనదేననీ, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని వారు చెప్తున్నారు. తన దశాబ్ద పాలనలో మోడీ తానే రాజ్యాంగం అన్న విధంగా వ్యవహరించారనీ, నిబంధనలకు పాతరేసి పాలన కొనసాగించారని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ”ఏ ప్రధానమంత్రీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయరు. కానీ, మోడీ తన చర్యలు, అతని మద్దతుదారుల చర్యల ద్వారా కూడా రాజ్యాంగానికి ముప్పును కలిగించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాని చాలా కీలకం. అయితే, ఈ పదేండ్ల కాలంలో లోక్‌సభలో, ఆ తర్వాత ఉభయ సభల్లో బిజెపి తన మెజారిటీని చూసుకొని ప్రతిపక్షాలను చిన్నచూపు చూసింది” అని వారు అంటున్నారు. నియమ, నిబంధనలను తుంగలో తొక్కటమేగాక.. ప్రతిపక్షాలను చిన్న చూస్తూ రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెట్టిన సందర్భాలు మోడీ పాలనలో అనేకం చోటు చేసుకున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ప్రధానిగా మోడీ ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు కాబట్టి ఆయనపై విమర్శలు, దాడులు చేయకూడదనే బిజెపి శ్రేణులు రూపొందించిన సిద్ధాంతం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమేనని విశ్లేషకులు అంటున్నారు. గత పదేండ్లలో లోక్‌సభ, రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మోడీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకపోవటం గమనార్హం. అయితే, రాజ్యాంగం విషయంలో ప్రధాని ఎంత తక్కువ శ్రద్ధ చూపుతున్నారో ఇది స్పష్టం చేస్తున్నదని అంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆత్మగా పరిగణించబడుతుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏ ప్రశ్ననైనా లేవనెత్తవచ్చు. ఇక, మే 2014 నుంచి మోడీ ఒక్క విలేకరుల సమావేశంలో కూడా ప్రసంగించకపోవడం గమనార్హం.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో డిప్యూటీ స్పీకర్‌ లేకపోవటం 17వ లోక్‌సభకే చెల్లింది. అయితే, ఇదంతా మోడీ ప్రణాళికనేనని విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంటరీ కన్వెన్షన్‌ ప్రకారం.. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాలి. కాబట్టి బిజెపియేతర పార్టీలలో అత్యధిక సంఖ్యాబలం సాధించిన ప్రతిపక్షాలకు, ప్రత్యేకించి కాంగ్రెస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ కారణంగానే మోడీ డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక విషయంలో అయిష్టతను వ్యక్తం చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ”గడచిన పదేళ్లలో మోడీ పార్లమెంటును నడుపుతూ రాజ్యాంగ సారాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఎక్కువ చర్చల కోసం తగిన స్టాండింగ్‌ కమిటీకి బిల్లులను సూచించే రాజ్యాంగపరమైన లేదా పార్లమెంటరీ స్కీమ్‌ వాస్తవంగా తొలగించబడింది. కొన్ని చర్యలను ఆమోదించే సమయంలో షార్ట్‌ కట్‌లు ప్రభుత్వంపై, ముఖ్యంగా ప్రధానిపై ఒకటి కంటే ఎక్కువసార్లు ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి” అని చెప్తున్నారు.
రైతుల తీవ్ర నిరసనల నేపథ్యంలో మూడు ‘నల్ల’ చట్టాలు(సాగు చట్టాలు) ప్రతిపక్షాల నిరసనల నడుమ పార్లమెంటులో ఆమోదం పొందాయి. ఇదేవిధంగా, పార్లమెంట్‌లో జరిగిన గందరగోళాన్ని సద్వినియోగం చేసుకొని మోడీ ప్రభుత్వం అనేక బిల్లులను చట్టాలుగా మార్చింది. లోక్‌సభ, రాజ్యసభ నుంచి చాలా మంది ప్రతిపక్ష సభ్యులను ప్రిసైడింగ్‌ అధికారులు బయటకు పంపిన తర్వాత కొన్ని ఆమోదించబడటం గమనార్హం. ” లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మెన్‌ కుర్చీలకు ఉన్న గౌరవాన్ని ప్రధాని మోడీ తగ్గించారు. 17వ లోక్‌సభకు అధ్యక్షత వహించిన ఓం బిర్లా ‘కుడివైపు’ చూసేవారు. ప్రతిపక్ష నాయకులు సరైన గౌరవం దక్కేది కాదు. సభలో ప్రసంగించేందుకు తగిన అవకాశమూ లభించేది కాదు. ఇది ప్రతిపక్షంలో కీలకంగా ఉన్న నేత రాహుల్‌ గాంధీ విషయంలో అనేకసార్లు జరిగింది. సభలో బిజెపి ఎంపిలు ఆయనను గేలి చేసే విధానం, మాట్లాడనీయకపోవటం, స్పీకర్‌ అంతగా కట్టడి చేయకపోవటం వంటివి జరిగాయి. బిజెపికి మెజారిటీ లేని రాజ్యసభను తప్పించేందుకకు మోడీ మనీ బిల్లుగా పేర్కొంటూ వివాదాస్పద బిల్లును ఎలా ఆమోదింపజేసుకున్నారో పార్లమెంటరీ ఘట్టాన్ని పరిశీలకులు మరచిపోలేదు. తర్వాత అది మనీ బిల్లు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది” అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. అలాగే, బిజెపి రాజ్యాంగాన్ని కూడా మోడీ పట్టించుకోలేదు. 2019లో బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా స్థానంలో జె.పి నడ్డాను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మోడీ నియమించారు. అసలు, బిజెపి రాజ్యాంగంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనే నిబంధనే లేకపోవటం గమనార్హం. ”పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య చర్చల ద్వారా నడుస్తుంది. ప్రధాని ఎప్పుడూ చర్చను కొనసాగించటంలో ఎటువంటి చొరవ తీసుకోలేదని ప్రతిపక్షాల ఆరోపణ. ప్రధాని తన హయాంలో గుజరాత్‌లో అనుసరించిన దారుణ ప్రజాస్వామ్య పద్ధతులను పార్లమెంటుకు తీసుకురావటం బాధాకరం. ప్రత్యర్థులను తాత్కాలికంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించటం, వారు లేనప్పుడు హడావుడిగా శాసన సభను ఆమోదించటం మోడీ హయాంలో గుజరాత్‌ మోడల్‌. ఈ ‘గుజరాత్‌ మోడల్‌’ ప్రత్యర్థులను ఫైరింగ్‌ లైన్‌పైకి తెచ్చి రాజ్యాంగాన్ని దెబ్బతీసింది. వారి ఏకైక తప్పు ఏమిటంటే వారు ప్రభుత్వానికి కుడి వైపున లేకపోవటమే” అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌.. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక ఫూల్‌ప్రూఫ్‌ డాక్యుమెంట్‌ అని సూచించారు. అయితే ఇది అధికారంలో ఉన్న వ్యక్తుల స్వభావం, సమగ్రత, వారు పని చేసే విధానంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాజ్యాంగ నిర్మాతల భయాలు నిజమయ్యేలా మోడీ తీరు ఉన్నదని మేధావులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. బిజెపి, ప్రధాని విధానాలు, తీరుతెన్నులు భారత్‌ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రమూ శ్రేయస్కరం కావని వారు అంటున్నారు.

➡️