ఓటుకు ముడుపులు తీసుకుంటే బోనెక్కాల్సిందే !

Mar 5,2024 09:11 #donations, #pay, #voter
  • అవినీతికి పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణలేవీ ఉండవ్‌
  • 1998 జెఎంఎం ముడుపుల కేసులో మెజార్టీ తీర్పును కొట్టేస్తూ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 1998 నాటి జెఎంఎం ఎంపీల ముడుపుల కేసులో మెజార్టీ తీర్పును కొట్టివేస్తూ ఏడుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పార్లమెంటులో పివి నరసింహారావు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ముడుపులు తీసుకుని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. పార్లమెంటులోపల సభ్యుల చర్యలు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ పరిధిలోకి రావని, ఈ విషయంలో పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయని ఆ కేసులో జెఎంఎం ఎంపీలు వాదించారు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఆనాడు 3-2 తేడాతో జెఎంఎం ఎంపీలకు అనుకూలంగా ఆనాడు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పలు విపరీత పరిణామాలకు దారి తీస్తుందని, ముడుపులు, అవినీతి వంటి విషయంలో చట్ట సభల సభ్యులకు ప్రత్యేక రక్షణల కింద ఎలాంటి మినహాయింపులు ఉండవని చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ముడుపులు తీసుకుని ఓటు వేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేసేందుకు సిబిఐకి తలుపులు తెరిచింది. ముడుపులు తీసుకుని ఓటు వేసినా, ముడుపులు ముట్టజెప్పినవారికి అనుకూలంగా సభలో ప్రసంగించినా అది నేరంగానే పరిగణించబడుతుందని, అవినీతి నిరోధక చట్టం కింద సదరు ఎంపీ లేదా ఎమ్మెల్యే బోనెక్కాల్సి ఉంటుంని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. డబ్బు ఎక్కడ చేతులు మారిందన్నది కాదు ముఖ్యం, ముడుపులు ముట్టాయా లేదా అన్నదే ఇక్కడ ప్రధానం అని చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు.

జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) మాజీ ఎమ్మెల్యే సీతా సోరెన్‌ 2012 రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, తన సొంత పార్టీ నియమించిన అభ్యర్థికి ఓటు వేశానని ఆమె బుకాయించారు. ఈ కేసులో సిబిఐ ఆమెపై చార్జీషీట్‌ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌ను కొట్టివేయాలన్న ఆమె అభ్యర్థనను జార్ఖండ్‌ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో తీర్పు 1998 నాటి జెఎంఎం ఎంపీల ముడుపుల కేసులో తీర్పుపై ఆధారపడి ఉండడంతో సెప్టెంబరు 20న సుప్రీం కోర్టు ఆ తీర్పును పునస్సమీక్షించాలని నిర్ణయించింది. సీతా సోరెన్‌ జెఎంఎం వ్యవస్థాపకుడు షిబు సోరెన్‌ కోడలు. షిబు సోరెన్‌ జెఎంఎం ఎంపీల ముడుపుల కేసులో నిందితుల్లో ఒకరు. పివి నరసింహారావు కేసులో వెలువరించిన తీర్పు ఆర్టికల్‌ 105, 194కు విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. శాసన అధికారాల ఉద్దేశం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అధికారాలు సమిష్టిగా చట్టసభలకు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 105, 194 సభ్యులకు నిర్భయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది. అవినీతి, శాసనసభ్యుల లంచం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని తెలిపింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తెలిపింది.

ప్రజా ప్రతినిధి ముడపులు తీసుకుని ఓటు వేయడం లేదా మాట్లాడడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లంచం తీసుకున్నట్లు ఎంపిలు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే, అప్పుడు వాళ్లను విచారించవచ్చు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 105, 194ను సాకుగా చూపి వాళ్లు విచారణ నుంచి తప్పించుకోజాలరని తెలిపింది. ఆర్టికల్స్‌ 105(2), 194(2) ప్రకారం ఎంపిలు, ఎమ్మెల్యేలకు రక్షణ కల్పిస్తే, అప్పుడు అది మొత్తం సభా వ్యవహారాలకు సంబంధం ఉన్నట్లు అవుతుంది. పార్లమెంటరీ హక్కులతో అవినీతిపరుల్ని రక్షించడం సరైన విధానం కాదు. లంచం దేని గురించి ఇచ్చారన్నది కాదు, లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం’ అని అన్నారు.

➡️