గత పదేళ్లలో మసకబారిన భారత ప్రతిష్ట!

న్యూఢిల్లీ : ”భారత్‌ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుంటే, యావత్‌ ప్రపంచం శ్రద్ధగా ఆలకిస్తుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ మొన్న మే నెలలో ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగలేదు ”భారత్‌ నిర్ణయాలు తీసుకుంటుంటే ప్రపంచం అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.” అని కూడా సెలవిచ్చారు.
20014, 2019 ఎన్నికల్లో బిజెపి అవినీతి, హిందూ జాతీయవాదం, దేశీయంగా, పాకిస్తాన్‌లో పుట్టుకొచ్చిన ఉగ్రవాదంపై బిజెపి ఫోకస్‌ పెట్టింది. విదేశాంగ విధానం ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా చోటు చేసుకోవడం మన విదేశాంగ విధాన చరిత్రలో ఇదే మొదటిసారి. మోడీ ప్రతి ప్రసంగంలోను భారత్‌ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మేటి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారత్‌ అయిదవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగిందీ, గత ఏడాది జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని భారత్‌ ఎంత బ్రహ్మాండంగా నిర్వహించిందీ టామ్‌టామ్‌ వేస్తూ ఇదంతా తన నాయకత్వ గొప్పతనమేనన్నట్లుగా చెప్పుకున్నారు. తమిళనాడులో సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఏనాడో పరిష్కారమైపోయిన శ్రీలంక కచతీవు దీవుల వివాదాన్ని ఆయన కెలికారు. జూన్‌4న వెలువడిన ఎన్నికల ఫలితాలు మోడీని నేలమీద నిలిచేలా చేశాయి. పార్లమెంటులో బిజెపికి మెజార్టీ లేకుండా చేస్తూ ఓటరు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చాడు. ప్రతిపక్షాలను ఒంటి చేతితో అణచివేస్తూ, తనకిక ఎదురే లేదని విర్రవీగిన మోడీ తోకను కత్తిరించేశాడు.. మిత్రులపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడిపే స్థితికి తెచ్చాడు. ఈ కొత్త డైనమిక్స్‌ వచ్చే అయిదేళ్లలో భారత విదేశాంగ విధాన దిశను నిర్దేశించడంలో కీలక భూమిక వహించనున్నాయి. మోడీ గత పదేళ్లలో విదేశాంగ విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలను మంత్రివర్గాన్ని సంప్రదించకుండా తనే తీసుకునేవాడు. అటువంటి కీలకమైన వాటిలో అక్టోబరు7న హమాస దాడి జరిగిన కొద్ది గంటలకే ఇజ్రాయిల్‌కు సంఘీభావం ప్రకటించడం, దీంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన విదేశాంగ శాఖ దానిని సరిదిద్దేందుకు బ్యాలెన్స్‌గా ప్రకటన చేయడానికి చాలా రోజులు పట్టింది.
గ్లోబల్‌ లీడర్‌గా భారత్‌ స్థానాన్ని పటిష్టపరచేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్విత సభ్యత్వ హోదా తన ప్రాధాన్యత అంశంగా భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐరాస సమావేశాల సందర్భంగా నిర్వహించే ‘భవిష్యత్తు కోసం సదస్సు’ ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలకు ఒక చారిత్రాత్మక అవకాశం. దీనిని ఈ కొత్త ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను చూస్తే అది అంత తేలికైన విషయమేమీ కాదు. అమెరికా చెంతన చేరి చైనా లక్ష్యంగా ఇండో పసిఫిక్‌ వ్యూహంలో కీలక పాత్రధారిగా మోడీ వ్యవహరించడం ద్వారా పొరుగున ఉన్న చైనాతో సఖ్యత చెడేందుకు అవకాశమిచ్చారు. భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వ హోడా రావాలంటే చైనా మద్దతు కూడా అవసరం. కాబట్టి మోడీ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుందో చూడాలి. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ నేతలు పలువురు మోడీకి అభినందనలు తెలియచేశారు. కానీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇంతవరకు మోడీని స్వయంగా అభినందించలేదు. చైనా తరపున విదేశాంగ శాఖ అభినందనలు తెలపడంతోనే సరిపెట్టింది. మోడీ హయాంలో చైనాతో సంబంధాలు అంత సవ్యంగా లేవనడానికి ఇదొక నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. చైనాతో సంక్లిష్టమైన సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించుకోవడంలో దౌత్యపరమైన కార్యకలాపాలు చాలా కీలకం. ఘర్షణలు పెచ్చరిల్లకుండా చూడాలంటే ఉద్రిక్తతలు, ప్రాదేశిక వివాదాల పట్ల ఆచితూచి వ్యవహరించాల్సి వుంది.
ఐటుయుటు (ఇండియా, శ్రీలంక, అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌, క్వాడ్‌ వంటి వేదికలు ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్య వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లే వేదికలుగా మారాయి. మరోవైపు కెనడాతో భారత్‌ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అలాగే పాకిస్తాన్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిమితమైన సంబంధాలు, కార్యకలాపాలు అనే ప్రస్తుత విధానాన్నే మోడీ సర్కార్‌ అవలంబించే అవకాశం వుంది.
సుదీర్ఘకాలం తర్వాత దేశంలో సంకీర్ణ రాజకీయాలు ఆరంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ విదేశాంగ విధాన దిశ బహుళ ధ్రువ ప్రపంచం వైపు ఉంటుందా? లేక అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఇప్పుడనుసరిస్తున్న వైఖరినే కొనసాగిస్తుందా అన్నది ప్రశ్న. మోడీ ఇంతకుముందులా ఏకపక్షంగా వ్యవహరించడం ఇక కష్టమే కావచ్చని ఐక్యరాజ్య సమితి మాజీ ప్రతినిధి ఇడి మాథ్యూ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

➡️