బిజెపికి ‘కోటక్‌’ నజరానా – రూ.60 కోట్ల విరాళం

  • కోటక్‌ మహింద్రా బ్యాంకుకు అనుకూలంగా వ్యవహరించిన ఆర్‌బిఐ
  • ఆ తర్వాత కాషాయం పార్టీ ఖాతాకు చేరిన సొమ్ము

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారి జాబితాలో అరుదుగా కన్పించిన పేరు ఉదరు కోటక్‌. దేశంలో మూడవ అతి పెద్ద ప్రయివేటు రంగ బ్యాంకైన కోటక్‌ మహింద్రాలో ఆయనకు వాటాలు ఉన్నాయి. అయితే తాను నిర్దేశించిన పరిమితికి మించి ఉదరుకి ఆ బ్యాంకులో వాటాలు ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం చివరికి 2018 డిసెంబరులో న్యాయస్థానం వరకూ వెళ్లింది. ఆర్‌బిఐకి వ్యతిరేకంగా కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఏమైందో ఏమో కానీ 13 నెలలు గడిచిన తర్వాత 2020 జనవరిలో ఆర్‌బిఐ వెనక్కి తగ్గింది. కోర్టు వెలుపల పరిష్కారం చేసుకుందామంటూ కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ చేసిన ప్రతిపాదనను అంగీకరించింది.
ఇదిలా ఉండగా ఈ వివాద పరిష్కారానికి కొన్ని నెలల ముందు ఈ గ్రూపు బిజెపికి రూ.35 కోట్ల విరాళం అందజేసింది. పరిష్కార ప్రకటన వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఇందులో రూ.10 కోట్లు బిజెపి పార్టీ ఖాతాలో చేరాయి. ఆ తరువాత కోటక్‌ గ్రూపునకు చెందిన ఇన్ఫినా ఫైనాన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2021 ఏప్రిల్‌లో బిజెపికి రూ.25 కోట్లు సమర్పించుకుంది. కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ ఎండీగా, సీఈఓగా ఉదరు కోటక్‌ మరో 32 నెలల పాటు పదవిలో కొనసాగేందుకు అనుమతిస్తూ ఆర్‌బిఐ మార్గదర్శకాలు జారీ చేసి మూడు వారాలు కూడా గడవక ముందే ఈ విరాళం బిజెపి జేబులో చేరింది. రేటింగ్‌ సంస్థ కేర్‌ రేటింగ్స్‌ ప్రకారం ఇన్ఫినా ఫైనాన్స్‌లో కోటక్‌ కుటుంబానికి 50.01 శాతం వాటాలు, ముంబయికి చెందిన కోటక్‌ మహింద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌కు 39.99 శాతం వాటాలు ఉన్నాయి. మహింద్రా క్యాపిటల్‌ కంపెనీ లిమిటెడ్‌లో ఉదరు కోటక్‌ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఇన్ఫినా ఫైనాన్స్‌ కొనుగోలు చేసిన మొత్తం రూ.60 కోట్ల బాండ్లు ఒకే పార్టీ…బిజెపి ఖాతాకే చేరడం గమనార్హం.

వివాదం ఏమిటి ?
ఏదైనా కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత 12 సంవత్సరాల వరకూ ప్రమోటర్లు అందులో 15%కి మించి వాటాలు కొనుగోలు చేయరాదని ఆర్‌బిఐ 2013 ఫిబ్రవరి 22న మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమోటర్‌ వాటాను 2017 జూన్‌ 30 లోగా 30%కి, 2018 డిసెంబర్‌ 31 లోగా 20%కి, 2020 మార్చి 31 లోగా 15%కి తగ్గించాలని ఆర్‌బీఐ తనకు సూచించిందని కోటక్‌ బ్యాంక్‌ తెలిపింది. 2017 మే 22న కోటక్‌ బ్యాంకులో తన వాటాను ఉదరు కోటక్‌ 29.79%కి తగ్గించారు. 2018 ఆగస్ట్‌ 2న ప్రమోటర్‌ వాటాను 30 శాతం నుండి 19.7 శాతానికి తగ్గించేందుకు కొత్త పద్ధతిని అనుసరించాలని కోటక్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. అయితే అందుకు ఆర్‌బిఐ అంగీకరించలేదు. దీనిపై కోటక్‌ బ్యాంక్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఇన్ఫినా ఫైనాన్స్‌ కంపెనీ రెండు దఫాలుగా బిజెపి ఖాతాలో రూ. 35 కోట్ల డిపాజిట్‌ చేసింది. కోటక్‌, ఆర్‌బీఐ 2020 జనవరి 29న కోర్టు వెలుపల పరిష్కారం కుదుర్చుకున్నాయి.

➡️