తుపానులో వర్షాభావం !

  • రాష్ట్రంలో వింత వాతావరణం
  • తుపాను తీరం దాటిన బాపట్లలో మూడు వర్షాభావ మండలాలు
  • ప్రకాశం, నెల్లూరు, తిరుపతి సహా చాలా చోట్ల ఇదే పరిస్థితి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రంలో వింత వాతావరణం నెలకొంది. మిచౌంగ్‌ తీవ్ర తుపాను సృష్టించిన బీభత్సానికి పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈదురుగాలులు, ఎడతెరిపిలేని భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లింది. కాగా ‘మిచౌంగ్‌’ తర్వాత సైతం రాష్ట్ర వ్యాప్తంగా 307 మండలాలు వర్షాభావంతో మగ్గుతున్నాయి. మరీ విచిత్రమేమంటే తుపాను తీరం దాటిన బాపట్ల జిల్లాలో మూడు మండలాల్లో లోటు వర్షం నమోదు కావడం. తుపాను ప్రభావంతో ఈ నెల 2 నుంచి 6 మధ్య ఎపిలోకెల్ల తిరుపతి జిల్లాలో అత్యధికంగా 67 సెంటీమీటర్ల వర్షం పడింది. కాగా ఆ జిల్లాలో ఒక మండలంలో ఇప్పుడు కూడా వర్షాభావం కొనసాగుతోంది. తుపాను ప్రభావం ఉన్న నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, ఎన్‌టిఆర్‌, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లిలో ఇంకా వర్షాభావ మండలాలున్నాయి. జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ 7 సాయంత్రం వరకు చూస్తే రాష్ట్రం సగటున సాంకేతికంగా సాధారణ వర్షం కేటగిరిలో ఉంది. మైనస్‌ 15.2 శాతం వర్షపు లోటులో ఉంది. 846.2 మిల్లీటర్లకుగాను 716.7 మిమీ నమోదైంది. జిల్లాలవారీగా శ్రీకాకుళం, విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య.. 12 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా నార్మల్‌ కేటగిరిలో ఉన్న జిల్లాల్లో వర్షాభావ మండలాలున్నాయి. కృష్ణా, గుంటూరు తప్ప మిగిలిన జిల్లాల్లో ఒకటో రెండో తక్కువ వర్షం కురిసిన మండలాలున్నాయి. మిచౌంగ్‌ తుపాను ప్రభావిత జిల్లాల్లో సైతం వర్షాభావ మండలాలుండటం విశేషం. శ్రీకాకుళం 16, విజయనగరం 3, మన్యం 3, అల్లూరి 2, విశాఖ 6, అనకాపల్లి 8, కాకినాడ 13, కోనసీమ 16, తూర్పుగోదావరి 6, పశ్చిమగోదావరి 13, ఏలూరు 5, ఎన్‌టిఆర్‌ 6, బాపట్ల 3, ప్రకాశం 29, పల్నాడు 8, నెల్లూరు 20, కర్నూలు 24, నంద్యాల 23, అనంతపురం 24, శ్రీసత్యసాయి 25, కడప 28, అన్నమయ్య జిల్లాలో 22 వర్షాభావ మండలాలున్నాయి. రాయలసీమలో ఆరు, కోస్తాలో ఒక జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు 103 కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. కరువును గుర్తించిన మండలాల్లో పంట నష్టం అంచనాలు పూర్తయ్యాయి. కేంద్ర బృందాలు పర్యటిస్తాయన్నారు. ఈ లోగా తుపానొచ్చింది. దాంతో కరువు మండలాల్లో కేంద్ర బృందాల పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు.

➡️