Oil palm రైతు కుదేలు

  • కేంద్రం దిగుమతి సుంకం రద్దుతో ధరలు తిరోగమనం
  • ప్రస్తుతం టన్ను ధర రూ.13,180కు పతనం
  • గతేడాది ఇదే సమయంలో రూ.18 వేలు పలికిన ధర

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : ఆయిల్‌పామ్‌ సాగు నష్టాల బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. వంట నూనెలు ఉత్పత్తి చేస్తున్న సంస్థలు ఇతర దేశాల నుంచి ఆయిల్‌పామ్‌ను దిగుమతి చేసుకుంటుండడంతో ధరలు నేలచూపు చూస్తున్నాయి. 2022లో ఆయిల్‌పామ్‌ గెలలు టన్నుకు గరిష్టంగా రూ.26,365 ధర లభించింది. 2023 జూన్‌లో 18,100 ధర వచ్చింది. తాజాగా టన్ను ధర రూ.13,180కు పడిపోయింది. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు నష్టపోతామని సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 40,826 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది. అత్యధికంగా నల్లజర్లలో 10,490 ఎకరాల్లో, అత్యల్పంగా కడియం మండలంలో మూడు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా ధరలు తిరోగమనంలో ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టన్నుకు రూ.20 వేలు ఇప్పించాలని కోరుతున్నారు.

గతంలో లాభాల బాట
జిల్లాలో పండిన ఆయిల్‌పామ్‌ గెలలను గానుగ ఆడించి, ముడి ఆయిల్‌ను పెద్దాపురం, నల్లజర్లలోని మిల్లులకు తరలిస్తుంటారు. ఆయా మిల్లుల్లో ప్రతి నెలా సగటు ముడి చమురు నిష్పత్తి (ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో-ఒఇఆర్‌) ఆధారంగా అధికారులు, వ్యాపారుల కమిటీ ఆయిల్‌పామ్‌ గెలలకు ధర నిర్ణయిస్తుంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంతో ఆ దేశాల నుంచి క్రూడ్‌ పామాయిల్‌ (సిపిఒ) దిగుమతి నిలిచిపోయింది. దేశీయంగా వంట నూనెలను ఉత్పత్తి చేసే కంపెనీలకు ముడిసరకు కొరత ఏర్పడింది. దేశీయ రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ గెలలను ఆయా కంపెనీలు పోటీ పడి కొనుగోలు చేశాయి. 2022 మార్చిలో టన్నుకు రూ.21,940, ఏప్రిల్‌లో రూ.22,518, మేలో రూ.23,365, జూన్‌లో రూ.26 వేల వరకూ ధర పలికింది.

కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని రద్దు చేయడంతో గడిచిన రెండేళ్లగా ఆయిల్‌పామ్‌ ధరపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2020 సెప్టెంబరులో టన్ను ధర రూ.10,112 ఉంది. ఆ తర్వాత ధర క్రమేపీ పెరిగింది. 2021 జనవరిలో రూ.15,500, జూన్‌లో రూ.16,828 ధర లభించింది. 2022 చివరిలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతిపై సుంకాన్ని 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. తిరిగి కొన్ని నెలల వ్యవధిలోనే దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తేసింది. దీంతో, ఆయిల్‌ కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో, దేశీయ మార్కెట్‌లో ఆయిల్‌పామ్‌ ధరలు పతనం అవుతున్నాయి.

టన్నుకు కనీసం రూ20 వేలు ఇవ్వాలి : పాతూరి సత్యనారాయణ, పామాయిల్‌ రైతు, అచ్చెన్నపాలెం, నల్లజర్ల మండలం
ఆయిల్‌పామ్‌ సాగు గతేడాది వరకూ ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. టన్ను రూ.13,180 మించి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎరువుల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు ఘననీయంగా పెరిగాయి. ఎకరా విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ సాగుకు రూ.75 వేల వరకూ ఖర్చవుతోంది. ఓ వైపు దిగుబడి తగ్గిపోవడం, మరోవైపు ధర లేకపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి అందట్లేదు. టన్నుకు కనీసం రూ.20 వేలు చెల్లిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది.

➡️