కొండెక్కిన గుడ్డు!

May 18,2024 09:59 #Boiled egg!, #increased, #rates

-రిటైల్‌ ధర రూ.7
-రైతుకు లభిస్తున్నది ధర రూ.5
-కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో పెరిగిన డిమాండ్‌
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :గుడ్డు ధర కొండెక్కింది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో రూ.7కు విక్రయం జరుగుతోంది. ప్రస్తుతం ధర పెరిగినప్పటికీ రైతుల నుంచి ఐదు రూపాయలకే మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రెండేళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో ఉండడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. దీంతో, ఉత్పత్తి తగ్గిపోయింది. డిమాండ్‌ పెరగడంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో కోడిగుడ్డు ధర రూ.6 ఉండేది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయం తర్వాత పెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ ఉంది. సుమారు 300 పౌల్ట్రీలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం జరుగుతుంది. రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 40 శాతం మేర గుడ్లు స్థానిక మార్కెట్లలో వినియోగిస్తుండగా 60 శాతం గుడ్లు ఒడిశా, బీహార్‌ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. కోళ్లకు వినియోగించే మేత, దాణా ఖర్చులు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి. మొక్కజన్న, సోయా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజన్న దాణా టన్నుకు ఏడాదిలో రూ.18 వేల నుంచి రూ.25 వేలు, సోయా రూ.50 వేల నుంచి రూ.80 వేలకు పెరిగింది. గుడ్లు పెట్టే కోళ్లు ఆరు నెలల పెంపకం అనంతరం గుడ్డు పెట్టడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత ఆరు నెలల అనంతరం ఆ కోళ్లను విక్రయిస్తుంటారు. ఏడాది అనంతరం కొత్త బ్యాచ్‌లు వేయడం పరిపాటి. నష్టాలు వస్తుండడంతో ఈ ఏడాది జనవరిలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవటం, గతేడాది వేసిన బ్యాచ్‌లను మే నెలలో కోతకు తరలించడంతో గుడ్లు పెట్టే కోళ్ల కొరత నెలకొంది. నల్లజర్ల మండలంలో గతంలో సుమారు పది లక్షల కోళ్లు ఉండేవి. ప్రస్తుతం ఆరు లక్షలకు మించి లేవు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో, కోడిగుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గడంతో ధరలు పెరిగాయి. కొత్త బ్యాచ్‌లు వేయకపోవడానికి నష్టాలే కారణమని రైతులు చెబుతున్నారు. 2019కి పూర్వం దాణా రేటు తక్కువగా ఉండడంతో ఖర్చు తగ్గి రైతులు లాభాలు పొందారు. గడిచిన నాలుగేళ్లలో దాణా, ఇతర ఖర్చులు రెండింతలు పెరగడంతో నష్టాలు చవిచూస్తున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి గుడ్డు ఎగుమతులు జరిగే పశ్చిమ బెంగాల్‌, యుపి, కోల్‌కత్తా వంటి రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు పౌల్ట్రీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాయి. సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి పెరిగింది. దీంతో, కొన్నిసార్లు ఎగుమతులు తగ్గి స్థానిక మార్కెట్‌పైనే ఆధార పడాల్సి వస్తోంది.
రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు
మేలో ఎండలు ఎక్కువగా ఉండడంతో కొత్త బ్యాచ్‌లు వేయలేదు, పాత బ్యాచ్‌లు తీసేయడంతో డిమాండ్‌ నెలకొంది. వ్యాపారులు గుడ్డు రూ.5 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మేత ధరలు, విద్యుత్‌ బిల్లుల పెట్టుబడి ఖర్చు కారణంగా ఉత్పత్తి ఖర్చు రూ.5కు చేరింది. కోడిగుడ్డుకు నికరంగా రూ.6 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుంది. లేకపోతే నష్టపోవాల్సి వస్తోంది.
ా జె.వెంకటరత్నం పౌల్ట్రీ రైతు, నల్లజర్ల
విద్యుత్‌ సబ్సిడీ కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగానికి ఇచ్చినట్లుగానే పౌల్ట్రీ రంగానికీ విద్యుత్‌ సబ్సిడీ కల్పించాలి. కోళ్ల పరిశ్రమ పెద్ద తరహా పరిశ్రమ కిందకు రాదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలి. విద్యుత్‌ సంస్థ నుంచి రాయితీ అమలు చేస్తే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదా అయి రైతులకు కొంతమేర ఊరట లభిస్తుంది. మేత, దాణా సబ్సిడీ అందించి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలి.
ాకెవి.ముకుందరెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు

➡️