బరులు సిద్ధం !

Jan 14,2024 09:16 #Sankranti festival
  • టెంట్‌లు సహా భారీగా ఏర్పాట్లు
  • ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా పందాలు, జూదం

ప్రజాశక్తి- యంత్రాంగం : సంక్రాంతి నేపథ్యంలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి. నిర్వాహకులు భారీ ఏర్పాట్లలో నిమగమయ్యారు. పెద్ద బరుల వద్ద రాత్రీ పగలు నిరంతరాయంగా పందాలు సాగించేందుకు ఫ్లడ్‌లైట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. బరుల ఏర్పాటులో కొందరు అధికార పార్టీ నాయకులు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కొన్నిచోట్ల టిడిపి నాయకుల పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల పోలీసుల సమక్షంలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏటా అధికారులు హెచ్చరిస్తుండడం, అయినా అవి ఆగకపోవడం, వందల కోట్ల రూపాయలు చేతులు మారుతుండడం ఏటా షరా మామూలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు ప్రారంభమయ్యాయి. పెద్ద బరులకు రూ.లక్ష, ఓ మోస్తరు బరికి రూ.70 వేలు, మిగిలిన వాటికి బరుల ప్రాతిపదికన ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. బరులు, పందెం శిబిరాల వద్ద మూడు రోజులపాటు గుండాట, పేకాట, మద్యం, బెల్టు షాపులు, సారా విక్రయాలు, మాంసాహారం ఏర్పాటుకు ఇప్పటికే వేలం పాటలు జరిగినట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల్లో పోలీసు అధికారులంతా బదిలీలు కానున్నారు. మామూళ్ల కోసం కొందరు పోలీసు అధికారులే కబుర్లు పంపించి కోడి పందేలు నిర్వహించుకోండంటూ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలు వద్ద కృష్ణా నది కరకట్ట దిగువన శనివారం కోడి పందెలు నిర్వహించారు. మచిలీపట్నం మండలం పెదపట్నంలో 15 రోజులుగా పేకాట శిబిరం సాగుతోంది. ఏలూరు జిల్లాలోని కైకలూరు, కలిదిండి, మండవల్లి, భీమవరం తదితర ప్రాంతాల నుంచి జూదరులు శిబిరానికి వస్తున్నారు. రోజుకు రూ.25 లక్షలకుపైగా చేతులు మారుతున్నాయి. ఓ పోలీసు అధికారికి రోజుకు రూ.50 వేలు మామూళ్లు ఇచ్చి ఈ శిబిరాన్ని కొనసాగిస్తున్నారని చర్చ జరుగుతోంది. మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల్లో కోడి పందాలకు బరులు సిద్ధం చేస్తున్నారు. గూడూరులో పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని స్మశాన వాటికలో పిచ్చిమొక్కలు తొలగించి బరిని సిద్దం చేశారు. కంకిపాడు ఫ్లైఓవర్‌ వద్ద, ఈడుపుగల్లు, గొడవర్రు గ్రామాల్లో, పెనమలూరు మండలం యనమలకుదురు లాకు సెంటర్‌, చల్లపల్లి న్యూ బైపాస్‌ రోడ్డు వద్ద బరులు సిద్దం చేస్తున్నారు. గుడివాడలో ఎడ్ల బలప్రదర్శన సాగుతున్న ప్రాంతంలో కోడి పందెలకు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరం, సీసలి, ఆకివీడు మండలం కుప్పనపూడి, పాలకొల్లు మండలం పూలపల్లి, యలమంచిలి మండలం కలగంపూడి, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధమవుతున్నాయి. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు, నారాయణపురం, బాదంపూడి, భీమడోలు మండలంలో గుండుగొలను, ఆగడాలలంక, పెదవేగి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పందాల నిర్వహణకు సమాయత్తమ య్యారు. ప్రతి మండలంలోనూ పది వరకూ బరులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో 400కు పైగా బరుల్లో కోడిపందేలు సాగనున్నాయని సమాచారం. భీమవరంతోపాటు ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు వంటి పట్టణాల్లో హోటల్‌ రూములు నిండిపోయాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గత ఏడాది దాదాపు రూ.250 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, రాజోలు, మలికిపురం, పి.గన్నవరం, మామిడికుదురు, కొత్తపేట, ఉప్పలగుప్తం, కపిలేశ్వరపురం, కాకినాడ జిల్లా పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, తొండంగి, తూర్పు గోదావరి జిల్లా సీతానగరం, రాజానగరం తదితర మండలాల్లో కోడి పందేలు, జూదాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు రూ.400 కోట్లకుపైగా చేతులు మారగా, ఈసారి రూ.500 కోట్లపైనే చేతులు మారే అవకాశం ఉందని అంచనా. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో కోడి పందాలకు గుంటూరు, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణ నుంచి భారీగా జూదరులు వస్తారని చెబుతున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పందెం కోళ్ల పెంపకం కేంద్రాలు దాదాపు వందకు పైనే ఉన్నాయి. ఒక్కొక్క ఫారంలో 100 నుండి 150 కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండడంతో నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల కోళ్లకుపైనే పందాలకు సిద్ధం చేసినట్లు సమాచారం.

కోడి పందాలు జరగడానికి వీల్లేదు : తేల్చి చెప్పిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పిలు తగిన చర్యలు తీసుకో వాలని తీర్పు చెప్పింది. జంతు నిరోధక, జూద నిరోధక చట్టాలను అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను పట్టించుకోకపోతే, చర్యలు తీసుకోని సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి తీరాలని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు జరక్కుండా పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందిన హనుమ అయ్యప్ప దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారణ జరిపింది. కోడి పందేల బరులను ఏర్పాటు దశలోనే అడ్డుకో వాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

➡️