ఇంత పచ్చి అబద్దమా!!

president murmu addresses parliament on bjp govt false propaganda

అప్పుడే పార్లమెంటు సభ ప్రారంభమైంది. టీవీ ఆన్‌ చేశాను. రాష్ట్రపతి మాట్లాడుతున్నారు. ”పేదవారికి సైతం విమాన ప్రయాణం కలిగించాము” అన్న మాటలు మొదటిగా నాకు వినిపించాయి. ఒక రాష్ట్రపతి ఎంత పెద్ద అబద్దం మాట్లాడారు? ఈ మాటలకు ప్రధాని మోడీ, హోం మంత్రి షా, మిగిలినవారు బల్లలు గుద్ది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద అబద్దానికి అంత పెద్దగా చప్పట్లా! ఈ ఒక్క వాక్యం చాలు పాలకులు ఎంతగా ప్రజలను మోసం చేస్తున్నారో చెప్పటానికి. నేను ఇంతవరకు విమానాన్ని దగ్గరగా చూడలేదు. హైదరాబాద్‌ లోనో, మద్రాసు లోనో బస్సులో నుండి తాంబరం విమానాశ్రమం కనపడితే, అదిగో విమానం అనుకోవటం తప్ప దగ్గరగా ఇంతవరకు చూడలేదు. చిన్నపుడు ఆకాశంలో విమానం పోతుంటే అదిగో విమానం అనుకునేవాళ్ళం. ఎందుకనో ఈ మధ్య అలా విమానాలు కనపడటం లేదు. అలాంటిది పేదవాడికి విమాన ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పటం పెద్ద జోక్‌, అబద్దం. ఇంకొకటి రామమందిర నిర్మాణం కూడా రాష్ట్రపతి ప్రసంగంలో వచ్చింది. మసీదు పడగొట్టి రామ మందిరం కట్టడం దేశ అభివృద్ధిలో భాగమా! అయోధ్య తీర్పు ఇచ్చినవారికి రిటైర్‌ అయిన తరువాత వారికి ఒకరికి రాజ్యసభ సీటు, ఇంకొకరికి గవర్నరు పోస్టు ఇంక మిగిలినవారికి ఏమి ఇచ్చిందీ కూడా చెప్తే బాగుండేది!! దేశం ఇంతగా అభివృద్ధి చెందితే సీినియర్‌ సిటిజన్లకి రైల్వే చార్జీలో రాయితీ ఎందుకు తీసేసినట్లు? అభివృద్ధి అనేది పేరుకు మాత్రమే! పేదవాడు పేదవాడుగానే, ఇంకా పేదవాడిగా మారిపోతున్నాడు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెడుతోంది ప్రభుత్వం. టెలికం శాఖలు, రైల్వే ఇన్సూరెన్స్‌, బ్యాంకులు, రోడ్లు, నౌకాయానాలు, పోర్టులు ప్రతిదాన్ని ప్రవేట్‌ చేస్తున్నది ప్రభుత్వం. మరి అభివృద్ధి అంటే ఇదేనా! శాస్త్రీయ అలోచన పెంచాల్సిన సైన్సు కాంగ్రెసు సభలు నాన్‌ సైన్సు సభలాగా తయారు చేస్తున్నది ప్రభుత్వం. పద్మశ్రీలు వాడిపోతున్నాయి. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే విధంగా పాలన ఉంటే దేశం అభివృద్ధి పథంలో పోతుందనుకోవటం, బల్లలు విరిగిపోయేలా చప్పట్లు కొట్టుకోవటం సరికాదు.

– నార్నె వెంకట సుబ్బయ్య

➡️