పూటకో మాట !

Feb 11,2024 08:34 #special story
  • విశాఖ రైల్వే జోన్‌పై బిజెపి కుంటిసాకులు
  • కేటాయించిన స్థలం అనువుగా లేదని తాజాగా మరో అబద్ధం
  • జోన్‌ నిధుల మళ్లింపులో కేంద్రం : రైల్వే ఉన్నతాధికారులు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు చేసే విషయంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పూటకో మాట మారుస్తున్నాయి. రైల్వేజోన్‌ నిర్మాణాన్ని మరింత వెనక్కినెట్టే కుయుక్తులు పన్నుతున్నాయి. రూ.160 కోట్ల డిపిఆర్‌ నిధులను ఎగ్గొట్టేందుకే ఈ నాటకా లంటూ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయ ఉన్నతాధికారులు కేంద్రంపై పరోక్షంగా మండిపడు తున్నారు. ఈ నెల తొమ్మిదిన పార్లమెంట్‌సభ్యులు కొంతమంది విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఎందుకు ఆలస్యమవుతుందనే ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బదులిస్తూ ‘రైల్వే జోన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 52 ఎకరాల భూమి ఇచ్చింది. అయితే అది ఒక చెరువు బ్యాక్‌ వాటర్‌లో ఉంది. ముంపు ప్రాంతం కాబట్టి కార్యాలయ నిర్మాణానికి అనువైంది కాదు. అనువైన భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరాం’ అని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ప్రస్తుతం విశాఖలో చర్చ నడుస్తోంది. 2014లో విశాఖలో జరిగిన ఎన్నికల సభలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీపై పూటకోమాట, రోజుకో నాటకమాడుతూ రాష్ట్ర ప్రజలను బిజెపి సర్కారు నయవంచనకు గురిచేయడంపై వాల్తేరు రైల్వేజోన్‌ ఉన్నతాధికారుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఇదే కేంద్ర మంత్రి వైష్ణవ్‌ పార్లమెంట్‌ లో మాట్లాడుతూ.. అసలు భూమి ఇంతవరకే తమకు అప్పగించలేదని, అక్కడ వివాదం ఉందని చెప్పగానే ఎపి ప్రభుత్వం, విశాఖ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తక్షణం స్పందిస్తూ ఏనాడో భూమి చూపించామని, జాయింట్‌ సర్వేకు రైల్వే వాళ్లు రావడం లేదని బదులిచ్చారు. దీంతో తాజాగా మరో అబద్ధం ఆడేందుకు రైల్వే మంత్రి దిగారని శుక్రవారం నాటి ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

అసలు డిపిఆర్‌ను కేంద్రం ఆమోదించిందా ? : రైల్వే ఉన్నతాధికారులు

                     అసలు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌కు రూ.160 కోట్ల డిపిఆర్‌ను ఎందుకు ఇంతవరకూ ఆమోదించలేదో చెప్పాలని రైల్వే ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అటు ముడసర్లోవలో 52 ఎకరాలు, ఇటువైపు రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం వెనుకభాగం వైర్‌లెస్‌ కాలనీలో 18 ఎకరాలు.. ఈ రెండు చోట్ల డిపిఆర్‌లో ఆమోదించబడిన భూమి రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయానికి సిద్ధంగా ఉందని ‘రైల్వే ల్యాండ్‌ విభాగం’ ఉన్నతాధికారులు శనివారం తెలిపారు. కేంద్రం జాప్యం వెనుక త్వరలో జరిగే ఎన్నికలకు ఆ నిధులను తమకు అవసరమైన చోటకు మళ్లించేందుకు జరుగుతున్న కుట్రగా పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే అత్యంత అధికమైన రెవెన్యూ రూ.8500 కోట్లు తెచ్చిపెట్టిన వాల్తేరు రైల్వే డివిజన్‌ను 2014లో అధికారంలో కొచ్చిన బిజెపి ఏడాదిలోనే ఎత్తేసి ద్రోహం చేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందంటూ మండిపడుతున్నారు. కేవలం రూ.160 కోట్ల డిపిఆర్‌కు ఆమోదం తెలపడం లేదని, ఆ నిధులు వస్తేనే జోన్‌ పనులు, కేంద్రం ప్రకటించిన నూతన రాయగడ డివిజన్‌ పనులైనా ప్రారంభం అవుతాయని వీరంతా చెబుతున్నారు.

➡️