రేషన్‌… పరేషాన్‌

Jun 21,2024 00:13 #Ration, #The prices
  • మొక్కుబడిగా మారిన ప్రజాపంపిణీ వ్యవస్థ
  • భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు
  • కొనలేక ఇబ్బంది పడుతున్న పేదలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ డిపోల ద్వారా అందిస్తున్న నత్యావసరాలు తమకు ఏ మాత్రం ఊరట నివ్వటం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బియ్యం, పంచదార అందజేసి మొక్కుబడిగా పాలక ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కిరాణా షాపుకెళ్లి ఏ సరుకు ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు సరుకులు కొనేందుకు ఇబ్బందిపడుతున్నారు. ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరగడం, మరోపైపు వంటింటి సామాన్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజలు పస్తులుండే దుస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ డిపోల ద్వారా 11 రకాల నిత్యావసరాలను పాలక ప్రభుత్వాలు అందించేవి. గత ప్రభుత్వం బియ్యం, పంచదారకే పరిమితం అయ్యింది. నూతన ప్రభుత్వం సైతం ఈ మూడు రకాలే పంపిణీ చేసేందుక సమాయత్తం అవుతోంది. అయితే ప్రతి నెలా పదో తేదీ దాటిన తర్వాత అత్యధిక మందికి డీలర్లు బియ్యం మాత్రమే అందిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ విమర్శలను అధిగమపించి రేషన్‌ డిపోల 11 రకాలనిత్యావసరాలు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

నాడు 11 రకాల నిత్యావసరాలు అందజేత
రోజు వారీ జీవితంలో బియ్యంతో పాటు పప్పు, గోధుమ పిండి, పసుపు, కారంపొడి, చింతపండు, వంటనూనె వంటివి కూడా నిత్యావసర వస్తువులే. గతంలో బియ్యంతో పాటు గోధుమలు, నూనె, చింతపండు, పప్పులు, పంచదార, ఉప్పు, పసుపు, కారంపొడి, కిరోసిన్‌ వంటి తొమ్మిది సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేశారు. కాని ప్రస్తుత బిజెపి ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికింది. కిలో చక్కెర ధర బయట మార్కెట్‌లో రూ.40 పలుకుతోంది. పామాయిల్‌ లీటరు రూ.160కి చేరింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అయితే రూ.180 పలుకుతోంది. గోధుమ పిండి రూ.67, కంది పప్పు రూ.130, చింతపండు రూ.120,ఉప్పు కిలో ప్యాకెట్‌ రూ.15 పలుకుతోంది. ఇలా అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వమే ఛౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తే పేద ప్రజలకు కొంతమేలు జరిగే అవకాశం ఉంటుందనే ఆశాభావం కార్డుదారులలో వ్యక్తమవుతోంది. అదేవిధంగాపెరిగిన ధరలకు కళ్లెం వేయాలనే డిమాండ్‌ ముందుకొస్తుంది.

తూర్పుగోదావరి జిల్లాలో 3 లక్షల రేషన్‌ కార్డులు
తూర్పుగోదావరి జిల్లాలోని 3 లక్షల రేషన్‌ కార్డులున్నట్లు సమాచారం. తెల్ల రేషన్‌ కార్డులు,అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా కుటుంబ సభ్యుల జాబితా (కార్డులో) ఆధారంగా ఒకొక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యం పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ జరుగుతోంది. కరోనా వ్యాపించి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనటంతో ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ సరుకులు అందజేయాలనే డిమాండ్‌ ముందుకొచ్చిన విషయం విధితమే. ఈక్రమంలో కొన్ని నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు అదనంగా కలిపి ఒక వ్యక్తికి 10కేజీల చొప్పున పంపిణీ చేసింది. ఆచరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా కొన్ని నెలలు పంపిణీ నోచుకోలేదు. ప్రస్తుతం ఉచిత బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.ప్రతి నెలా చక్కెర, కందిపప్పు వంటివి పదో తేదీ దాటిన తర్వాత స్టాకు లేవంటూ పంపిణీ సిబ్బంది తేల్చిచెబుతున్నారు. ధరలు ఆకాశాన్నంటుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

➡️