‘అద్దె’ కట్టని సచివాలయం

Mar 1,2024 11:15 #Secretariat

 సిఆర్‌డిఏకు రూ. 200 కోట్లపైనే బకాయి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి

సిఆర్‌డిఎకు రాష్ట్ర సచివాలయం భారీగా అద్దె బకాయిలను చెల్లించాల్సి ఉంది. వందల కోట్ల రూపాయల ఉన్న ఈ బకాయిల వసూలు కోసం సిఆర్‌డిఎ అధికారులు లేఖలుమీద లేఖలు రాసినా, సచివాలయం చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదు.  దీంతో దిక్కుతోచని స్థితిలో వారు పడిపోయారు.  ప్రతి నెలా లేఖలు రాస్తున్నామని సిఆర్‌డిఎ అధికారులు చెబుతున్నారు. అద్దెతో పాటు సచివాలయంలో నిర్వహణ, పచ్చదనం అభివృద్ధి వంటి వాటికి కూడా నిధులు ఇవ్వడం లేదని సమాచారం. వెలగపూడిలో సిఆర్‌డిఏ అధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని తాత్కాలిక సచివాలయంగా వాడుకోవాలని టిడిపి ప్రభుత్వ హయంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఐదు పెద్ద భవనాలను సిఆర్‌డిఎ నిర్మించగా, వాటిల్లో ఒక దానిని రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి కేటాయించారు. ఇప్పటికీ ఈ భవనాలు క్రిడా  ఆధీనంలోనే ఉన్నాయి. ఈ ఆరు భవనాలను సాధారణ పరిపాలన శాఖకు లీజు పద్ధతిపై ఇస్తూ గతంలోనే ఒప్పందం కూడా జరిగింది. తీసుకున్న రుణాలపై 112 కోట్ల రూపాయలను నెల వారీ వడ్డీల కోసం చెల్లించాల్సి ఉంది. అలాగే హడ్కో నుంచి తీసుకున్న రుణాలకోసం 117 కోట్లు, అమరావతి బ్యాండ్ల త్రైమాసిక చెల్లింపులకు 580 కోట్లు, కోర్టు కేసులకు చెల్లించాల్సినది ఐదు కోట్లు కలిపి మొత్తం 815 కోట్లు కావాల్సి ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో 244 కోట్లు మాత్రమే అరదుబాటులో ఉరడగా, ఇంకా 570 కోట్ల వరకు నిధులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని సిఆర్‌డి అధికారులు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే సచివాలయ భవనాల అద్దె ద్వారా రావాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా రావాల్సిన నిధులు దాదాపు రెరడు వంద కోట్ల వరకు ఉరటాయని ఒక క్రిడా అధికారి వెల్లడించారు. ఇవి కాకుండా గ్రీనరీ, నిర్వహణ వ్యయానికి ఏటా 15 కోట్ల వరకు ఖర్చు అవుతోందని, ఈ మొత్తంలో కూడా భారీగా బకాయిలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేనట్టే

సిఆర్‌డిఎకు సంస్థకు ఒక ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌ ఉంటారు. అతనిపై మున్సిపల్‌ శాఖకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, అతనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. దీంతో కేవలం నిధులను కోరడమే తప్ప గట్టిగా అడిగే అవకాశాలు లేవని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అరదుకే ఏళ్ల తరబడి లీజు నిధులు రావడం లేదని కూడా పేర్కొన్నారు.

➡️