వేతనాల పెంపులో స్తబ్దత..!

Dec 15,2023 21:30 #Business

హెచ్చు ద్రవ్యోల్బణం..పెరుగుతోన్న అప్పుల భారం

పడిపోతున్న పొదుపు

ఆందోళనలో ఉద్యోగ, కార్మికులు

న్యూఢిల్లీ : వేతనాల్లో పెద్ద పెంపు లేకపోవడంతో అధిక ధరలతో ప్రజల బ్రతుకుదెరువు భారం అవుతోంది. హెచ్చు ద్రవ్యోల్బణంతో పొదుపు పడిపోవడంతో భవిష్యత్తుపై ఉద్యోగ, కార్మికుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎకనామిక్స్‌ టైమ్స్‌ కథనం ప్రకారం.. రెండు విభిన్న పరిశ్రమలకు చెందిన స్నేహ, సురభిలు ఒకే రకమైన అధిక ధరల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకరేమో తయారీ రంగంలో పనిచేస్తుండగా, మరోకరేమో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. ఒకరేమో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో రుణాలు తీసుకుంటున్నారు. మరొకరేమో విచక్షణారహితంగా చేస్తున్న ఖర్చు కారణంగా అప్పుల పాలవుతున్నారు. 36 ఏళ్ల స్నేహ ఆటోమేషన్‌ సంస్థలో మార్కెటింగ్‌ డివిజన్‌లో పనిచేస్తున్నారు. 2022 ఆగస్టులో ముంబయి నుండి పూణేకు వచ్చారు. పెద్ద ఫ్లాట్‌లో జీవించాలన్నది ఆమె కల అయినప్పటికీ.. అద్దె విషయమై ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడడం లేదు. స్నేహ ఇంటి నుండే పనిచేస్తున్నారు. ముంబయిలో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మరింత ఎక్కువగా ఆదా చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే.. తన ఖర్చులు పెరుగుతునే ఉన్నాయి. ఆమె ఆదాయం అలాగే ఎదుగుదల లేకుండా స్తంభించిపోయింది. ”ఆహారం నుండి రోజువారీ సరుకుల వరకు ప్రతీదీ భారం అవుతోంది. జనవరిలో 9శాతం వేతను పెంపును మా కంపెనీ ప్రకటించింది. ఇది ఆరు నెలల తర్వాత అమల్లోకి వచ్చినప్పటికీ.. పెరుగుతున్న ధరలకు సద్దుబాటు చేస్తే.. ఆ వేతన పెంపు అనేది ఎలాంటి తేడా లేకుండా పోయింది.” అని స్నేహా పేర్కొన్నారు. రిటైల్‌ రుణాల ప్రమాద ఘంటికలుగడిచిన 2022ా23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు మొత్తాలు గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా జిడిపిలో 5.1శాతానికి పడిపోయింది. మరోవైపు రిటైల్‌ రుణాలు చాలా తీవ్రంగా పెరిగాయి. బ్యాంకుల, ఎన్‌బిఎఫ్‌సిల రిటైల్‌ రుణాలు గత ఆరేళ్ళలో దాదాపు మూడు రెట్లు ఎగిసి 2023 మార్చి చివరి నాటికి రూ.51.7లక్షల కోట్లకు చేరాయి. ఇది మొత్తం బ్యాంకు రుణాల్లో 30శాతంగా ఉండటం ఆందోళనకర అంశం. 2018 నుంచి 73% పెరిగిన వ్యయాలు2018ా2023 మధ్య నిఫ్టీ 500 కంపెనీలు ప్రకటించిన వేతన పెంపునకు.. ఎగిసిన ద్రవ్యోల్బణానికి సంబంధం లేకుండా ఉంది. ముఖ్యంగా తయారీ రంగంలోని కంపెనీల్లో వేతన వ్యయాలు తగ్గాయి. కాగా.. ఐటి కంపెనీల్లో మాత్రం కొంత మెరుగ్గా ఉన్నాయి. 2018 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం 3.6శాతం నుండి 6.7శాతానికి పెరిగి.. దాదాపు రెట్టింపు అయ్యింది. అదే సమయంలో నిఫ్టీలోని 500 కంపెనీల ఉద్యోగుల వ్యయాలు మాత్రం 73శాతం పెరిగాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆయా కుటుంబాలకు మంచిది కాదు. మరోవైపు అమెరికా గణంకాలను పరిశీలిస్తే ఆ దేశంలో ద్రవ్యోల్బణం 3.2 శాతం పెరిగితే.. వేతనాల్లో 5.2 శాతం పెరుగుదల ఉంది. నువామా వెల్త్‌ ప్రకారం.. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన సెప్టెంబరు త్రైమాసికంలో బిఎస్‌ఇ 500 కంపెనీల వేతన వ్యయాలు 11 శాతం మందగించాయి. ఇది దశాబ్ద కాలంలోనే చాలా కనిష్టస్థాయి. 80 శాతం కొనుగోళ్లు ఇఎంఐల్లోనే..”నా కంపెనీ జనవరిలో 9% పెంపును ప్రకటించింది కానీ జీతంలో అసలు పెరుగుదల ఆరు నెలల తర్వాత వచ్చింది. వాస్తవ ధరల పెంపునకు ఇది ఎటూ సరిపోదు.” అని సురభి పేర్కొన్నారు. ప్రయివేటు రంగ సంస్థలు వేతనాల్లో ఒక్క అంకె శాతం పెంపును ప్రకటిస్తున్నాయి. ఇది వినిమయాన్ని దెబ్బతీస్తుంది. 2022 ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 7.8 శాతం ఎగిసింది. ఆర్‌బిఐ గణంకాల ప్రకారం.. గడిచిన నవంబర్‌లో గృహోపకరణాల కొనుగోళ్లలో 80 శాతం కూడా నెలవారి వాయిదా (ఇఎంఐ) పద్దతుల్లోనే జరిగాయి. అవసరాలను తీర్చుకోవడానికి మరో అప్షన్‌ లేక గడిచిన రెండేళ్లుగా తన క్రెడిట్‌ కార్డుపై కొనుగోళ్లు పెరిగాయని.. వాటిని వాయిదా పద్దతుల్లోకి మార్చుకుంటున్నానని స్నేహా పేర్కొన్నారు. ఇటీవల రూ.50వేల లోపు రుణాల జారీని నిలిపివేస్తూ ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తక్కువ స్థాయి రుణాల కోసం ఆశ్రయిస్తున్న వారూ తిరిగి చెల్లించే పరిస్థితి లేదని తెలుస్తోంది. అప్పులు, హెచ్చు ధరలు ప్రజల పొదుపు, కొనుగోలు శక్తిని హరించివేయడంతో ఆ ప్రభావం వినిమయాన్ని దెబ్బతీస్తుంది.. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుందనేది సుస్పష్టం.

➡️