ప్రయివేటు టెల్కోల వసూళ్ల ఎత్తుగడ..!

Jan 31,2024 08:57 #Business
  • 2జి, 3జి సేవల నిలిపివేతకు ప్రతిపాదనలు
  • ట్రాయ్ తో సంప్రదింపులు
  • 4జి, 5జితో రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం
  • బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బగొట్టే కుట్ర
  • 25 కోట్ల పైగా మందిపై భారం

న్యూఢిల్లీ : పేదలు, పెద్ద వయస్సు వాళ్లను పీక్కు తినడానికి ప్రయివేటు టెలికం కంపెనీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. దేశంలో 2జి, 3జి సేవలను నిలిపి వేయాలని ఆ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం. దీంతో మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌)ను దెబ్బగొట్టే ప్రక్రియను ముమ్మరం చేశాయని స్పష్టమవుతోంది. దేశంలో ఇంటర్నెట్‌ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. టెల్కోలు 4జి, 5జి సేవలను పెంచుతున్నాయి. అయినప్పటికీ 2జి, 3జి సర్వీసులు వాడేవారు దేశంలో కోట్లాది మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కోట్లాది మంది పెద్దవాళ్లు, నిరక్షరాస్యులు ఇంకా ఫీచర్‌ ఫోన్లనే వాడుతున్నారు. అందులో 2జి సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ విభాగంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ విస్తృతంగా వినియోగదారులను కలిగి ఉంది. కాగా.. 2జి, 3జి సేవలను పూర్తిగా రద్దు చేయాలని రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా టెల్కోలు తాజాగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రారు)కు ప్రతిపాదనలు అందించాయి. దీనికి సంబంధించి కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరాయి. కాగా దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు. దేశంలో దాదాపు 25 కోట్ల మంది పైగా ఇప్పటికీ 2జి నెట్‌వర్క్‌ను వాడుతున్నారని అంచనా.

2జి, 3జి సేవలను పూర్తిగా నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో కోరింది. ఆ రెండు స్పెక్ట్రమ్‌లను మూసివేసినప్పుడే ప్రజలంతా 4జి, 5జిలోకి మారతారని పేర్కొంది. దీనివల్ల అనవసరపు నెట్‌వర్క్‌ వినియోగ భారం తగ్గుతుందని తెలిపింది. వివిధ రంగాల్లో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో 5జి ఎకోసిస్టమ్‌తో యువతలో నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు తమ కలలను సాకారం చేసుకునేందుకు అవకాశాలను ఇస్తాయని జియో పేర్కొంది. ఇప్పటికీ దేశంలో 2జి నెట్‌వర్క్‌ను ఉపయోగించే వారి సంఖ్య భారీగా ఉందని వొడాఫోన్‌ ఇండియా పేర్కొంది. 4జి, 5జి సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలామంది ఆ సేవలను వినియోగించుకోలేకపోతున్నారని తెలిపింది. 2జి సేవలను రద్దు చేస్తేనే 4జి, 5జికి అప్‌గ్రేడ్‌ అవుతారని పేర్కొంది.గ్రామీణ ప్రాంతాల్లోని అనేక మంది ఇప్పటికీ ఫీచర్‌ ఫోన్లనే వినియోగిస్తున్నారు. 4జి, 5జి కోసం పేదలు స్మార్ట్‌ఫోన్‌కు మారాలంటే భారం పడనుంది. ఇప్పటికీ అనేక మందికి స్మార్ట్‌ఫోన్‌ ఆపరేటింగ్‌ కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో 2జి, 3జి సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని ప్రయివేటు టెల్కోలు ప్రతిపాదనలు చేయడమంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడమేనని, వారిని దోచుకోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. టెలికం కంపెనీలు తమ ఆదాయాలను పెంచుకోవడానికి వేస్తున్న పెద్ద ఎత్తుగడ అని విమర్శిస్తున్నారు. మరోవైపు 2జి విభాగంలో అత్యధిక మంది వినియోగదారులు కలిగి ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలో ఇది ఒక భాగమని విశ్లేషిస్తున్నారు.

➡️