వణికిస్తున్న జిఎస్‌టి సర్వే

Mar 3,2024 08:14 #dreaded, #GST, #survey
  • కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు
  • పన్ను పరిధిలోకి మరిన్ని సంస్థలను తేవడమే లక్ష్యం
  • కరెంటు కనెక్షన్‌ ఉన్న పాన్‌ షాపులను కూడా వదలని వైనం
  • ఇళ్లలో తినుబండారాలు చేసి అమ్మినా నమోదు చేయాల్సిందే

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక సర్వే వ్యాపార, వాణిజ్య వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. జిఎస్‌టి పరిధిలోకి మరిన్ని సంస్థలను తేవడమే లక్ష్యంగా ఈ సర్వే సాగుతోందన్న సమాచారమే దీనికి కారణం. తయారీ, సేవా, వాణిజ్య విభాగాల్లోన్ని అన్ని రకాల సంస్థలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆ పన్ను వసూళ్లను గణనీయంగా పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రస్తుతం జిఎస్‌టి నిర్దారణకు కీలకంగా ఉన్న ఉదయం పోర్టల్‌లో దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివిధ సంస్థలు నమోదు కాలేదు. పెద్ద సంఖ్యలో స్టార్టప్‌లు ఈ పోర్టల్‌లో నమోదుకాకుండానే నడుస్తున్నాయి. దీంతో ఈ సంస్థల నుండి జిఎస్‌టి వసూళ్లు కావడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన సంస్థల డిజిటలీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ సర్వే చేపట్టారు. రైజింగ్‌ అండ్‌ అక్సెలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఇ ప్రొడక్టవిటీ (ఆర్‌ఎఎంపి)లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కోసం 10.70 కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో ఇలా…

                 ఆంధ్రప్రదేశ్‌లో 33.78 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వాటిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉదయం పోర్టల్‌లో 20 లక్షల వరకు రిజిస్టర్‌ కాలేదని తెలుసుకుంది. దీంతో రిజిస్టర్‌ కాకుండా ఉన్న సంస్థల వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర పరిశ్రమ సర్వే పేరుతో గత నెల 23న జిఒ నంబరు 24ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు వివిధ శాఖల నుండి సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్లు పొందిన వారి వివరాలు, జిఎస్‌టి చెల్లిస్తున్న పరిశ్రమలు, సంస్థలు, ఫ్యాక్టరీస్‌ ఇన్సపెక్టర్‌ నుంచి అనుమతి పొందిన కర్మాగారాల వివరాలు సేకరించారు. వాటి నుంచి వచ్చిన వివరాలతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉదయం పోర్టల్‌ వివరాలను సరిపోల్చి చూస్తున్నారు.

సర్వేకు కొత్త యాప్‌

             పరిశ్రమల సమగ్ర సర్వే కోసం పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వార్డు ఎమినిటీస్‌ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలకు ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు వీరికి ఎంపిడిఒ, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఎపిఐఐసి, తదితర శాఖల అధికారులు సహకారం అందించనున్నారు. సర్వే వివరాల నమోదుకు ప్రభుత్వం ‘ఎంఎస్‌ఎంఇ సర్వే అండ్‌ సపోరు’్ట పేరుతో ఒక కొత్త యాప్‌ను రూపొందించింది. సర్వే సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలో అన్ని రకాల వ్యాపారాలు, తయారీ, సేవా రంగం, రిటైల్‌ వ్యాపారాల వివరాలు సేకరించనున్నారు. విద్యుత్‌ కనెక్షన్ల సమాచారం ఆధారంగా పాన్‌ షాపుల్ని కూడా వదలడం లేదు. ఇంట్లో తినుబండారాలు తయారు చేసి అమ్మినా వాటి వివరాలనూ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల ఒకటవ తేదిన ప్రారంభమైన ఈ సర్వేను 15 నుండి 20 రోజుల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఇదీ ప్రశ్నావళి

                సర్వే కోసం ప్రశ్నావళిని ఏడు భాగాలుగా విడదీశారు. అందులో ఎంటర్‌ ప్రైజెస్‌ వివరాలు ఇందులో యజమాని పూర్తి వివరాలను పొందుపరుస్తున్నారు. పరిశ్రమ లేక సంస్థలో తయారు చేస్తున్న ఉత్పత్తి, పెట్టుబడుల సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. పరిశ్రమలో కల్పిస్తున్న ఉద్యోగాలు, రుణ సహాయం వివరాలు, మార్కెటింగ్‌ వివరాలను పొందుపర్చనున్నారు. పరిశ్రమ, సంస్థకు సంబంధించిన భూమి వివరాలనూ సేకరిస్తున్నారు. జిఎస్‌టి చెల్లిస్తున్నారా? లేదా? చెల్లిస్తే నంబరును నమోదు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ సర్వే దేనికి దారి తీస్తోందనని అంతా భయపడుతున్నారు.

➡️