ధరల మంట నిజమే !

Jan 28,2024 09:20 #fire, #prices
  • సర్కారు ఒప్పుకోలు
  • ప్రణాళికా శాఖ నివేదికలో వెల్లడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కొంతకాలంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ ఒక నివేదికను రూపొందించింది. ప్రజానీకానికి అత్యవసరమైన 23 రకాల వస్తువుల ధరలు గత ఏడాది కాలంలో పెరుగుతూనే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. 2022 డిసెంబర్‌లో ఉన్న సరుకుల ధరలకీ, 2023 సంవత్సరంలో డిసెంబర్‌ నాటి ధరలకీ మధ్య అరతరాన్ని ఈ నివేదికలో ప్రణాళికా శాఖ ప్రధానంగా వివరించింది. ఈ నివేదిక ప్రకారం అత్యవసరమైన బియ్యం, పప్పు దినుసులు, ఉప్పు, ఉల్లిపాయలు, పసుపుతోపాటు టమాటా ధరలు కూడా ఏడాది కాలంలో గణనీయంగా పెరిగాయి. ఉల్లిపాయ ధరలు ఏకంగా 63.59 శాతం పెరిగినట్లు నివేదికలో తెలిపారు. ‘ఇంత భారీ స్థాయిలో పెరడగం ఆందోళనకరం. ఇప్పటికీ కిలో ఉల్లి 30 రూపాయల దాకా విక్రయిస్తున్నారు.’ అని నివేదికలో పేర్కొన్నారు. టమాటా ధర గత ఏడాదితో పోలిస్తే 56.68 శాతం పెరిగిందని, కందిపప్పు 2022 డిసెంబర్‌ కన్నా 2023 డిసెంబర్‌ నాటికి 46.45 శాతం ధర పెరిగిందని పేర్కొన్నారు. బియ్యం పైపైకి ప్రతి రోజూ వినియోగిరచే బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నంబర్‌-1 బియ్యం ఏకంగా 13.72 శాతం పెరగ్గా, రెండో రకం బియ్యం 12.34 శాతం పెరిగాయి. గోధుమలు కూడా ఎనిమిది శాతం, జొన్న 21 శాతం, రాగులు 18 శాతానికన్నా ఎక్కువగా పెరిగినట్లు తేలింది. ఈ నివేదిక ప్రకారం నూనెల ధరల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. భారీ స్థాయిలో ధరలు పెరుగుతున్నట్లు నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం అదే సమయంలో వాటి అదుపునకు తీసుకునే చర్యల గురించి మాత్రం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు.

➡️