టిడ్కో లబ్ధిదారుల ఆనందం ఆవిరి

Apr 3,2024 08:08
  • ఒక్కో ఇంటిపై రూ.7.55 లక్షల నుంచి రూ.8.55 లక్షల అప్పు
  • గుడివాడలో లబ్దిదారులకు బ్యాంకుల నోటీసులు
  • 7,325 మందిపై రూ.616.62 కోట్ల భారం

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : టిడ్కో కాలనీల్లోకి గృహ ప్రవేశాల చేసిన ఆనందం ఏడు నెలలు కూడా నిలవలేదు. గతంలో తాము నివసించిన గృహాలకు చెల్లించిన అద్దె కన్నా అధిక మొత్తంలో బ్యాంకులకు నెల నెలా కిస్తీలు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ సమీపంలోని మల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో కాలనీలో రెండు కేటగిరీలకు చెందిన 7,325 మంది లబ్ధిదారులపై రూ.616.62 కోట్ల భారం పడింది. దీంతో, లబ్ధిదారులు గృహ బకాయిలను పూర్తిగా రద్దు చేయాలని, అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి తమ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మల్లాయపాలెంలో రాష్ట్రంలోనే అతి పెద్ద టిడ్కో లే అవుట్లో 8,912 గృహాలను గతేడాది జూన్‌ 16న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేశారు. జి ప్లస్‌ త్రీ నమూనాలో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల్లో మూడు కేటగిరీల్లో గృహాలు నిర్మించారు. 365 చదరపు అడుగుల గృహానికి రూ.7.55 లక్షలు చొప్పున, 430 చదరపు అడుగుల గృహానికి రూ.8.55 లక్షలు చొప్పున వడ్డీతో సహా లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోంది. లబ్ధిదారుని వయసు ఆధారంగా బ్యాంకులు కిస్తీలను నిర్ణయించాయి. బకాయిల చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాయి. వయస్సు ఎక్కువ ఉన్న వారి నెలవారీ కిస్తీల సంఖ్యను బ్యాంకులు తగ్గించాయి. దీంతో, అటువంటి వారు అధిక మొత్తంలో కిస్తీ చెల్లించాల్సి వస్తోంది. 365 చదరపు అడుగుల గృహానికి నెలనెలా రూ.3 వేల నుంచి 4 వేలు, 430 చదరపు అడుగుల గృహానికి రూ.5 వేల నుంచి 5,700 వరకు చెల్లించాలని బ్యాంకు నోటీసులు వస్తున్నాయి. ఈ కాలనీలో 430 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి 6,336 మంది లబ్ధిదారులు రూ.541.72 కోట్లు, 365 చదరపు అడుగుల గృహాలకు సంబంధించి 992 మంది లబ్ధిదారులు రూ.74.89 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ భారం మోయలేమని, ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ గుడివాడ అసెంబ్లీ వైసిపి అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)కు, టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాములుకు గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ వినతిపత్రాలు ఇచ్చింది.

వైసిపి, టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో చేయాలి
గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ వచ్చిన వైఎస్‌.జగన్‌మోహనరెడ్డి టిడ్కో గృహాలపై రూ.3 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, 360, 430 చదరపు అడుగుల్లో గృహాలకు సంబంధించి రెండు కేటగిరీల్లో లబ్ధిదారులకు ఒక్క రూపాయి రుణమూ మాఫీ చేయలేదు. గృహ లబ్ధిదారులకు అప్పు భారంగా మారింది. టిడ్కో గృహ లబ్ధిదారులకు రుణ మాఫీ చేస్తామని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాలి.
                 – గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.సంగమ్మ, బసవ అరుణ

 

ఇంటి అప్పు మాఫీ చేయాలి
నేను కూలి పనులకు వెళతాను. నా భర్త హోటల్‌లో సప్లయిర్‌గా పనిచేస్తారు. నాకు ఇటీవల నడుముకు పెద్దాపరేషన్‌ అయ్యింది. మా ఇద్దరికీ షుగర్‌, బిపి ఉన్నాయి. నెలనెలా మందులకు రూ.4 వేలు ఖర్చవుతోంది. గతంలో ఇంటి అద్దెకు నెలనెలా రూ.1,800 కట్టాము. బ్యాంకు అధికారులు టిడ్కో ఇంటికి నెలనెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు రూ.7.50 లక్షలు చెల్లించాలంటున్నారు. కుటుంబం గడవడానికే కష్టంగా ఉంది. ఇంటి అప్పును ప్రభుత్వం మాఫీ చేయాలి.
                                                          – అక్కిశెట్టి రాజేశ్వరి, గుడివాడ,

 

టిడ్కో గృహ లబ్ధిదారు బ్యాంకు కిస్తీ కట్టలేను
మిషన్‌ కుట్టుకుని జీవనం సాగిస్తున్నాం. 60 ఏళ్ల వయస్సులో కుట్టు మిషన్‌ ద్వారా వచ్చే కొద్దిపాటి ఆదాయం పొట్ట నింపుకోవడానికే చాలడం లేదు. టిడ్కో ఇల్లు రాక ముందు గుడివాడ కాలువ వద్ద రేకుల షెడ్‌కు నెలనెలా రూ.1200 అద్దె చెల్లించాం. టిడ్కో ఇంటికి 20 ఏళ్ల పాటు నెలనెలా రూ.5 వేల చొప్పున మొత్తం రూ.8.50 లక్షలు చెల్లించాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఒకసారి మాత్రమే కిస్తీ చెల్లించాను. కిస్తీలు కట్టగలిగే పరిస్థితిలో లేను.
– మద్దాలి దుర్గ, గుడివాడ, టిడ్కో గృహ లబ్ధిదారు

➡️