అదే పట్టుదల.. అదే స్ఫూర్తి

Jan 2,2024 10:32 #continues, #muncipal workers, #strike
  • కొనసాగుతున్న సమ్మె
  • మొక్కవోని దీక్షతో ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు)

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నాలుగున్నరేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న మున్సిపల్‌ వర్కర్స్‌ గత వారం రోజులుగా జరుగుతున్న సమ్మెలోనూ అదే స్ఫూర్తితో పాల్గొంటున్నారు. సమాన పనికి సమాన వేతనం వచ్చే వరకూ విరమించేది లేదంటూ తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపిన ప్రతిసారీ హామీలు ఇవ్వడం, అనంతరం పట్టించుకోకపోవడంతో సహనం కోల్పోయిన కార్మికులు సమ్మెబాట పట్టారు. పోటీ కార్మికులను తెచ్చి వారి కాంట్రాక్టర్లకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్న కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు మాత్రం సిద్ధపడలేదు. అయినా కార్మికులు తెగించి సమ్మెలో కొనసాగుతున్నారు. సమ్మె నేపథ్యంలో ఒకసారి చర్చలు జరిపిన మంత్రులు, నేడు మరోసారి సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. ప్రజారోగ్య సిబ్బంది సమ్మెతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం, కరోనా వ్యాపిస్తోందని వార్తలు రావడంతో ప్రభుత్వంలోనూ ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా ఏ మాత్రమూ వెనుకాడకుండా కార్మికులు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(సిఐటియు) నేతృత్వంలో ఎక్కువ మంది విజయవంతంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ఎఐసిటియు, ఐఎఫ్‌టియు, టిఎన్‌టియుసి, ఎంఆర్‌పిఎస్‌ సంఘాల వారు కూడా సమ్మెలో ఉన్నారు. కార్మికుల సమ్మెతో సంబంధం లేదని ప్రకటించిన ఒకటీ రెండు సంఘాలు కూడా అనివార్యంగా సమ్మెలోకి రావాల్సి వచ్చింది. జగ్గయ్యపేట, కొండపల్లి, నూజివీడు లాంటి చోట్ల ఎఐటియుసి అనుబంధ సంఘం కార్మికులూ సమ్మెలోకి వస్తున్నారు. సిఐటియు నేతృత్వంలో సమ్మె తీవ్రమవడం, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో గతంలో జనవరి 11 నుండి సమ్మెలోకి వెళతామని ప్రకటించిన సంఘాలు జనవరి మూడు నుండే మొదలు పెడతామని ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం కార్మిక సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వైసిపి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమలులో జాప్యం జరిగింది. దీనిపై ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(సిఐటియు) ఆధ్వర్యాన నాయకులు దఫదఫాలుగా ఆందోళన చేపట్టారు. ఎంతో ఓర్పుతో పోరాటాలు సాగించారు. ఏడాది దాటినా జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిరసనగా 2020 ఆగస్టు నాలుగోతేదీన మున్సిపల్‌ కార్మికులు ఒకరోజు సమ్మె చేపట్టారు. దీనిపై అప్పటి డిఎంఇ విజయకుమార్‌ నాయకులతో చర్చించారు. సమాన పనికి సమాన వేతనం, పర్మినెంటు, ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌, బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చినట్లుగా కరోనా సమయంలో ఇన్సెంటివ్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రికమండ్‌ చేస్తూ లేఖ రాశారు. ఈ సమయంలో సిఐటియు అనుబంధ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సమ్మెలో పాల్గొందని ప్రస్తావించారు. అయినా స్పందన లేకపోవడంతో 2021 ఫిబ్రవరి 15, 16 తేదీల్లో రెండురోజులు సమ్మె నిర్వహించారు. ఫలితం లేకపోవడంతో 2022 జులై 11వ తేదీ నుండి 15వ తేదీ దాకా మరోసారి సమ్మె చేపట్టారు. వేతనాలు పెంచాలని, కోతపెట్టిన హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, జిఒఆర్‌టి 30 ద్వారా ఎనిమిది కేటగిరీలకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని సిఐటియు అనుబంధం సంఘం పట్టుబట్టింది. చేస్తామని చెప్పినా ఇంతవరకు మార్పు చేయలేదు. వాస్తవంగా జిఓ నెంబరు 30 ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయంలో. వైసిపి పాలకులు దాన్ని కొనసాగిస్తున్నారే తప్ప ఇచ్చిన హామీ ప్రకారం మార్పులు చేయలేదు. దీనిపై మూడుసార్లు ఆర్థికశాఖకు సిఫార్సు చేసినా ఫలితం లేదు. జులైలో ఆందోళన సందర్భంగా మంత్రి ఇతర డిమాండ్ల గురించి మాట్లాడినా వేతనం పెంపు గురించి మాట్లాడలేదు. హెల్త్‌ అలవెన్స్‌పై ఆయనకు ఆయనే ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో అన్ని సంఘాలనూ కూడగట్టిన ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(సిఐటియు) 2022లో మరోసారి ఆందోళనకు దిగింది. 11వ పిఆర్‌సి మున్సిపల్‌ కార్మికులకు అమలు చేయాలని కోరారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియామకాలు జరపకూడదని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. అప్పుడు కూడా మంత్రులు హామీనిచ్చారే తప్ప పరిష్కరించలేదు. జోరువానలోనూ దీక్షలు చేపట్టారు. 2021 మేలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించారు. 2022 మార్చి 11న చలో విజయవాడ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులు పెద్దఎత్తున నిర్బంధం ప్రయోగించారు. రోడ్లపై ఈడ్చేశారు తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఈ ఏడాది ఆగస్టులో ఆందోళన తీవ్రమైంది. కార్మికులు కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ సమయంలో జరిగిన లాఠీఛార్జిలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అనంతపురం, కడప, నరసరావుపేట లాంటిచోట్ల కార్మికులను పోలీసులు తీవ్రంగా కొట్టారు. సుమారు 100 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. ఆగస్టు 10న మంత్రి చర్చలకు పిలిచి మరలా హామీలు గుప్పించారు. అవేమీ అమలు జరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(సిఐటియు) ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు జరిపి కార్మికులను సన్నద్ధం చేశారు. అదే సమయంలో కలిసివచ్చే ఇతర సంఘాలనూ కలుపుకుని ఆందోళన ఉధృతం చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో 2023 డిసెంబర్‌ చివరివారం నుండి సమ్మె చేపట్టారు. దీంతో ప్రభుత్వం వారితో ఒకరోజు చర్చలు జరిపింది. సరైన ఫలితం లేకపోవడంతో సిఐటియు, ఎఐసిటియు నాయకులు కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై 30వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. సిఐటియు అనుబంధ సంఘం మినహా మిగిలిన సంఘాలు సమ్మెలో పాల్గొనడం లేదని ప్రకటించారు. సిఐటియు అనుబంధ సంఘం కూడా సమ్మెను విరమించాలని కోరారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదని సంఘం ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి మంత్రుల బృందం చర్చలకు ఆహ్వానించింది.

➡️