పాతాళానికి భూగర్భజలం

Mar 26,2024 06:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ఏడాది నెలకొన్న తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో భూగర్భజలాలు రికార్డు స్థాయికి పడిపోయాయి. వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో ఎక్కడా వాగులు, వంకలు పారకపోవడం చెరువుల్లోకి పెద్దగా నీరు చేరకపోవడంతో భూగర్భజలమట్టాలపై తీవ్ర ప్రభావం చూపింది. బోరుబావుల కింద వున్న నీటిపథకాలు అన్నీ పడకేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. అయితే, ఎన్నికల హడావిడిలో పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, ప్రచార పర్వాల్లో పడిపోగా, అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో బిజిగా ఉంది. దీంతో ఆందోళన చేయడం తప్ప మరోమార్గం లేని స్థితి ప్రజానీకానికాని ఏర్పడుతోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఏడు జిల్లాలు మినహా 19 జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకరం స్థితికి పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరినెలలో 2.27 మీటర్ల దిగువకు నీటిమట్టాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 7.28 మీటర్లకు దిగువన నీటిమట్టం నమోదు కాగా ఈ ఏడాది 9.56 మీటర్లకు పడిపోయింది. కరువు ప్రాంతం అయిన రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో రాయలసీమ ప్రాంతంలో 6.79 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యమైతే , ఈ ఏడాది ఏకంగా 11.04 మీటర్లుగా నమోదు అయ్యింది. అలాగే కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ భూగర్భజలాల పరిస్థితి నిరాశజనకంగా మారింది. గత ఏడాది 8.92 మీటర్లు వుంటే ఈ ఏడాది ఏకంగా 12.66 మీటర్లకు పడిపోయింది.
జిల్లాల వారిగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో ఎక్కువగా భూగర్భజలాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 10.62 మీటర్లు నమోదవుతే ఈ ఏడాది 18.86 మీటర్ల దిగువకు చేరాయి,. ప్రకాశం జిల్లాలో సగటు భూగర్భజల లభ్యత గత ఏడాదితో పోలిస్తే 8.24 మీటర్లకు పడిపోయింది. అలాగే సత్యసాయి జిల్లాలో గత ఏడాదికంటే 5.42 మీటర్ల దిగువకు నీటిమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని అనంతపురం, నంద్యాల, పల్నాడు, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లో భూగర్భజలాల మట్టం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటినిల్వ సామర్థ్యం 865.64 టిఎంసీలుకాగా గత ఏడాది 391.7టిఎంసీలు వుంటే ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీటిమట్టాలన్నీ అడుగంటిపోయి కేవలం 229 టిఎంసీలు మాత్రమే వున్నాయి. అలాగే మీడియం ప్రాజెక్టుల సామర్థ్యం 115 టిఎంసీలు కాగా కేవలం 38 టిఎంసీలు మాత్రమే అందుబాటులో వుంది. నీటిలభ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించడం అధికారులకు సవాల్‌గా మారనుంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే జూన్‌, జూలైదాకా నీటి ఎద్దడిని ఎలా అధిగమిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

➡️