Visakha Steel Plant : రోజుకోక సమస్య

  • నిన్న విమల పాఠశాల మూసివేత
  • నేడు గురజాడ కళాక్షేత్రం ఛార్జీలు పెంపు
  • స్టీల్‌ యాజమాన్యంపై కార్మికుల్లో ఆగ్రహం

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం రోజుకొక సమస్యను సృష్టిస్తోంది. ప్లాంట్‌ను ఎలాగైనా ప్రయివేటీకరించాలన్న ధృడనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్లాంట్‌ యాజమాన్యం సహకరిస్తూ వస్తోంది. ఆ కుట్రలో భాగంగానే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం, క్వార్టర్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం, విమల పాఠశాలను మూసివేయడం వంటి కుట్రలకు తెరలేపింది. ఉక్కు ఉత్పత్తిపై కార్మికులు, ఉద్యోగులు శ్రద్ధ పెట్టనీయకుండా చేస్తోంది. ఈ సమస్యలపైనా కార్మికులు పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ప్లాంట్‌ను రక్షించుకుంటూ వస్తున్నారు.
కొద్ది నెలలుగా ఉక్కు కర్మాగారం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేదు. గత నెలలో అయితే 20 రోజుల ఆలస్యంగా చెల్లించారు. గతంలో కేంద్రీయ విద్యాలయాన్ని, తాజాగా విశాఖ విమల విద్యాలయాన్ని మూసివేసేందుకు స్టీల్‌ యాజమాన్యం ప్రయత్నించింది. కార్మికులు, విద్యార్థుల తల్లిదండ్రులు సిపిఎం, సిఐటియు ఆధ్వర్యాన ఆందోళన బాట పట్టి వాటిని రక్షించుకోగలిగారు. స్టీల్‌ప్లాంట్‌ క్వార్టర్స్‌లో ఇప్పటి వరకూ యూనిట్‌ విద్యుత్‌కు 50 పైసలు చెల్లిస్తుండగా దాన్ని రూ. ఎనిమిదికు పెంచుతూ నిర్ణయం చేసిన సంగతి తెలిసిందే.

గురజాడ కళాక్షేత్రం ఛార్జీల బాదుడు
ఉక్కునగరంలో ఏ శుభకార్యమైనా, కార్మిక సంఘాల సమావేశాలు, సభలు, ఇతరత్రా ఫంక్షన్‌లైనా గురజాడ కళాక్షేత్రంలోనే నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఆ కళాక్షేత్రం ఛార్జీలను పెంచుతూ ఈ నెల 14న సర్క్యులర్‌ను ఉక్కు యాజమాన్యం జారీచేసింది. ఆ ప్రకారం.. పెళ్లిళ్లు, రిసెప్షెన్లకైతే (ఉద్యోగులు, వారిపై ఆధారపడేవారికి) రూ.20 వేలు తీసుకుంటున్నారు. ఇతర కార్యక్రమాలకు రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. ఎసి ఛార్జీల కింద రూ.1800 చెల్లించాల్సి ఉంది. జిఎస్‌టి కూడా కట్టాలి. ఉక్కు ఉద్యోగులు కాకుండా బయట వ్యక్తులైతే రోజుకు రూ.75000, జిఎస్‌టి చెల్లించాలి. వీరికి ఎసి ఛార్జీలు రూ.3600, జిఎస్‌టి ఉంటాయి. కమర్షియల్‌ కోసం ఎవరైనా వినియోగిస్తే లక్షా యాభై వేలు చెల్లించాలి. దీనికి ఎసి ఛార్జీలు రూ.3600, జిఎస్‌టి చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉద్యోగికి రూ.1600 నామమాత్రపు ఫీజు ఉండగా నేడు రూ.20 వేలకు పెంచేశారు. బయట వ్యక్తులకు రూ.30 వేలు ఉండగా నేడు రూ.75 వేలుకు పెంచేశారు. తాజా నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై దృష్టిపెట్టి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని కోరుతున్నారు.

➡️