ఆంధ్ర 188ఆలౌట్‌- అస్సాంతో రంజీట్రోఫీ మ్యాచ్‌

Jan 19,2024 22:06 #Sports

డిస్పూర్‌(అస్సాం): రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా అస్సాంతో తలపడుతున్న ఆంధ్ర జట్టు బ్యాటర్స్‌ చేతులెత్తేశారు. మురళీధర్‌ జులన్‌ ఔట్‌డోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 72.1ఓవర్లలో 188పరుగులకే కుప్పకూలింది. అస్సాం బౌలర్లు చెలరేగడంతో ఆంధ్ర ఓ దశలో 70పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో నితీశ్‌ కుమార్‌(49), షోయబ్‌(63) 7వ వికెట్‌కు 113పరుగులు జతచేశారు. వీరిద్దరూ ఔటయ్యాక మరో ఐదు పరుగుల వ్యవధిలో ఆంధ్ర మిగిలిన వికెట్లను కోల్పోయింది. కెప్టెన్‌ రికీ బురు(24), హనుమ విహారి(4), వికెట్‌ కీపర్‌ గిరినాథ్‌(14), రషీద్‌(9) నిరాశపరిచారు. అస్సాం బౌలర్లలో రాహుల్‌సింగ్‌కు నాలుగు, ముక్తార్‌ హుస్సేన్‌కు రెండు, సిద్ధార్ధ్‌, ఆకాశ్‌సేన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం జట్టు తొలిరోజు ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 43పరుగులు చేసింది. రిషబ్‌(18), రాహుల్‌(21) క్రీజ్‌లో ఉన్నారు. త్యాగరాజన్‌ దెబ్బకు సిక్కిం ఢమాల్‌.. ప్లేట్‌ విభాగంలో సిక్కింతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు భారీస్కోర్‌ దిశగా దూసుకెళ్తోంది. తొలుత సిక్కింను 79పరుగులకే పరిమితం చేసిన హైదరాబాద్‌.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగి తొలిరోజు ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 313పరుగులు చేసింది. ఓపెనర్‌ తన్మరు అగర్వాల్‌(137) సెంచరీకి తోడు, రాహుల్‌ సింగ్‌(83) ఔటయ్యారు. రోహిత్‌ రాయుడు(52), కెప్టెన్‌ తిలక్‌వర్మ(33) క్రీజ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌ బౌలర్‌ తనరు అగర్వాల్‌కు ఆరు, మిలింద్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

➡️