ఇక టెన్నిస్‌ సందడి

Jan 13,2024 22:10 #Sports

రేపటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

బరిలో జకోవిచ్‌, మెద్వదేవ్‌, స్వైటెక్‌, ఒసాక

మెల్‌బోర్న్‌ : గ్రాండ్‌స్లామ్‌ సందడి షురూ. ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నేటి నుంచి ఆరంభం. ప్రపంచ అత్యుత్తమ రాకెట్‌ స్టార్స్‌ గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ అందుకునేందుకు మెల్‌బోర్న్‌ పార్క్‌లో సమరానికి సై అంటున్నారు. సహజంగానే మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ కోసం స్టార్స్‌తో పాటు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణీలు పోటీలో నిలువగా.. మెన్స్‌ సింగిల్స్‌లో నొవాక్‌ జకోవిచ్‌ను ఢకొీట్టేందుకు మిగతా ఆటగాళ్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జోకర్‌కు ఎదురుందా?! : రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌లతో ముక్కోణపు పోటీ నుంచి నొవాక్‌ జకోవిచ్‌ బయటపడ్డాడు. ఫెదరర్‌ ఆటకు వీడ్కోలు పలుకగా, గాయంతో నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. దీంతో రికార్డు 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో సెర్బియా యోధుడు జకోవిచ్‌కు ఎదురు లేదని అంటున్నారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ట్రోఫీని పది సార్లు సొంతం చేసుకున్న జకోవిచ్‌కు.. గత ఐదేండ్లలో మెల్‌బోర్న్‌లో టైటిల్‌ పోరులో ఓటమి లేదు. యువ ఆటగాళ్లు డానిల్‌ మెద్వదేవ్‌, అల్కరాజ్‌, జాన్‌ సిన్నర్‌లు జకోవిచ్‌కు పోటీ ఇస్తున్నారు. డానిల్‌ మెద్వదేవ్‌, అల్కరాజ్‌లు గతంలో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌పై కన్నేశారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జకోవిచ్‌కు సులువైన డ్రా లభించింది. గ్రాండ్‌స్లామ్‌ మాజీ చాంపియన్లు ఆండీ ముర్రే, స్టానిస్లాస్‌ వావ్రింకాలు జకోవిచ్‌కు ఎదురైనా.. వరుస గాయాలు, ఫామ్‌లేమితో మునుపటి స్థాయిలో ప్రతిఘటించే పరిస్థితి లేదు.

ఫేవరేట్‌గా స్వైటెక్‌ : మెన్స్‌ సింగిల్స్‌ తరహాలో మహిళల సింగిల్స్‌ సర్క్యూట్‌ను ఎవరూ శాసించలేదు. సెరెనా విలియమ్స్‌ రికార్డు గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో దిగ్గజంగా ఎదిగినా.. ఎదురులేని జైత్రయాత్ర లేదు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో అంచనాలకు అందని విభాగం మహిళల సింగిల్సే. సీడింగ్‌, ఫామ్‌, ర్యాంకింగ్‌తో సంబంధం లేకుండా అనామక క్రీడాకారిణిలు చాంపియన్లుగా అవతరించిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. మాతృత్వ సెలవు నుంచి వచ్చిన జపాన్‌ స్టార్‌ నవొమి ఒసాక మెల్‌బోర్న్‌లో టైటిల్‌పై కన్నేసింది. అగ్రతార, వరల్డ్‌ నం.1 ఇగా స్వైటెక్‌ సైతం టైటిల్‌ కోసం పట్టుదలగా కనిపిస్తోంది. రిబకినా, సబలెంక, కొకొ గాఫ్‌లు సైతం టైటిల్‌ రేసులో నిలిచారు. అనూహ్య ఫలితాలు వెలువడే మహిళల సింగిల్స్‌లో ఈ ఏడాది కొత్త చాంపియన్‌ను చూస్తామా? ఆసక్తికరం.

నాగల్‌ నిలిచాడు : గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో భారత స్టార్స్‌ డబుల్స్‌ విభాగంలో అద్భుత ఫలితాలు రాబట్టారు. కానీ సింగిల్స్‌ సర్క్యూట్‌లో భారత క్రీడాకారుల ప్రభావం అత్యల్పం. గత మూడేండ్లలో సింగిల్స్‌ విభాగంలో ఒక్క భారతీయ క్రీడాకారుడు సైతం ప్రధాన టోర్నీకి చేరుకోలేదు. చివరగా 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సుమిత్‌ నాగల్‌ పోటీ పడ్డాడు. మూడేండ్ల తర్వాత మళ్లీ సుమిత్‌ నాగలే మెల్‌బోర్న్‌ పార్క్‌లో సందడి చేయనున్నాడు. అర్హత రౌండ్‌లో వరుసగా మూడో మ్యాచ్‌లో 6-4, 6-4తో విజయం సాధించిన సుమిత్‌ నాగల్‌ ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో వరల్డ్‌ నం.31 అలెగ్జాండర్‌ బబ్లిక్‌తో సుమిత్‌ నాగల్‌ తలపడనున్నాడు.

➡️