T20 World Cup: గెలవాలంటే చెమటోడ్చాల్సిందే..!

Jun 27,2024 07:05 #Sports
  • సెమీస్‌లో రేపు ఇంగ్లండ్‌తో టీమిండియా డీ

గయానా: టి20 ప్రపంచకప్‌-2024 ఓటమి ఎరుగని టీమిండియా రేపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో పోటీపడనుంది. లీగ్‌లో మూడు మ్యాచుల్లో, సూపర్‌8లో మరో మూడు మ్యాచుల్లో టీమిండియా సునాయాసంగా విజయాలను నమోదు చేసుకుంది. లీగ్‌లో పాకిస్తాన్‌పై మినహాఈ టోర్నమెంట్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. అదే జోరును సెమీస్‌లోనూ చూపాల్సి ఉంది.

వర్షంతో మ్యాచ్‌ రద్దయితే..
భారత్‌-ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌ జరిగే సమయానికి 88 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ రద్దైతే పరిస్థితి ఏంటనే ప్రశ్న అభిమానుల్లో నెలకొలింది. షెడ్యూల్‌ ప్రకారం భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే (ఒక్క బంతి కూడా పడకుండా) సూపర్‌-8 దశలో గ్రూప్‌ (గ్రూప్‌-1) టాపర్‌గా ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్‌ చేరుతుంది. ఒకవేళ భారత్‌-ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం కారణంగా పాక్షికంగా అంతరాయం కలిగితే.. ఫలితం తేలేందుకు 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. ఇక్కడ కూడా ఫలితం తేలకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఫలితాన్ని నిర్దారిస్తారు.

తొలి సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే
మరోవైపు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ట్రినిడాడ్‌ వేదికగా ఉదయం జరిగే తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండటంతో వర్షంతో మ్యాచ్‌ రద్దయినా మరుసటి రోజు మ్యాచ్‌ జరగనుంది.
జట్లు(అంచనా)..
ఇండియా : రోహిత్‌(కెప్టెన్‌), కోహ్లి, పంత్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌, దూబే, హార్దిక్‌, అక్షర్‌, జడేజా, బుమ్రా, ఆర్ష్‌దీప్‌, కుల్దీప్‌.
ఇంగ్లండ్‌ : బట్లర్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సాల్ట్‌, బెయిర్‌స్టో, బ్రూక్‌, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోన్‌, సామ్‌ కర్రన్‌, జోర్డాన్‌, ఆర్చర్‌, ఆదిల్‌ రషీద్‌, టోప్లే.

➡️