ఒలింపిక్స్‌ బెర్త్‌ ఆశలు ఆవిరి

Jan 19,2024 22:20 #Sports

కాంస్య పతక పోటీలనూ జపాన్‌ చేతిలో ఓటమి

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల హాకీ

రాంచీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మహిళా క్రీడాకారిణులు నిరాశపరిచారు. శుక్రవారం జరిగిన కాంస్య పతక పోటీలో భారత్‌ 0-1గోల్‌తో జపాన్‌ చేతిలో ఓటమిపాలై 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో భారత మహిళా క్రీడాకారిణులు విఫలమయ్యారు. మ్యాచ్‌ ప్రారంభంలో జపాన్‌ క్రీడాకారిణులు భారత్‌పై ఆధిక్యతను సంపాదించారు. దీంతో తొలి క్వార్టర్‌ 4వ ని.లోనే జపాన్‌కు తొలి పెనాల్టీ కార్నర్‌ లభించింది. ఆ కార్నర్‌ను భారత గోల్‌కీపర్‌, కెప్టెన్‌ సవిత అద్భుతంగా అడ్డుకున్నా.. 6వ ని.లో లభించిన మరో పెనాల్టీని జపాన్‌ గోల్‌ చేసింది. దీంతో జపాన్‌ 1-0 ఆధిక్యతలోకి వెళ్లింది. జపాన్‌ తరఫున ఆ గోల్‌ను కనా యురంటా కొట్టింది. ఆ తర్వాత ఇరుజట్లు తొలి క్వార్టర్‌లో మరో గోల్‌ చేయకపోవడంతో భారత్‌ 0-1గోల్స్‌తో వెనుకబడింది. ఇక రెండు, మూడు, నాలు క్వార్టర్‌లలో ఇరుజట్లు ఎంత ప్రయత్నించినా గోల్‌ చేయలేకపోయాయి. ముఖ్యంగా మూడో క్వార్టర్‌లో భారత్‌కు పలుమార్లు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ప్రయోజనం లేకపోయింది. చివరి క్వార్టర్‌లో పోరాడినా గోల్‌ చేయడంలో విఫలమయ్యారు. టోర్నీలో భాగంగా గ్రూప్‌ లీగ్‌ దశలో అమెరికా చేతిలో ఓడినా.. ఆ తర్వాత న్యూజిలాండ్‌, ఇటలీలపై గెలుపుతో సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న అమ్మాయిలు గురువారం పటిష్ట జర్మనీ చేతిలో షూటౌట్‌లో ఓడారు. బలమైన జట్టుపై మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న అమ్మాయిలు ఒక్కరోజు వ్యవధిలోనే జపాన్‌తో మ్యాచ్‌ ఆడడం ప్రతికూల ఫలితాన్నిచ్చిందని చెప్పవచ్చు.

➡️