ఓటమి కోరల్లో వెస్టిండీస్‌ ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్‌

Jan 18,2024 22:20 #Sports

ఆడిలైట్‌: తొలి టెస్టులో వెస్టిండీస్‌ జట్టు ఓటమి కోరల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 283పరుగులకు ఆలౌట్‌ కావడంతో విండీస్‌ జట్టు 95పరుగులు వెనుకబడింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ జట్టు 73పరుగులకే 6వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 2వికెట్ల నష్టానికి 59 పరుగులతో గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా కామెరూన్‌ గ్రీన్‌(14), ఉస్మాన్‌ ఖవాజా(45), మిచెల్‌ మార్ష్‌(5) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో మిడిలార్డర్‌ బ్యాటర్‌ ట్రావిస్‌ హెడ్‌(119) సెంచరీతో ఆదుకున్నాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల సాయంతో హెడ్‌.. ఆసీస్‌కు ఆధిక్యం అందించాడు. విండీస్‌ పేసర్‌, ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన షెమర్‌ జోసెఫ్‌(5/94) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన విండీస్‌ను హేజిల్‌వుడ్‌ వణికించాడు. చందర్‌పాల్‌(0), కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(1), అలిక్‌ అథనేజ్‌(0), కవెమ్‌ హౌడ్జ్‌(3)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో విండీస్‌.. 19 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రిక్‌ మెకంజీ(26), జస్టిన్‌ గ్రీవ్స్‌(24)లు విండీస్‌ను ఆదుకున్నారు. కానీ మెకంజీని గ్రీన్‌ ఔట్‌ చేయగా గ్రీవ్స్‌ను లియాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో విండీస్‌.. ఆరు వికెట్లను కోల్పోయింది. విండీస్‌ ఇంకా 22 పరుగులు వెనుకబడే ఉంది.

➡️