కులకర్ణి సెంచరీ.. చివరి లీగ్‌లో అమెరికాపై 201పరుగుల తేడాతో గెలుపు

Jan 28,2024 22:20 #Sports

జహన్నెస్‌బర్గ్‌: ఐసిసి అండర్‌-19 ప్రపంచ కప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లోనూ భారతజట్టు ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్‌-ఎ లీగ్‌ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు201పరుగుల తేడాతో అమెరికాను చిత్తుచేసింది. బ్లూమ్‌ఫోంటెన్‌ వేదికగా టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణి (108, 8ఫోర్లు, 3సిక్సర్లు) సెంచరీకి తోడు ముషీర్‌ ఖాన్‌ (73, 6ఫోర్లు, సిక్సర్‌) బ్యాటింగ్‌లో రాణించారు. ఆదర్శ్‌ సింగ్‌ (25) నాలుగు ఫోర్లు బాదినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే ముషీర్‌ ఖాన్‌తో కలిసి కులకర్ణి రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ముషీర్‌ ఖాన్‌ ఔటయ్యాక కొద్దిసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్న కులకర్ణి కూడా పెవీలియన్‌ చేరాడు. ఆఖర్లో కెప్టెన్‌ ఉదరు సహరన్‌ (35), ప్రియాన్షు మోలియా (27)ల, సచిన్‌ దాస్‌ (20)లు ధాటిగా ఆడి భారత్‌కు భారీ స్కోరు సాధించిపెట్టారు. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన అమెరికా జట్టు నిర్ణీత 50 ఓవవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు కోల్పోయి 125పరుగులు చేసింది. శ్రీవాస్తవ(40), అమోన్‌(27) టాప్‌స్కోరర్స్‌. తివారికి నాలుగు, లింబిని, పాండే, అభిషేక్‌, మోలియాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కులకర్ణికి లభించింది. దీంతో గ్రూప్‌-ఎలో భారత్‌ మూడు మ్యాచుల్లో మడు గెలుపుతో 6పాయింట్ల సాయంతో అగ్రస్థానంలో నిలిచింది. 30నుంచి సూపర్‌ 6పోటీలు ప్రారంభం కానున్నాయి.

➡️