కెఎల్‌ రాహుల్‌ ఔట్‌..బుమ్రా ఇన్‌..

Feb 29,2024 22:10 #Sports

 

ఐదోటెస్ట్‌కు జట్టును ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, చివరి టెస్ట్‌కు భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) వారం రోజుల ముందే జట్టును ప్రకటించింది. గాయపడ్డ కెఎల్‌ రాహుల్‌ ఐదో టెస్ట్‌కు దూరం కాగా.. మూడు, నాలుగు టెస్టులకు విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి చోటు దక్కించుకున్నాడు. గాయపడ్డ కెఎల్‌ రాహుల్‌ కోలుకొనేందుకు మరికొంత సమయం పడుతుందని, చికిత్స నిమిత్తం లండన్‌కు వెళ్లనున్నట్లు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. ఇక పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ సాధించడంతో అతడు చోటు దక్కించుకున్నట్లు బిసిసిఐ ఓ ప్రకటనలో తెలిపింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 3ా1 ఆధిక్యతలో ఉండగా.. ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా మొదలుకాబోయే ఈ టెస్టులో ఆడతాడనుకున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌.. తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతుండటంతో బిసిసిఐ అతడిని ఈ టెస్టులో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు మార్పులతో పాటు నాలుగో టెస్టు వరకూ జట్టుతోనే ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌ను బిసిసిఐ రిలీజ్‌ చేసింది. అతడు రంజీట్రోఫీలో భాగంగా మార్చి 2 నుంచి ముంబయితో జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌ కొరకు తమిళనాడుకు ఆడనున్నాడు. ఈ మూడు మార్పులు తప్ప భారత జట్టులో మార్పులేమీ లేవు. ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారతజట్టు 3-1 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.

జట్టు: రోహిత్‌(కెప్టెన్‌), బుమ్రా(వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, పటీధర్‌, సర్ఫరాజ్‌, ధృవ్‌ జురెల్‌, శ్రీకర్‌ భరత్‌(వికెట్‌ కీపర్లు), దేవదత్‌ పడిక్కల్‌, అశ్విన్‌, జడేజా, అక్షర్‌, కుల్దీప్‌, సిరాజ్‌, ముఖేష్‌ కుమార్‌, ఆకాశ్‌దీప్‌.

➡️