క్వార్టర్స్‌కు భారతజట్లు

Feb 14,2024 22:18 #Sports

ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌

బ్యాంకాక్‌: ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు దూసుకెళ్లాయి. మహిళల జట్టు 3-2 తేడాతో పటిష్ట చైనాను చిత్తుచేయగా.. పురుషుల జట్టు 4-1తో హాంకాంగ్‌ను ఓడించాయి. స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ సారథ్యంలోని భారతజట్టు తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైనా.. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లోనూ గెలుపొందడం విశేషం. దీంతో భారత్‌ 4-1 తేడాతో హాంకాంగ్‌ను చిత్తుచేసి క్వార్టర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌లో భారత్‌.. చైనాతో ఆడనుంది. మూడు సింగిల్స్‌, రెండు డబుల్స్‌ మ్యాచ్‌లు ఉన్న ఈ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్.. 18-21, 14-21 తేడాతో లంగ్‌-అంగస్‌ చేతిలో ఓడిపోయాడు. దీంతో హాంకాంగ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌ 21-16, 21-11 తేడాతో లుయి చున్‌-యింగ్‌ షింగ్‌ చురు తేడాతో ఓడించి స్కోరును 1-1 తేడాతో సమం చేశారు. ఆ తర్వాత సింగిల్స్‌లో యువ షట్లర్‌ లక్ష్య సేన్‌.. 21-14, 21-9 తేడాతో చన్‌ యిన్‌ చక్‌ను చిత్తు చేశాడు. రెండో డబుల్స్‌ మ్యాచ్‌లో ఎం.ఆర్‌.అర్జున్‌-ధ్రువ్‌ కపిల ద్వయం.. 21-12, 21-7 తేడాతో చై హిన్‌ లంగ్‌-హుంగ్‌ కుయి చున్‌లను ఓడించడంతో భారత్‌ లీడ్‌ 3-1కి చేరింది. చివరి సింగిల్స్‌ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్‌.. 21-14, 21-18 తేడాతో జేసన్‌ గునవన్‌ను ఓడించడంతో భారత్‌.. 4-1తో హాంకాంగ్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.

మహిళల జట్టు కూడా..

భారత మహిళల జట్టు 3-2తో పటిష్ట చైనాను చిత్తుచేసి క్వార్టర్స్‌ పోరుకు అర్హత సాధించింది. గాయం కారణంగా సుమారు నాలుగు నెలల తర్వాత రాకెట్‌ పట్టిన పివి సింధు.. అన్మోల్‌ ఖర్బ్‌ అద్భుత పోరాటంతో భారత్‌ క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మొదటి సింగిల్స్‌ మ్యాచ్‌లో సింధు.. 21-17, 21-15 తేడాతో హాన్‌ యూ ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఉమెన్స్‌ డబుల్స్‌లో చైనా ద్వయం లు షెంగ్‌ షు-తాన్‌ నింగ్‌.. 21-19, 21-16 తేడాతో భారత జోడీ తనీషా కాస్ట్రో, అశ్విని పొన్నప్పలను ఓడించి స్కోరును 1-1తో సమం చేసిందిప రెండో సింగిల్స్‌ పోరులో వాంగ్‌ జి యి.. 21-13, 21-15 తేడాతో అష్మిత చలియాను ఓడించడంతో చైనా 2-1 ఆధిక్యాన్ని దక్కించుకుంది. మరో డబుల్స్‌ మ్యాచ్‌లో భారత జోడీ త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్‌.. 10-21, 21-18, 21-17 తేడాతో చైనా జంట లి యి జింగ్‌-లు జు మిన్‌ లపై విజయం సాధించి స్కోరును 2-2తో సమం చేశారు. ఈ క్రమంలో అత్యంత కీలకమైన ఆఖరి పోరులో పదిహేడేళ్ల భారత క్రీడాకారిణి అన్మోల్‌ ఖర్బ్‌.. 22-20, 14-21, 21-18 తేడాతో వు లు యు ను ఓడించడంతో భారత్‌ 3-2 ఆధిక్యం దక్కించుకుని క్వార్టర్స్‌కు చేరుకుంది. 472వ ర్యాంకర్‌ అయిన అన్మోల్‌.. 149వ చైనా ర్యాంకర్‌పై తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అత్యద్భుతంగా పోరాడి భారత్‌ క్వార్టర్స్‌ చేరడంలో కీలకపాత్ర పోషించింది.

➡️