జీవించే హక్కు అందరిదీ…

Dec 15,2023 09:56 #Everyone, #live, #right
  • ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజ

న్యూఢిల్లీ : ‘ఎక్కడ పుట్టాలో ఎక్కడ పెరగాలో ఎవరూ నిర్ణయించుకోలేరు. కాని ఇప్పుడు ప్రపంచమంతా వారి వెనక్కి వెళ్లిపోయింది. నా హృదయం దీన్ని తీసుకోలేకపోతోంది’ అంటూ వణుకుతున్న స్వరంతో ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజ పాలస్తీనీయున్లకు సంఘీభావంగా ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. ఆయన అంతలా ఎందుకు స్పందించాల్సి వచ్చిదంటే.. ‘అన్ని జీవితాలు సమానం’, ‘స్వేచ్ఛ మానవ హక్కు’ అన్న నినాదాలు ఉన్న స్పోర్ట్స్‌ షూ ధరించి పాకిస్తాన్‌ టెస్ట్‌ సిరీస్‌కి సిద్ధమౌతున్న ట్రైనింగ్‌ సెషన్‌లో అతను పాల్గొన్నాడు. పాలస్తీనీయన్లకు సంఘీభావంగా ఆ దేశ పతాకాన్ని ప్రతిబింబించే రంగుల్లో ఆ నినాదాలను రాసుకున్నాడు. అదే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి)కి కంటకింపైంది. ఉస్మాన్‌ ధరించిన షూపై ఐసిసి అభ్యంతరం వ్యక్తం చేసింది. గురువారం జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్‌ పాకిస్తాన్‌ టెస్ట్‌ సిరీస్‌ మ్యాచ్‌లో ఆ షూ ధరించకూడదని నిబంధన పెట్టింది. దీనిపై స్పందిస్తూ బుధవారం ఉస్మాన్‌ భావోద్వేగభరితంగా ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ‘నేను వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తాను. అయితే నేను తీసుకున్న నిర్ణయంపై ఆమోదం వచ్చేవరకు పోరాడతాను. ఎందుకంటే.. తమకు అన్యాయం జరిగిందని చెప్పలేని నిశ్శబ్ద గొంతుకల తరపున నేను మాట్లాడుతున్నాను. అక్కడ ఎటువంటి పశ్చాత్తాపం లేని, పరిణామాలపై ఆలోచన లేని కఠిన మనస్కుల చర్యల వల్ల వేలాది మంది చిన్నారులు అశువులు బాస్తున్నారు. ఇది రాజకీయ సందేశం కాదు. అంతకు మించి.. మానవత్వానికి సంబంధించినది. యుద్ధం మొదలైన దగ్గర నుండి గాజాలో ఇప్పటివరకు 7,700 మంది చిన్నారులు బలయ్యారు. గాయాలతో చికిత్స పొందుతున్న వారితో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఆ బిడ్డల్లో నా ఇద్దరు కూతుళ్లను తలచుకుంటే నా హృదయం కకావికలమైపోతోంది’ అంటూ తీవ్ర ఆవేదనతో ఉస్మాన్‌ మాట్లాడుతున్నప్పుడు అతని గొంతు వణికింది. పంటిబిగువున దు:ఖాన్ని నొక్కిపట్టినా అతని కళ్లల్లో కన్నీటిపొరలు కనిపించాయి. ‘స్వేచ్ఛ అందరికీ కాదా’ అని ప్రశ్నించాడు. ‘వారు ఏ జాతి, ఏ మతం, ఏ సంస్కృతో నాకు అవసరం లేదు. అన్ని జీవితాలు సమానం’ అని మాత్రమే నేను చెప్పదలచుకున్నాను. అదే కొంతమందికి నచ్చడం లేదు. ఈరకం వ్యక్తులు నేను ఏ ఉద్దేశంతో రాశానో కూడా అర్థం చేసుకోలేరు. నా రాతల్లో రాజకీయం లేదు. నేను ఎవరి పక్షం వారినీ కాదు. ఈ జీవితం అందరికీ సమానం. ఒక ముస్లిం, ఒక యూదు, ఒక హిందూ అందరికీ జీవించే హక్కు ఉంది’ అంటున్న ఉస్మాన్‌ పాకిస్తాన్‌ మూలాలున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌. బాల్యంలోనే పాకిస్తాన్‌ నుండి ఆస్ట్రేలియాకు అతని కుటుంబం వలసొచ్చింది. తన 12 ఏళ్ల కెరీర్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఇప్పటివరకు 115 అంతర్జాతీయ క్రీడలు ఆడాడు. ప్రతిభావంత ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో క్రీడాబి óమానులను సంపాదిం చుకున్నాడు.

➡️