మజుందార్‌ సెంచరీ- ఆంధ్ర-బెంగాల్‌ రంజీమ్యాచ్‌

Jan 5,2024 22:30 #Sports

ప్రజాశక్తి – పిఎం.పాలెం (విశాఖపట్నం):విశాఖలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ప్రారంభమైన ఆంధ్ర-బెంగాల్‌ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ తొలిరోజునుంచే హోరాహోరీగా సాగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్‌ 86ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. ఓపెనర్‌ సౌరవ్‌ పౌల్‌(96) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకోగా.. అనుష్టుప్‌ మజుందార్‌(125) సెంచరీతో కదం తొక్కాడు. శ్రేయాన్స్‌ ఘోష్‌(11), సుదీప్‌ కుమార్‌ గార్మి(18) త్వరగా అవుటైనా మిడిల్‌ ఆర్డర్‌లో దిగిన మజుందార్‌-సౌరవ్‌ కలిసి 3 వికెట్‌కు 189పరుగులు జతచేసి బెంగాల్‌ను ఆదుకున్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ క్రీడా శాఖ మంత్రి మనోజ్‌ తివారి(15), మహమ్మద్‌ కైఫ్‌(0) క్రీజ్‌లో ఉన్నారు. ఆంధ్ర జట్టు బౌలర్లలో ఎ.లలిత్‌ మోహన్‌కు రెండు, సోయబ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. 12ఏళ్లకే రంజీల్లో అరంగేట్రం…12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీల్లో అరంగేట్రం చేసి బీహార్‌ యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ చరిత్రపుటల్లోకెక్కాడు. శుక్రవారం ముంబయితో ప్రారంభమైన రంజీమ్యాచ్‌లో బీహార్‌ తరఫున బరిలోకి దిగిన వైభవ్‌.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాల్గో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్‌ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్‌ పేరిట ఉంది. అలీముద్దీన్‌ 1942-43 రంజీ సీజన్‌లో రాజ్‌పుటానా తరఫున 12ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. 1959-60 రంజీ సీజన్‌లో 12ఏళ్ల 76రోజుల వయసులో బోస్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. 1937 సీజన్‌లో 12ఏళ్ల 247రోజుల వయసులో రంజాన్‌.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చిన్నవయసులోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది వైభవ్‌ సూర్యవంశీ మాత్రమే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో బుపేన్‌ లాల్వాని (65), సువేద్‌ పార్కర్‌ (50), తనుశ్‌ కోటియన్‌ (50) అర్దసెంచరీలతో రాణించారు. బీహార్‌ బౌలర్లలో వీర్‌ ప్రతాప్‌ సింగ్‌ 4, సకీబుల్‌ గనీ, హిమాన్షు సింగ్‌ తలో 2 వికెట్లు, అషుతోష్‌ అమన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

➡️